మహాసముద్రంపై నిఘా నేత్రం
ఏడున్నర వేల కిలోమీటర్లకు పైబడిన సముద్రతీరం- ఆర్థికంగా ఇండియాకు కల్పవృక్షమే.
ఏడున్నర వేల కిలోమీటర్లకు పైబడిన సముద్రతీరం- ఆర్థికంగా ఇండియాకు కల్పవృక్షమే. ఆదమరిస్తే దేశ భద్రతకు అది అత్యంత ప్రమాదకరమైనది కూడా! 1993లో ముంబయిని వణికించిన వరస విస్ఫోటాల కోసం ఉగ్రమూకలకు పేలుడు పదార్థాలు సముద్ర మార్గంలోనే సరఫరా అయ్యాయి. సాగరం మీదుగా దొంగచాటుగా భారత్‌లోకి ప్రవేశించిన పాక్ ముష్కరులు- పద్నాలుగేళ్ల క్రితం ముంబయి నగరాన్ని మళ్ళీ నెత్తుటి మడుగులో ముంచేశారు. సముద్రం ద్వారా ఇండియాలోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని నౌకాదళాధిపతిగా అడ్మిరల్ సునీల్ లాంబ మూడేళ్ల క్రితం హెచ్చరించారు. ఆ ముప్పుతో పాటు హిందూ మహాసముద్రంలో ముమ్మరిస్తున్న చైనా కార్యకలాపాలు- తీరప్రాంతాలను శత్రుదుర్భేద్యంగా తీర్చుదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఇండియాకు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో కడలిలో కదలికలపై అనుక్షణం నిఘా వేస్తూ, ప్రమాదాలను పసిగట్టి నివారించగలిగే నేషనల్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్(ఎన్ఎండీఏ) ప్రాజెక్టును ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఇటీవల ఆమోదించింది. 2008 ముంబయి దాడులు నేర్పిన గుణపాఠాల నుంచి పురుడుపోసుకున్న నావికా సమాచార నిర్వహణ, విశ్లేషణ కేంద్రం(ఐఎంఏసీ, గుర్‌గ్రామ్)- తాజా సమీకృత నిఘా వ్యవస్థ ఎన్ఎండీఏలో అంతర్భాగం కానుంది. వివిధ భావసారూప్య దేశాలు భాగస్వాములైన హిందూ మహాసముద్ర ప్రాంత సమాచార సంలీన కేంద్రం(ఐఎఫ్‌సీ-ఐఓఆర్) తోడుగా ఎన్ఎండీఏ- భారత భద్రతకు రక్షరేకు కాగలదనే విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. అవి వాస్తవ రూపం దాల్చాలంటే- ఇతోధిక మౌలిక సదుపాయాల పరికల్పన, నిపుణ మానవ వనరుల నియోగంతో నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలి!
ప్రపంచ చమురు రవాణాలో ప్రధానపాత్ర పోషిస్తున్న హిందూ మహాసముద్రంలో అనునిత్యం సుమారు 13వేల నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాటి మాటున మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడే నేర ముఠాలూ అక్కడ విరివిగా సంచరిస్తుంటాయి. ప్రస్తుతం ఆ మహాసాగరంలో చైనావి నాలుగు నుంచి ఆరు యుద్ధనౌకలతో పాటు మరికొన్ని పరిశోధక నౌకలు తిరుగాడుతున్నాయి. చేపలవేటకు ఆ దేశం నుంచి భారీగా పడవలూ అక్కడికి తరలివస్తున్నాయి. స్వీయరక్షణ కోసం వాటన్నింటినీ ఒక కంట కనిపెట్టడం కత్తిమీద సాము వంటిదే. సమకాలీన పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనుకునే ప్రతి దేశమూ- రక్షణ శాఖామాత్యులు రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఉద్ఘాటించినట్లు, తన ప్రధాన భూభాగానికి సుదూర తీరాల్లోనూ సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించగలిగే శక్తిసామర్థ్యాలను సముపార్జించుకోవాలి. అందుకు తగినట్లుగా అజేయ నౌకాదళాన్ని నిర్మించుకోవాలి. కానీ, దేశీయంగా అందుకోసం అరకొర కేటాయింపులే దక్కుతున్నాయి. చైనాకు సరిజోడుగా మన నౌకాదళ ఆధునికీకరణను అవే వెనక్కి లాగుతున్నాయి. దేశ భద్రత మెరుగుపడాలంటే- స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధనౌకల నిర్మాణం చురుకందుకోవాలని ప్రధాని మోదీ గతంలో ఉద్బోధించారు. ఆ మేరకు 2047 నాటికి వందశాతం ఆత్మనిర్భరత సాధించగలమని నౌకాదళ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, వ్యూహాత్మకంగా అతికీలకమైన నౌకా నిర్మాణ రంగంలో చైనా, దక్షిణ కొరియా, జపాన్‌లతో పోలిస్తే- ఇండియాది పూర్తిగా వెనకబాటుతనమే. ప్రపంచ నౌకా నిర్మాణ పరిశ్రమలో ఆ మూడు దేశాల వాటా 90శాతానికి పైబడితే- మనది ఒకశాతం కన్నా తక్కువకే పరిమితమైంది. దేశీయంగా స్వావలంబన సాధించడమే కాదు, నౌకానిర్మాణంలో ప్రపంచ అవసరాలను తీర్చేలా స్థానిక పరిశ్రమను మలుస్తామన్నది సర్కారీ ప్రవచిత లక్ష్యం. సంస్కరణాత్మక దృష్టితో స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తేనే దాన్ని చేరుకోగలం. దానికి సమాంతరంగా నౌకాదళానికి అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చే క్రతువు వేగవంతం కావాలి. అప్పుడే కడలి అంచుల మీదుగా పోనుపోను పెచ్చరిల్లుతున్న భద్రతా సవాళ్లను దీటుగా కాచుకోగలం!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: భార్య చూస్తుండగానే భవనం పైనుంచి దూకేసిన భర్త
-
Movies News
Bollywood: స్టార్ హీరోపై నెటిజన్ల ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలంటూ ట్వీట్లు
-
Sports News
Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ గుడ్‌బై!
-
Movies News
OTT Movies: బొమ్మ మీది.. స్ట్రీమింగ్ వేదిక మాది.. ఇప్పుడిదే ట్రెండ్!
-
World News
EarthQuake: భూకంపం ధాటికి.. రెండు ముక్కలైన ఎయిర్‌పోర్టు రన్‌వే
-
Politics News
Andhra News: బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు