నిష్పాక్షిక న్యాయంకోసం...

ప్రజాస్వామ్యానికి చట్టబద్ధమైన పాలనా ప్రమాణాలు ప్రాణప్రదమైనవి. స్వార్థ ప్రయోజనాలకోసం వాటిని కబళించజూసే నేతాస్వామ్యాన్ని నిలువరిస్తూ- న్యాయవ్యవస్థ తన విధులను స్వతంత్రంగా నిర్వర్తించాలి.

Published : 03 Dec 2022 00:23 IST

ప్రజాస్వామ్యానికి చట్టబద్ధమైన పాలనా ప్రమాణాలు ప్రాణప్రదమైనవి. స్వార్థ ప్రయోజనాలకోసం వాటిని కబళించజూసే నేతాస్వామ్యాన్ని నిలువరిస్తూ- న్యాయవ్యవస్థ తన విధులను స్వతంత్రంగా నిర్వర్తించాలి. అటువంటి నిష్పాక్షిక న్యాయవ్యవస్థ తమకు అండగా ఉందని జనావళి విశ్వసించాలంటే- రాజకీయ ఒత్తిళ్లు, రాగద్వేషాలకు అతీతంగా న్యాయనిర్ణయాలు చేయగలిగినవారే ధర్మపీఠాలను అధిష్ఠించాలి. ఆ మేరకు సమర్థత, రుజువర్తన కలిగిన వ్యక్తులను పారదర్శక పద్ధతిలో న్యాయమూర్తులుగా ఆచితూచి ఎంపిక చేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం వ్యవస్థ మంచిచెడ్డలపై కొన్నేళ్లుగా సాగుతున్న చర్చోపచర్చలు ఇటీవల తీవ్రరూపం దాల్చాయి. కొలీజియం సిఫార్సులను ఎంతకాలం పెండింగ్‌లో ఉంచుతారని నిగ్గదీసిన సుప్రీంకోర్టు- కేంద్రం వైఖరి విసుగు పుట్టిస్తోందని కొద్దిరోజుల క్రితం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ప్రతిపాదనల దస్త్రాలను ప్రభుత్వం పేరబెడుతోందని అనకండి... అటువంటప్పుడు సర్కారుకు అసలు దస్త్రాలే పంపకండి’ అంటూ కేంద్ర న్యాయశాఖామాత్యులు కిరణ్‌ రిజిజు పరుషంగా వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులను నియమించే పని ప్రభుత్వానిదంటూ కొన్నాళ్లుగా ఆయన కొలీజియం వ్యవస్థపై వరసగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నియామకాల్లో జాప్యానికి కేంద్రాన్ని నిందించడం తగదంటున్న అధికారవర్గాలు- 24 హైకోర్టుల్లో ఏడాది నుంచి అయిదేళ్లుగా ఖాళీగా ఉన్న 183 జడ్జీ పోస్టుల భర్తీకి సంబంధిత కొలీజియాల నుంచి ప్రతిపాదనలేవీ రాలేదని చెబుతున్నాయి. ప్రజాప్రయోజనాలకు పట్టంకట్టేలా కీలక వ్యవస్థల నడుమ అర్థవంతమైన సమన్వయాన్ని రాజ్యాంగ నిర్మాతలు అభిలషించారు. అందుకు దోహదపడని వాద ప్రతివాదాలేవైనా సరే, చినికి చినికి గాలివానలై సత్వర న్యాయఫలాలపై సామాన్యుల ఆశలను తుడిచిపెట్టేస్తాయి!

న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే పద్ధతి ఇండియాలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని పాలకశ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. దాన్ని పసలేని వాదనగా కొట్టిపడేస్తున్న న్యాయవర్గాలు- జడ్జీల నియామక ప్రక్రియలో ప్రస్తుతం విభిన్న వ్యవస్థలు సముచిత పాత్రలే పోషిస్తున్నాయని ఉద్ఘాటిస్తున్నాయి. ఇందిరా గాంధీ హయాములో విశృంఖలమైన అధికార దుర్వినియోగం- న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనా నీలినీడలు పరచింది. న్యాయస్థానాల విధుల్లో సర్కారీ అనుచిత జోక్యంపై పెచ్చరిల్లిన ఆందోళనల ఫలితంగానే కొలీజియం వ్యవస్థ రూపుదాల్చింది. అయినప్పటికీ అది రాజ్యాంగంలో లేనిదని... ఆ వ్యవస్థ జవాబుదారీతనానికి ప్రోదిచేయడం లేదన్న విమర్శలు ఎప్పటినుంచో వినవస్తున్నాయి. అలాగని న్యాయమూర్తుల నియామకాల్లో అంతిమ అధికారం ప్రభుత్వాలకే దఖలుపరిస్తే- నేరచరిత నేతలతో లుకలుకలాడుతున్న రాజకీయాలు న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను బలితీసుకుంటాయన్న భయసందేహాలు వ్యక్తమవుతున్నాయి. జడ్జీ పోస్టుల ఎంపికలకు యూకేలో స్వతంత్ర న్యాయ నియామకాల సంఘం కొలువుతీరింది.  న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు,  న్యాయవాదులు, న్యాయ ఆచార్యుల భాగస్వామ్యంతో రాజ్యాంగబద్ధమైన సంస్థగా దక్షిణాఫ్రికాలో జుడీషియల్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటైంది. న్యాయమూర్తుల నియామకాలతో పాటు న్యాయాధికారులపై వచ్చే ఫిర్యాదుల విచారణ బాధ్యతలనూ అదే వహిస్తుంది. జడ్జీల ఎంపికల్లో ఎటువంటి అనుమానాలకు ఆస్కారమివ్వని ప్రత్యేక పద్ధతులను మరెన్నో దేశాలు అనుసరిస్తున్నాయి. వాటిని అధ్యయనం చేసి... ఎవరూ వేలెత్తి చూపించలేని న్యాయదీక్షాపరులను జడ్జీలుగా ఎంచే విశిష్ట విధానాన్ని దేశీయంగానూ రూపొందించుకోవాలి. ఎవరి వాదనకు వారు పరిమితమయ్యే పట్టుదలలను విడనాడి దేశ శ్రేయస్సుకోసం  న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఆ మేరకు ఇప్పటికైనా ముందడుగు వేయాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.