రాతను మార్చే ‘గీత’

రవీంద్రుడి గీతాంజలిని తెలుగులోకి అనువదిస్తూ ‘చిత్తమెచట భయశూన్యమో... శీర్షమెచట ఉత్తుంగమో... జ్ఞానమెచట ఉన్ముక్తమో...’ ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి నా దేశాన్ని నడిపించమని దేవుణ్ని అభ్యర్థించారు రజనీకాంతరావు. ‘ఉక్కు నరాలు ఇనుప కండరాలు జవం జీవమూ ఆత్మస్థెర్యం...’ నా జాతిజనులకు ప్రసాదించమని ప్రార్థించాడు వివేకానందుడు.

Published : 04 Dec 2022 00:31 IST

రవీంద్రుడి గీతాంజలిని తెలుగులోకి అనువదిస్తూ ‘చిత్తమెచట భయశూన్యమో... శీర్షమెచట ఉత్తుంగమో... జ్ఞానమెచట ఉన్ముక్తమో...’ ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి నా దేశాన్ని నడిపించమని దేవుణ్ని అభ్యర్థించారు రజనీకాంతరావు. ‘ఉక్కు నరాలు ఇనుప కండరాలు జవం జీవమూ ఆత్మస్థెర్యం...’ నా జాతిజనులకు ప్రసాదించమని ప్రార్థించాడు వివేకానందుడు. ఆ సముదాత్త సంకల్పాలు, సంపన్న ఆశయాలు నెరవేరాలంటే ఈ జాతి సంప్రదించవలసింది, ఆశ్రయించవలసింది- భగవద్గీతను!  భగవద్గీత అంటే పుస్తకం కాదు- స్వయంగా భగవంతుడే పూరించిన సమర శంఖం! ఉడిగిన వయసువారితో ఊఁ కొట్టించుకోవడానికి పుట్టింది కాదది, పడుచు వయసు ఉడుకురక్తాన్ని ఉరకలెత్తించడం దాని పరమ లక్ష్యం. ఎవరో మౌని ప్రశాంతంగా కూర్చోబెట్టి శిష్యులకు చేసిన జ్ఞానోపదేశం కాదు- ధర్మ సంకటంలో పడి కర్మ సన్యాసానికి సిద్ధమైన యోధుణ్ని తిరిగి కొదమసింహంలా మార్చిన కర్తవ్య నిర్దేశం భగవద్గీత... మార్గదర్శనం భగవద్గీత! యుద్ధం... రెండు రాజ్యాల మధ్య జరుగుతుందని చరిత్ర చెబుతోంది. యుద్ధం... రెండు దేశాల మధ్య సంఘర్షణ అని ప్రస్తుతం మనం గమనిస్తున్నాం. ఆ రెండూ తాత్కాలికాలు. అనునిత్యం జరుగుతూనే ఉండే యుద్ధం ఒకటుంది- అది మానవ మస్తిష్కాల్లో... నిత్య జీవితాల్లో! ఇది శాశ్వతమైంది... నిరంతరమైంది. భావోద్వేగ సంయమనమే దానికి సరైన పరిష్కారం. దానికి సాధనమే భగవద్గీత! అర్జునుడు నిలబడింది కురుక్షేత్రంలో... మనిషి పోరాడుతున్నది జీవన రణక్షేత్రంలో- అంతే తేడా! గీత తోడుంటే మనిషి అర్జునుడవుతాడు, విజయుడవుతాడు. ‘స్వర్గానికి నిచ్చెన వేస్తాం... మరణానికి ప్రాణం పోస్తాం’ అనే ఆధునిక భావాలతోనూ ముందుకొచ్చే యువత చేతికి చిక్కిన గాండీవం- భగవద్గీత.

ఈ లోకంలో ఉన్నవన్నీ భారతంలో ఉన్నట్లే- ఆధునిక జీవన సమరానికి అవసరమైన ఆయుధాలన్నీ భగవద్గీతలో ఉన్నాయి. గీతను పరికించవలసింది- తపనతో, తాదాత్మ్యంతో. అలాంటివారికి ఆ గాండీవ అక్షయ తూణీరంలోంచి అమోఘ శస్త్రాలు అందుతూనే ఉంటాయి. ‘శక్తి అనేది కేవలం శారీరక దారుఢ్యంలోంచి, కండబలంలోంచి రాదు- మొక్కవోని దృఢ సంకల్పంలోంచి వస్తుంది’ అని నమ్మిన మహాత్మాగాంధీ తన సంకల్పాలకు అవసరమైన ప్రాణవాయువును గీతనుంచి స్వీకరించారు. ‘భగవద్గీతను నేను ముందే అధ్యయనం చేసి ఉంటే, నా పరిశోధనలు ఇంతకన్నా అర్థవంతంగా ఉండేవి’ అని ఐన్‌స్టీన్‌ ప్రకటించారు. ‘అతి గుహ్యంబిది, నీవు భూరికృప నీ అధ్యాత్మముం కాన చేసితివి... నీ రహస్య ధర్మ ఉపదేశంతో నాకు ఆత్మజ్ఞానం లభించింది’ అన్న భీష్మపర్వంలోని అర్జునుడి మాటలకు ప్రతిధ్వనులే పెద్దల పై స్పందనలు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ఠ... మానసిక బలహీనతలను విడిచిపెట్టు... లేచి నిలబడి ఆయుధం చేపట్టు’ అని బోధించాడు కృష్ణుడు. పనినే తప్ప పలాయనవాదాన్ని భారతీయ సారస్వతం ఎక్కడా సమర్థించలేదు. విల్లు వంగినప్పుడే బాణం, ఒళ్లు వంగినప్పుడే కర్తవ్యం- లక్ష్యాన్ని ఛేదిస్తాయన్నది గీతా సారాంశం. ఓటమిని ఒప్పుకోవద్దని, ఓరిమిని వదులుకోవద్దనీ బోధించింది- భగవద్గీత. ‘సకల స్ఫూర్తిదాత సన్మార్గ సంధాత మనిషి నుదుటి రాత మార్చు- గీత’ అన్నారందుకే కవులు. విజయగాథలకు వీరగంధపు పూత- భగవద్గీత! భయ సందేహ అజ్ఞానాలను తొలగించి మనిషిని కర్తవ్యంలోకి మేల్కొలిపే ధీరవచనం- భగవద్గీత. ‘సుమరస మాధురి క్రమముగ గ్రోలుట భ్రమరములకు ఎరుక’ అన్నారు తత్త్వజ్ఞులు. గీతామకరందాన్ని తుమ్మెదల మాదిరిగా ఒడుపుగా గ్రహించడమే తక్షణ కర్తవ్యం. అది ఈ యుగావసరం!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి