తుది మజిలీ

చిరనిద్ర అంటే మరణం. పరలోకానికి ప్రయాణం. అది మనిషికి దుఃఖ కారణం. గేహమంటే ఇల్లు. దేహమూ ఒక గేహమే. అదంటే మనిషికి ప్రాణం. దాన్ని విడిచిపెట్టాలంటే మనసొప్పదు. అయినా తప్పదు.

Published : 27 Nov 2022 00:22 IST

చిరనిద్ర అంటే మరణం. పరలోకానికి ప్రయాణం. అది మనిషికి దుఃఖ కారణం. గేహమంటే ఇల్లు. దేహమూ ఒక గేహమే. అదంటే మనిషికి ప్రాణం. దాన్ని విడిచిపెట్టాలంటే మనసొప్పదు. అయినా తప్పదు. నిద్రపోయేముందు ఇంట్లో దీపాలన్నీ ఆర్పేస్తాం. తలుపులన్నీ మూసేస్తాం. చీకటి చేసేస్తాం. చిరనిద్రకు ముందు మృత్యువు చేసేదీ- సరిగ్గా అదే. ఈ గేహంలోని అవయవాల జీవశక్తిని అది హరిస్తుంది. దేహాన్ని శిథిలం చేస్తుంది. ‘ఎవడు బతికేడు మూడు ఏభైలు?’ అని ప్రశ్నించారు శ్రీశ్రీ. అది ప్రతి మనిషికీ బాగా తెలిసిన విషయమే. అయినా జీర్ణించుకోవాలంటే కష్టం. అందుకే ముసలితనమంటే మనిషికి భయం. ముసలితనాన్ని మృత్యులోగిలికి మునివాకిలిగా భావిస్తాడు. మృత్యువంటే మార్పు మాత్రమేనని శాస్త్రం నచ్చజెప్పినా- మృత్యుభీతి మనిషికి సర్వ సహజం. ‘ముప్పున కాల కింకరులు ముంగిట నిల్చినవేళ... రోగముల్‌కొప్పరం (అధికం) అయినచో కఫము కుత్తుక నిండినవేళ...’ అంటూ దాశరథీ శతకం మరణం ఆసన్నమయ్యే స్థితిని వర్ణించింది. ఆ స్థితిలో ‘నాకు వేళయింది’ అని నిశ్చింతగా ప్రకటించడం- ప్రాజ్ఞతకు, పరిణతికి అద్దం. ‘ఆవిరి ఓడలో జలధియానమొనర్చుచు బాటసారులో భూవర! రేవులందు దిగిపోవుదురించుక వెన్క ముందుగా’ అంటూ జాషువా బోధించిన తత్త్వం ఒంటపట్టిందని అర్థం. ‘దివిజ కవివరు గుండెయల్‌దిగ్గురనగ అరుగుచున్నాడు శ్రీనాథుడు అమరపురికి’ అన్నప్పుడు శ్రీనాథుడి కంఠంలో ధ్వనించిన ధీమా... ఎవరి కంఠంలో ప్రతిధ్వనిస్తుందో- వారిని మృత్యుంజయులు అంటారు. ‘అంపశయ్యపై భీష్ముడు ఆలోచిస్తూ గడిపింది కబళిస్తున్న మృత్యువు గురించి కాదు... కరుణిస్తున్న దైవం గురించి’ అంది భారతం. అదే మనిషికి గమ్యం. జీవిత నాటకరంగంలో వేషం పూర్తికాగానే వేదిక దిగిపోవడమే ధర్మం. దాన్ని గ్రహించడమే మనిషి పరిణతికి చిహ్నం!

‘దైన్యంలేని జీవితం... అనాయాస మరణం... మరణంతో సాయుజ్యం’ అనేవి ప్రాజ్ఞుల ప్రధాన లక్ష్యాలు. మరణానంతరం సూక్ష్మశరీరంతో జీవులు దేవయాన, పితృయానాలనే రెండు దారుల్లో వేరువేరు లోకాలకు చేరుకుంటారంది భాగవతం. భాగవత అనువాదం సాయంతో ‘శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్‌’ అని యోచించాడు పోతన. అలా ముక్తికి అర్హత సాధించడమే మనిషికి ప్రథమ కర్తవ్యమని ఈ జాతి భావిస్తుంది. వారసులు శ్రద్ధతో నిర్వహించే అంత్యక్రియాదులు శ్రాద్ధకర్మలు సైతం అందుకు దోహదం చేస్తాయని నమ్ముతుంది. దశరథుడి ప్రేతకార్యాలను భరతుడు ఎలా జరిపించాడో రామాయణం వివరించింది. తండ్రి దేహాన్ని చితిపైకి చేర్చి, హృదయస్థానంలో సమిధను ప్రతిష్ఠించి ‘హే సమిత్‌ అస్యప్రేతస్య ఉపరిసాదయామి స్థాపయామి... నా తండ్రి ఉపాధిని స్వీకరించు’ అంటూ వేదోక్తంగా అంత్యక్రియను పూర్తిచేశాడట. తదనంతరం ‘దశాహ కర్మ శాస్త్రవిధిగ సల్పి, అంత కృతశౌచుడు సల్పెను శ్రాద్ధకర్మలన్‌’ అంది రామాయణ కల్పవృక్షం. పదమూడో రోజున నదీజలాల్లో అస్థిసంచయనానికై చితాభస్మాన్ని సేకరించాడట. ఇప్పటికీ ఈ జాతి అదే పద్ధతిని అనుసరిస్తోంది. అందుకు వారసులెవరూ అందుబాటులో లేని   పరిస్థితుల్లో- తాము ఊరేగింపుతోపాటు ఆయా కార్యక్రమాలన్నీ శాస్త్రీయంగా చేయిస్తామని, అంతిమంగా బూడిద ఏ నదిలో కావాలన్నా నిమజ్జనం చేస్తామని తాజాగా దిల్లీలో ఒక సంస్థ ముందుకొచ్చింది. ‘నన్ను గని యేరు జాలి చెందగ వలదు... నా చితిని పేర్చుకొన్నాడ నేనె’ అన్న కృష్ణశాస్త్రి బాణీలో సభ్యత్వరుసుము ముందే చెల్లించిన అయిదువేల మందికి ఇప్పటికే ఆ సంస్థ అంత్యేష్టిని నిర్వహించిందట. ప్రేత సంస్కారం అభినందనీయమే అయినా, కన్నబిడ్డ చేతుల్లో కడతేరిపోవాలన్న కనీస ఆకాంక్షలకు... కడసారి చూపులైనా దక్కించుకోవాలన్న కన్నీటి ఆరాటాలకు... ఇకపై అర్థమే లేకుండా పోతుందేమో!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు