డాక్టర్లు కల్తీ... మందులు కల్తీ!

రోగులకు స్వస్థత చేకూర్చే వైద్యచికిత్సలో ఔషధాల పాత్ర, ప్రాధాన్యం ఎనలేనివి. అందువల్లే, రిజిస్టరైన విక్రేతలు తప్ప మరెవరూ మందులు అమ్మే వీల్లేదని కేరళ ఉన్నత న్యాయస్థానం వంటివి గతంలోనే స్పష్టీకరించాయి.

Published : 06 Dec 2022 00:42 IST

రోగులకు స్వస్థత చేకూర్చే వైద్యచికిత్సలో ఔషధాల పాత్ర, ప్రాధాన్యం ఎనలేనివి. అందువల్లే, రిజిస్టరైన విక్రేతలు తప్ప మరెవరూ మందులు అమ్మే వీల్లేదని కేరళ ఉన్నత న్యాయస్థానం వంటివి గతంలోనే స్పష్టీకరించాయి. ఫార్మసిస్టుకు బదులు ఇతరులు ఔషధాలు విక్రయించడంవల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న వాదనలకు వివిధ సందర్భాల్లో న్యాయస్థానాలు ఓటేశాయి. వాస్తవంలో, నేటికీ దేశం నలుమూలలా తరతమ భేదాలతో నిబంధనల్ని తుంగలో తొక్కి ఔషధాల విక్రయం యథేచ్ఛగా పెచ్చరిల్లుతోంది. చాలాచోట్ల ఫార్మసిస్టులు నిర్వర్తించాల్సిన బాధ్యతలను క్లర్కులు, నర్సులు చక్కబెట్టడాన్ని నిరసిస్తూ ఆమధ్య పట్నా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యమొకటి దాఖలైంది. తప్పనిసరిగా రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులనే నియమించాల్సిందిగా నిర్దేశించాలన్న ఆ అర్జీని న్యాయస్థానం తోసిపుచ్చిన తీరును సుప్రీంకోర్టు తాజాగా తప్పుపట్టింది. నకిలీ ఫార్మసిస్టులు అడ్డగోలుగా బాధ్యతల్ని చెరపట్టినా, అసలు ఫార్మసిస్టులనే నియమించక పోయినా ప్రజారోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుందన్న సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు అక్షరసత్యాలు. నకిలీ ఫార్మసిస్టులపై చర్యలు చేపట్టడంలో బిహార్‌ ప్రభుత్వ నిష్క్రియను, ఏయే ఆస్పత్రుల్లో ఎంతమంది రిజిస్టరైన నిపుణులు పనిచేస్తున్నారో లెక్కలు రాబట్టడంలో ఆ రాష్ట్ర ఫార్మసీ మండలి అలసత్వాన్ని సుప్రీంకోర్టు సూటిగా తప్పుపట్టింది. ఒక్క ముక్కలో- ఆస్పత్రులు, మందుల దుకాణాల్లో రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టులే ఉండేట్లు చూడాల్సింది ఫార్మసీ మండలి, సంబంధిత రాష్ట్రప్రభుత్వమేనని తేల్చి చెప్పింది. సహేతుక వ్యాజ్యాన్ని పునఃపరిశీలించాలంటూ సుప్రీంకోర్టు ఇదమిత్థంగా ఆదేశించిన దరిమిలా, బంతి తిరిగి పట్నా హైకోర్టు బరిలో పడింది!

ఆరోగ్యం పౌరుల ప్రాథమిక హక్కు అన్నది భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి. దురదృష్టవశాత్తు, దానికి నిలువెల్లా తూట్లు పడుతున్నాయి. అందుకు భిన్నాంశాలు పోటాపోటీగా పుణ్యం కట్టుకుంటున్నాయి. ఔషధ తయారీ రంగాన దిగ్గజ శక్తిగా భారత్‌ మన్ననలు పొందుతున్నా- ప్రాణాలు నిలబెట్టగల మందుల చుట్టూ చీకటి కోణాలెన్నో నిర్ఘాంతపరుస్తున్నాయి. ఇండియాలో నకిలీ మందుల వ్యాపారం అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా ఎదిగిందని ఎనిమిదేళ్ల క్రితమే కేంద్ర దర్యాప్తు సంఘం సంచాలకులుగా  అనిల్‌ సిన్హా తూర్పారపట్టారు. ఇటీవల గాంబియాలో అరవై మందికి పైగా పిల్లల అర్ధాంతర మరణాలకు భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న దగ్గుమందే కారణమన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన గగ్గోలు పుట్టించింది. దేశంలో నాసి, నకిలీ మందులు- ఒక పార్శ్వమే. మన అల్లోపతీ డాక్టర్లలో 57 శాతం వైద్యపరమైన అర్హతలు లేనివారేనని గణాంకాలు చాటుతున్నాయి. సరైన పాళ్లలో కచ్చితమైన ఔషధాలు అందించాల్సిన ఫార్మసిస్టుల్లోనూ కల్తీల జోరు బెంబేలెత్తిస్తోంది. ఆమధ్య పంజాబులో అయిదు వేల మందికి పైగా నకిలీ ఫార్మసిస్టుల బాగోతం రచ్చకెక్కినా, మరింతగా నిబంధనల సడలింపునకే అక్కడి ఫార్మసీ మండలి మొగ్గుచూపడం- ఎక్కడికక్కడ వేళ్లూనుకున్న అవ్యవస్థను కళ్లకు కట్టింది. ఐరోపా దేశాల్లో నకిలీ ఔషధాలకు సంబంధించి నేరం రుజువైతే- పదిహేనేళ్ల వరకు జైలుశిక్ష తప్పదు. భారత్‌లో నాసిరకం ఔషధ వినియోగంతో మనుషుల ప్రాణాలు పోవడానికి కారకులైనవాళ్లకు గరిష్ఠంగా యావజ్జీవ కారాగారవాసం విధించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు కంతలమయమన్న విమర్శలున్నాయి. ఆవశ్యక మార్పులతో ఆ బిల్లుకు సత్వరం మోక్షం దక్కితే- స్వస్థ సమాజ ఆవిష్కరణ వైపు అది తొలి అడుగవుతుంది. దాంతోపాటు సర్కారీ వైద్య సేవల్ని గాడినపెట్టి, సిబ్బంది ఖాళీల్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసి, అన్ని రాష్ట్రాల డ్రగ్‌ కంట్రోలర్లూ ఫార్మసీ మండళ్లలో ప్రభుత్వం చురుకు పుట్టించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.