సరిహద్దు వివాదాల రావణకాష్ఠం

ఆర్థికాభివృద్ధికి, నూతన పెట్టుబడులకు, పారిశ్రామిక ప్రగతికి ఈశాన్య భారతం నెలవుగా మారుతోందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు తాజా పరిణామాలు గాలి తీసేస్తున్నాయి.

Published : 26 Nov 2022 00:34 IST

ర్థికాభివృద్ధికి, నూతన పెట్టుబడులకు, పారిశ్రామిక ప్రగతికి ఈశాన్య భారతం నెలవుగా మారుతోందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు తాజా పరిణామాలు గాలి తీసేస్తున్నాయి. మేఘాలయ, అస్సామ్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణంపై కథనాలు మళ్ళీ పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. గడచిన మార్చ్‌లోనే ఆ రెండు రాష్ట్రాల నడుమ ఆరు వివాదాస్పద ప్రాంతాలపై పరస్పర అవగాహన కుదిరింది. మరో దఫా చర్చల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అదిప్పుడు పట్టాలకు ఎక్కుతుందో లేదోనన్న భయానుమానాలకు అస్సాం- మేఘాలయ సరిహద్దుల్లో కాల్పుల ఉదంతం పుణ్యం కట్టుకుంది. అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రక్కునొకదాన్ని నాలుగురోజుల క్రితం అస్సాం అటవీ సిబ్బంది పట్టుకున్నారు. తమ నుంచి తప్పించుకున్నవాళ్లు మేఘాలయ నుంచి జనాన్ని ఆయుధాలను రప్పించి దాడికి దిగగా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామన్నది అస్సాం అటవీ సిబ్బంది కథనం. కాల్పుల్లో అటవీ గార్డు సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. తమ పౌరులు అయిదుగుర్ని అస్సామీలు పొట్టన పెట్టుకోవడం అమానుషమంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా- జుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్నీ నెలకొల్పారు. తనవంతుగా అస్సాం ఏకసభ్య విచారణ సంఘాన్ని కొలువు తీర్చింది. ‘దమనకాండ’పై మేఘాలయ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆ రాష్ట్రానికి ఇంధనం సరఫరా చేసేది లేదంటూ అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌ ప్రకటించిన పర్యవసానంగా, బంకుల ఎదుట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి! నిరుడు ఆగస్టులో అస్సాం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం ఏడుగురు పోలీసుల మృతికి దారితీసింది. ఇప్పుడదే స్థాయిలో అస్సాం-మేఘాలయల నడుమ హద్దుమీరుతున్న విద్వేషం దేశప్రజానీకాన్ని దిగ్భ్రాంతపరుస్తోంది.

రాష్ట్రాల సమాఖ్యగా భారతావని పరిఢవిల్లాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వాస్తవంలో, దేశంలోని కొన్ని రాష్ట్రాలు శత్రురాజ్యాలుగా కత్తులు దూసుకునేంతటి వైరభావనలతో రగిలిపోతుండటం నిశ్చేష్టపరుస్తోంది. ముఖ్యంగా ఈశాన్య భారతాన పలు సరిహద్దు వివాదాలకు అస్సామే కేంద్రబిందువు. నిజానికి మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు అస్సాం నుంచి చీలి ఏర్పడినవే. విభజనతోపాటు సరిహద్దు వివాదాలూ పురుడు పోసుకున్నాయి. మిజోరం విషయంలో ఆంగ్లేయుల జమానా నాటి అశాస్త్రీయ నిర్ణయాలతో ఆదివాసులలో రాజుకున్న అసంతృప్తి- అనంతర కాలంలో సరిహద్దు వివాదాన్ని ఎగదోసింది. అస్సాం-మిజోరం, అస్సాం-మేఘాలయలతోపాటు హరియాణా-హిమాచల్‌, లద్దాఖ్‌-హిమాచల్‌, అస్సాం-అరుణాచల్‌, అస్సాం-నాగాలాండ్‌, మహారాష్ట్ర-కర్ణాటకల నడుమ సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నట్లు ఆ మధ్య కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. అవే కాదు- నాలుగు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, పశ్చిమ్‌ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లతో ఒడిశాకు ఎన్నో పొలిమేర పేచీల చిక్కుముడులు వీడటం లేదు. రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తన పరిధిలోకి రావని పదహారేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించిన దృష్ట్యా, చొరవ చూపాల్సింది ఎవరు? అస్సాం-అరుణాచల్‌ వివాదానికి 2023 సంవత్సరంలోగా పరిష్కారం తథ్యమన్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటనపై నేటికీ కదులూ మెదులూ లేదు. సమస్యాత్మక ప్రాంతాలపై భిన్నవాదనలకు సంకుచిత రాజకీయాలు జతపడి వేర్వేరు ప్రాంతీయుల మధ్య వైషమ్యాలు భగ్గుమనడం దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తే వెలుపలి పెట్టుబడుల ప్రవాహం సన్నగిల్లుతుంది. గోతికాడ నక్కలా చైనా పొంచి ఉన్న దశలో ఈశాన్య భారతాన సఖ్యత నెలకొల్పడం- దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు ప్రాణావసరం. అంతర్రాష్ట్ర మండలి ఉండీ లేని స్థితిలో, వివాదాస్పద ప్రాంతాలపై ఆయా రాష్ట్రాలకు చెందిన పెద్దల సూచనలతో సానుకూల పరిష్కారాన్వేషణకు కేంద్రం నడుం కట్టడం సర్వోత్తమం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.