అందరి కళ్లూ గుజరాత్‌పైనే!

సమకాలీన భారత రాజకీయాలకు కేంద్రబిందువుగా అవతరించిన గుజరాత్‌లో ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. 788 మంది అభ్యర్థులు పోటీపడుతున్న 89 నియోజకవర్గాల్లో రేపు తొలిదశ పోలింగ్‌ జరగనుంది. ‘దేశభక్తులు- దేశద్రోహుల మధ్య యుద్ధం’గా ఎన్నికలను అభివర్ణిస్తున్న భాజపా- రాష్ట్రంలో మరోసారి కాషాయధ్వజాన్ని ఎగరేసేందుకు తన అమ్ములపొదిలోని అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తోంది.

Published : 30 Nov 2022 00:43 IST

సమకాలీన భారత రాజకీయాలకు కేంద్రబిందువుగా అవతరించిన గుజరాత్‌లో ఎన్నికల సమరం తారాస్థాయికి చేరింది. 788 మంది అభ్యర్థులు పోటీపడుతున్న 89 నియోజకవర్గాల్లో రేపు తొలిదశ పోలింగ్‌ జరగనుంది. ‘దేశభక్తులు- దేశద్రోహుల మధ్య యుద్ధం’గా ఎన్నికలను అభివర్ణిస్తున్న భాజపా- రాష్ట్రంలో మరోసారి కాషాయధ్వజాన్ని ఎగరేసేందుకు తన అమ్ములపొదిలోని అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తోంది. అధికారానికి మొహంవాచి నిధుల కటకటతో కునారిల్లుతున్న కాంగ్రెస్‌- హంగూ ఆర్భాటాలకు దూరంగా ‘నిశ్శబ్ద ప్రచార వ్యూహం’ అనుసరిస్తోంది.  పంజాబ్‌ను చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్‌లోనూ పాగా వేసేందుకు ‘ఆప్‌’ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయినప్పటికీ పోరు ద్విముఖమేనని ఢంకా బజాయిస్తున్న భాజపా, కాంగ్రెస్‌లు- సమరాంగణంలో ‘ఆప్‌’ అస్తిత్వాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తున్నాయి. 2017 ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీచేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ స్కంధావారాలు- మొత్తంగా 29వేల పైచిలుకు ఓట్లనే దక్కించుకోగలిగాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో అవి కేవలం 0.10శాతం! అటువంటి ‘ఆప్‌’ నిరుడు పురపాలక ఎన్నికల్లో పదమూడు శాతానికిపైగా ఓట్లను కొల్లగొట్టి, రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించింది. గుజరాత్‌ గ్రామీణ నియోజకవర్గాలపై కాంగ్రెస్‌కు ఉన్న పట్టు, పట్టణ ప్రాంత మధ్యతరగతి ప్రజానీకంలో ‘ఆప్‌’పై ఆసక్తి, కరోనా అనంతర సామాజిక ఆర్థిక పరిస్థితులు... వెరసి- విజయంపై కమలదళం ధీమాగా ఉండలేని వాతావరణాన్ని సృష్టించాయి. పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం సహా భాజపా అధిష్ఠానం కఠిన నిర్ణయాలు- ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించే ఎత్తుగడల్లో భాగాలే! తనను చూసి ఓటెయ్యమంటూ స్వరాష్ట్రీయుల చెవినిల్లు కట్టుకుని మరీ పిలుపిచ్చిన ప్రధాని మోదీ- సొంత పార్టీని మళ్ళీ విజయతీరాలకు చేరుస్తారా?

ప్రహసనప్రాయమైన మ్యానిఫెస్టోల ప్రకటనలను ప్రతిబింబిస్తూ- భాజపా తన ఎన్నికల సంకల్ప పత్రాన్ని తొలిదశ పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు విడుదల చేసింది. ఉచిత వరదానాలతో వైరిపక్షాలు ఓటర్లకు వలవేస్తుంటే- తాయిలాలతో పాటు ఉమ్మడి పౌరస్మృతి అమలు, బలవంతపు మతమార్పిళ్ల నిరోధానికి కఠినచర్యల వంటి వాగ్దానాలతో కమలదళం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. ఉగ్రవాద ముప్పును ముందుగానే గుర్తించి నివారించేందుకు ‘యాంటీ రాడికలైజేషన్‌ సెల్‌’ ఏర్పాటునూ అది ప్రకటించింది. భాజపా, ‘ఆప్‌’ అగ్రనేతలు మోదీ, అమిత్‌ షా, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు గడచిన ఏడు నెలల్లో గుజరాత్‌లో పదిహేను తడవలకు పైగా పర్యటించారు. స్వీయపక్షాలను గెలుపు దరికి చేర్చే బాధ్యతను వారు పూర్తిగా తమ  భుజస్కంధాలపైనే వేసుకున్నారు. అదే కాలవ్యవధిలో అయిదు సార్లు కూడా రాష్ట్రానికి రాని రాహుల్‌ గాంధీ- భారత్‌ జోడో యాత్రలోనే తలమునకలయ్యారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రభ కొడిగట్టిపోతున్న తరుణంలో- గుజరాత్‌ ఎన్నికల పెనుభారాన్ని స్థానిక నాయకత్వంపైనే అధికంగా మోపిన కాంగ్రెస్‌ ఎటువంటి ఫలితాలు సాధిస్తుందన్నదే ప్రశ్నార్థకం! మరోవైపు... బరిలో నిలిచిన మూడు ప్రధానపక్షాలూ నేరచరిత నేతలకు గణనీయ స్థాయిలోనే అభ్యర్థిత్వాలు కట్టబెట్టాయి. భాజపా, కాంగ్రెస్‌లకు తనవి భిన్నమైన రాజకీయాలని ఘనంగా చెప్పుకొనే ‘ఆప్‌’- ఆ రెండింటితో పోలిస్తే, హేయనేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను ఎక్కువగా పోటీలోకి దించింది. అలా తానూ ఆ తానుముక్కనేనని నిరూపించుకొంది. మద్యనిషేధం అమలులో ఉన్న గుజరాత్‌లో  ఇటీవల పద్దెనిమిది రోజుల్లోనే రూ.10.74 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను మత్తులో ముంచి పబ్బం గడుపుకోవాలనుకునే దుర్రాజకీయాలకు అది అద్దంపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన రాష్ట్రంలో ప్రజాతీర్పు ఎవరికి అనుకూలంగా వెలువడుతుందన్నదే ఆసక్తికరం!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు