జీ20 ఆతిథ్యం... అపురూప అవకాశం

అభివృద్ధి చెందిన దేశాలు, ప్రగతి పథంలో దూసుకుపోతున్న వర్ధమాన రాజ్యాల మేలుకలయిక... జీ20. విశ్వ మానవాళిలో అరవై శాతానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి ఆ కూటమే ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాని వాటా ఎనభై శాతానికి పైమాటే.

Published : 07 Dec 2022 00:44 IST

అభివృద్ధి చెందిన దేశాలు, ప్రగతి పథంలో దూసుకుపోతున్న వర్ధమాన రాజ్యాల మేలుకలయిక... జీ20. విశ్వ మానవాళిలో అరవై శాతానికి, అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి ఆ కూటమే ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాని వాటా ఎనభై శాతానికి పైమాటే. అటువంటి విశిష్ట కూటమికి నూతన సారథిగా ఇండియాకు అపూర్వ అవకాశం అందివచ్చింది. దాన్ని అన్నివిధాలా సద్వినియోగం చేసుకునేందుకు సూచనలూ సలహాలను ఆహ్వానిస్తూ కేంద్రం తాజాగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయడం హర్షణీయం. బృహత్తరమైన జీ20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణా యజ్ఞానికి అది సరైన ఆరంభం. ప్రధాని మోదీ పిలుపిచ్చినట్లు, యావద్దేశమూ ఒకే జట్టుగా పరిశ్రమిస్తేనే- జీ20 సారథ్యంలో ఇండియా తనదైన ముద్ర వేయగలుగుతుంది. ప్రపంచం ప్రస్తుతం బహుముఖ సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఉరుము లేని పిడుగులా కరోనా మహమ్మారి విరుచుకుపడితే- ఉక్రెయిన్‌ ఊపిరి తీసేసేందుకు కర్కశరణ రక్కసికి రష్యా ఆవాహన పలికింది. తత్ఫలితంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమయ్యాయి. ఇంధనం, ఆహారం, ఎరువుల అందుబాటుపై భయాందోళనలు కొనసాగుతున్నాయి. తెగ్గోసుకుపోతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు- కోట్ల సంఖ్యలో సామాన్యులను పేదరికంలోకి నెట్టేస్తున్నాయి. వీటికి తోడు పెచ్చరిల్లుతున్న పర్యావరణ మార్పులు పెనువిపత్తులకు కారణభూతమవుతున్నాయి. ఇటువంటి సంక్షుభిత తరుణంలో- ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత’ అనే విశేష స్ఫూర్తితో జీ20 పగ్గాలను భారతావని చేపట్టింది. వసుధకు శ్రేయోదాయకమైన సరికొత్త సమష్టి అజెండాను జీ20కి ఇండియా నిర్దేశించగలదన్న నమ్మకం- కూటమి సభ్యదేశాల్లో ప్రస్ఫుటమవుతోంది!

బహుభాషలు, భిన్న సంస్కృతుల సంగమ క్షేత్రం... భారతదేశం.    వైవిధ్యభరితమైన మన పురిటిగడ్డ వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పేందుకు జీ20 అధ్యక్షత అమితంగా అక్కరకొస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు  తొమ్మిది, పదో తేదీల్లో జీ20 దేశాధినేతల 18వ శిఖరాగ్ర సదస్సుకు న్యూదిల్లీ ఆతిథ్యమివ్వనుంది. సన్నాహకాల్లో భాగంగా 32 రంగాల్లో రెండొందలకు పైగా సమావేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు యాభై ప్రాంతాలు వాటికి వేదికలు కానున్నాయి. మనవైన సాంస్కృతిక సంపదలకు నెలవులైన ఆయా ప్రదేశాల విశేషాలను విదేశీ అతిథులకు వివరించేందుకు వెయ్యి మంది గైడ్లను కేంద్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా నియోగిస్తోంది. ‘అతిథి దేవోభవ’ అన్న స్వదేశీ సంప్రదాయానికి పట్టంకట్టడంలో రాష్ట్రాలూ పోటీపడితే- అంతర్జాతీయంగా భారతీయ మూర్తిమత్వం మరింతగా తేజోవంతమవుతుంది. అంతర్గతంగా రాజకీయ విభేదాలు  ఎన్ని ఉన్నప్పటికీ విశాల దేశ ప్రయోజనాల రీత్యా అందరూ ఏకతాటిపై నడవాల్సిందే. అప్పుడే చైనా వంటి కలహాలమారి పొరుగు రాజ్యాన్ని నిలువరించడం సాధ్యపడుతుంది. జీ20 మేధామథనానికి కూటమి సభ్య, ఆహ్వానిత దేశాలూ అంతర్జాతీయ సంస్థల నుంచి ఇరవై వేల మందికి పైగా ప్రతినిధులు ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయి. 2016-2021 మధ్య దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులపై దాష్టీకాలకు సంబంధించి 2,136 కేసులు నమోదయ్యాయి. కాబట్టి, జీ20 అతిథుల భద్రతా ఏర్పాట్లలో ఎక్కడా వీసమెత్తు పొరపాటుకు ఆస్కారమివ్వకపోవడం- దేశ ప్రతిష్ఠతో ముడివడిన కీలకాంశం. జీ20 కూటమికి ఇండియా నాయకత్వం- కొవిడ్‌ తరవాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశీయ పర్యాటకం, దాని అనుబంధ రంగాలకు  కొత్త వెలుగులు అద్దగలదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలన్నీ రాజనీతిజ్ఞతతో వ్యవహరిస్తేనే- జీ20 వేదికగా భారతీయ ‘బ్రాండ్‌’ విశ్వవ్యాప్తమవుతుంది!

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి