గాడిన పడని ఉపాధి హామీ

పల్లెప్రాంత నిరుపేదల కడుపులు నింపుతూనే, నాణ్యమైన సామాజిక ఆస్తుల సృష్టికి బాటలు పరిచే విశిష్ట లక్ష్యంతో పదహారేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చింది.

Published : 28 Nov 2022 00:12 IST

పల్లెప్రాంత నిరుపేదల కడుపులు నింపుతూనే, నాణ్యమైన సామాజిక ఆస్తుల సృష్టికి బాటలు పరిచే విశిష్ట లక్ష్యంతో పదహారేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా అది భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావమే చూపుతోంది. పల్లె కూలీల కొనుగోలు శక్తిని పెంచుతూ; విద్య, వైద్యం వంటి కనీస అవసరాలను తీర్చుకోవడంలో ఉపాధి హామీ పథకం వారికి ఇతోధికంగా తోడ్పడుతోంది. అదే సమయంలో అక్రమార్కుల నిధుల మేతకు మేలైన పథకంగానూ అది పెనువిమర్శల పాలవుతోంది. ఈ క్రమంలో దాని అమలు తీరుతెన్నులపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కమిటీని కొలువుతీర్చింది. గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జీత్‌ సిన్హా నేతృత్వం వహిస్తున్న ఆ సంఘం- పేదరిక నిర్మూలనలో ఉపాధి హామీ పథకం సామర్థ్యాన్ని మదింపు వేయనుంది. ఉపాధి హామీ పనులకు వెల్లువెత్తుతున్న అభ్యర్థనల వెనక అసలు కారణాలు, పథకం అమలులో రాష్ట్రాల నడుమ వైరుధ్యాలు తదితరాలను పరిశీలించనుంది. ‘ఉపాధి హామీ’కి మరింతగా మెరుగుపెట్టేందుకు సూచనలు చేస్తూ, సిన్హా సంఘం మూడు నెలల్లో తన నివేదికను సర్కారుకు సమర్పించనుందని చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం సాఫల్య వైఫల్యాలపై పార్లమెంటరీ స్థాయీసంఘాలు గతంలోనే కూలంకష నివేదికలను రూపొందించాయి. నిధుల కొరతను నివారించడం, కూలీలకు సొమ్ము చెల్లింపుల్లో అలవిమాలిన జాప్యాలను పరిహరించడం, ద్రవ్యోల్బణ సూచీలకు అనుగుణంగా వేతనాలను పెంచడం వంటి 33 కీలక సిఫార్సులను ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ కమిటీ తొమ్మిది నెలల నాడే క్రోడీకరించింది. ‘ఉపాధి హామీ’ అమలును వికేంద్రీకరించి, దానికింద చేపట్టే పనులను విస్తృతీకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంతర్గత అధ్యయన నివేదిక కొద్దిరోజుల క్రితమే సూచించింది. అటువంటి మేలిమి సూచనలకు ఏపాటి మన్నన దక్కుతోంది?
నిరుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం- ‘వివరాలు లేకుండా, వేతనదారులకు తెలియకుండా పనులెలా చేపడతారు’ అని క్షేత్రసహాయకులను నిగ్గదీసింది. గ్రామీణ పేదల ఆకలి బాధలను తీర్చాల్సిన సంక్షేమ ఫలాలను పక్కదారి పట్టిస్తున్న పెడపోకడలకు ఆ ప్రశ్న అద్దంపట్టింది. సామాజిక తనిఖీలకు నిధులను బిగపడుతున్న అవ్యవస్థ- స్వాహారాయుళ్లకు అయాచిత వరమవుతోంది. దొంగ జాబ్‌కార్డులు, హాజరు పట్టీల్లో అక్రమాలు, నాసిరకం పనుల వంటివి పథకం పరమోద్దేశాన్ని నీరుగారుస్తున్నాయి. సామాజిక ఆస్తుల పరికల్పనలోనూ అనేక రాష్ట్రాలు వెనకబడినట్లుగా అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ‘ఉపాధి హామీ’ అమలులో మేటవేసిన పర్యవేక్షణ లోపాలకు సమాంతరంగా- కొవిడ్‌ కష్టకాలంలో కుప్పకూలిన కూలీ జీవితాలు తెప్పరిల్లడానికి ఆ పథకమే ఆలంబన అయ్యింది. ఉపాధి హామీ పనులకు గిరాకీ భారీగానే కొనసాగుతున్నా- మొన్నటి బడ్జెట్‌లో వాటికి కేంద్రం నిధులు బిగపట్టడమే విస్తుగొలిపింది. 2021-22 సవరించిన అంచనాలతో పోలిస్తే... 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి నిధులకు పాతిక శాతం కోతపడింది. ఉపాధిని ఆశించే గ్రామీణ పేద కుటుంబాలకు చట్టప్రకారం వంద రోజుల పని కల్పించాలంటే ప్రస్తుత బడ్జెట్‌లో రూ.2.64 లక్షల కోట్ల వరకు కేటాయింపులు అత్యావశ్యకమన్నది సామాజికవేత్తల అంచనా. కానీ, దఖలుపడ్డవి రూ.73వేల కోట్లే! ధరల మోత, ఇతరేతర బరువులతో చితికిపోతున్న బడుగు బతుకులకు ఆదాయార్జన అవకాశాలు కల్పించేందుకు- ‘ఉపాధి హామీ’ సక్రమ అమలుకు సర్కారు సమధిక ప్రాధాన్యమివ్వాలి. అర్హులకు అన్యాయం జరగకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటూ- ప్రజాధనాన్ని పీల్చేస్తున్న అవినీతి జలగల ఉద్ధృతికి తక్షణం అడ్డుకట్ట వేయాలి. అప్పుడే పేదరిక నిర్మూలనలో ఉపాధి హామీ పథకం కీలక సాధనమవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.