ప్రజామోదం పొందితేనే... పరివర్తన!

వాయు కాలుష్య కట్టడి పేరిట కొన్నేళ్లుగా వివాదాస్పద తుక్కు విధానానికి గట్టిగా ఓటేస్తున్న కేంద్రం- తలపెట్టిందే చేస్తానంటూ తాజాగా ముందడుగు వేసింది.

Published : 29 Nov 2022 00:37 IST

వాయు కాలుష్య కట్టడి పేరిట కొన్నేళ్లుగా వివాదాస్పద తుక్కు విధానానికి గట్టిగా ఓటేస్తున్న కేంద్రం- తలపెట్టిందే చేస్తానంటూ తాజాగా ముందడుగు వేసింది. పదిహేనేళ్లకు పైబడిన ప్రభుత్వ వాహనాలన్నింటినీ 2023 సంవత్సరం ఏప్రిల్‌ నుంచీ తుక్కుగా మార్చేయదలచినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అధికారిక ప్రకటన చాటుతోంది. ఈ విధానానికి సంబంధించి మార్గదర్శకాలు రాష్ట్రాలకు పంపామని, అక్కడా వాటిని పాటించాలన్నది అమాత్యుల సూచన. వాస్తవానికి, నిర్దిష్ట గడువు మీరిన వాహనాల్ని షెడ్డుకు తరలించే విధానం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అమలు కావాలని ప్రధాని మోదీ నిరుడు జనవరిలోనే కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖకు నిర్దేశించారు. ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్ల పరిధిలోని పాతబస్సులను వదిలించుకోవడం ద్వారా తమపై పడే ఆర్థికభారాన్ని తట్టుకునే స్థితిలో లేమంటూ అప్పట్లో వివిధ రాష్ట్రాలు చేతులెత్తేశాయి. క్షాళన ఎలా చేపట్టాలన్నదానిపై ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం, నీతిఆయోగ్‌, కేంద్ర ఆర్థికశాఖ మేధామథనం సాగించినా- ఇదమిత్థ కార్యాచరణ ప్రణాళిక ఏదీ వెలుగు చూడలేదు. ఇప్పటి సంక్షోభ స్థితిగతుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పెద్దయెత్తున వాహనాల తొలగింపు వ్యయభారాన్ని ఎలా తట్టుకోగలదు? ప్రస్తుతానికి తుక్కు విధానం వ్యక్తిగత వాణిజ్య వాహనాలకు స్వచ్ఛందమే అంటున్నా- మున్ముందు కేంద్రం లక్షిస్తున్నదేమిటో సుస్పష్టం. గడువు తీరిందని వాహనాలను వదిలించుకోవడమన్నది, సగటు భారతీయుడికి మింగుడుపడని అంశం. దేశీయంగా అత్యధికులకు సొంతవాహనం ఏదైనా రెండు మూడు తరాల పెట్టుబడి.  వాహనాల జీవిత కాలం నిర్ణయించడానికి ఎన్నేళ్లక్రితం ఉత్పత్తయిందన్నది ప్రామాణికాంశం ఎలాగవుతుంది? వాహనం అరుగుదలను ఎంతదూరం, ఎటువంటి రహదారులపై తిరిగారన్న ప్రాతిపదికన లెక్కించాలి. రోజంతా తిరుగుతుండే ఆర్టీసీ బస్సులను, పరిమిత దూరం ప్రయాణించే వ్యక్తిగత వాహనాలను ఒకే గాటన కట్టే ధోరణులు పూర్తిగా అసంబద్ధమైనవి!

దేశంలో పదిహేనేళ్లకు పైబడిన వాహనాల సంఖ్య సుమారు నాలుగుకోట్లుగా ఏడాదిన్నర క్రితమే కేంద్రం మదింపు వేసింది. ఆయా వాహనాలనుంచి వెలువడే పొగలోని వెయ్యి రకాలకు పైగా రసాయనాలు ప్రజారోగ్యానికి, పంట దిగుబడులకు, స్థూల ఉత్పాదక శక్తికి తూట్లు పొడుస్తున్నాయి. విద్యుత్‌ వాహన వినియోగం పెరిగితే ఇంధన దిగుమతి భారం తగ్గుతుందని, కాలుష్య నియంత్రణా సాధ్యపడుతుందని కేంద్రం విశ్లేషిస్తోంది. నిజమే- వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు ఊపందుకోవాలి. ఉన్నంతలో వాహనాల ఆయుర్దాయాన్ని పెంపొందించి, క్రమేపీ ప్రత్యామ్నాయాలవైపు పౌరులే స్వచ్ఛందంగా మరలేట్లు చేసేలా ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక పదును తేలాలి! 2030 నాటికి దేశవ్యాప్తంగా ద్విచక్ర త్రిచక్ర వాహనాల్లో 80 శాతం, బస్సుల్లో 40 శాతం, కార్లలో 30 శాతానికి పైగా ఈవీలే ఉంటాయని ఆమధ్య ‘నీతి ఆయోగ్‌’ భవిష్యదర్శనం చేసింది. ఆ కల నెరవేరడానికి ఎన్నో కలిసిరావాలి. పౌరులు, రాష్ట్రప్రభుత్వాల తోడ్పాటు లేనిదే అటువంటి పరివర్తన అసాధ్యమే. ఐస్‌లాండ్‌, కెనడా, ఫిన్లాండ్‌, ఎస్తోనియా ప్రభృత దేశాలు వాయుకాలుష్యం పెచ్చరిల్లకుండా ఆరోగ్యకర వాహన సంస్కృతి పెంపొందించడంలో పోటీపడుతున్నాయి. జనబాహుళ్యంలో పర్యావరణ పరిరక్షణ స్పృహను రగుల్కొల్పడమే వాటి విజయరహస్యం. అందుకు భిన్నంగా వ్యక్తిగత వాహనాల్ని తప్పనిసరై అయిష్టంగా వదులుకునేలా మధ్యతరగతి ప్రజానీకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టదలిస్తే, ఇక్కడ వ్యతిరేకత తప్పదు. పెద్దయెత్తున లారీలు, వ్యాన్లు, ట్యాక్సీలు, ఆటోలు మూలన పడితే అసంఖ్యాక కుటుంబాల బతుకుతెరువే దెబ్బతినిపోతుంది. గడువు ముగిసిందని అమాంతం వేటు వెయ్యకుండా శాస్త్రీయ పద్ధతిలో వాహనాల తొలగింపు చేపట్టాలి. పాత వాహనాల్ని తుక్కుగా జమకట్టేయడంతోనే ఈవీలకు గిరాకీ ఇంతలంతలైపోదు. వాటి ధరలు దిగిరావాలి. భద్రత పైనా ప్రజానీకానికి విశ్వాసం కుదరాలి. ఆ మేరకు క్రమబద్ధమైన పరివర్తనే, విషగాలుల ముట్టడికి సరైన విరుగుడు అవుతుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు