ఈ-వ్యర్థాలపై సమర్థ వ్యూహం

అధునాతన ఉపకరణాల వినియోగం ఇంతలంతలవుతున్న తరుణంలో, సాంకేతిక విప్లవమనే పాదుకు విరగకాస్తున్న విషఫలాలే- ఎలెక్ట్రికల్‌, ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు.

Published : 08 Dec 2022 01:00 IST

ధునాతన ఉపకరణాల వినియోగం ఇంతలంతలవుతున్న తరుణంలో, సాంకేతిక విప్లవమనే పాదుకు విరగకాస్తున్న విషఫలాలే- ఎలెక్ట్రికల్‌, ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు. నేలను నీటిని గాలిని కలుషితం చేస్తున్న ఈ-వ్యర్థాలు పర్యావరణంతోపాటు ప్రజారోగ్యానికీ పెనుసవాళ్లు రువ్వుతున్నాయి. 2019 సంవత్సరంలో విశ్వవ్యాప్తంగా 5.36 కోట్ల టన్నుల ఎలెక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉత్పత్తయినట్లు ‘గ్లోబల్‌ ఈ-వేస్ట్‌ మానిటర్‌’ మదింపు వేసింది. ఈ-వ్యర్థాల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో చైనా, అమెరికాల తరవాత మూడో స్థానాన నిలిచిన భారత్‌ వాటా 32 లక్షల టన్నులు. గుట్టలు గుట్టలుగా జమవుతున్న ఆ వ్యర్థాలను పద్ధతిగా వదిలించుకోని పక్షంలో తీవ్ర దుష్పరిణామాలు వాటిల్లక మానవు. అవి మనిషి మెదడును, నాడీ వ్యవస్థను, కాలేయాన్ని, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. గర్భస్త పిండాలపైనా దుష్ప్రభావం ప్రసరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంలో, దేశవ్యాప్తంగా ఈ-వ్యర్థాల్లో 78 శాతందాకా సేకరణకే నోచుకోవడం లేదు. పాతబడిన చరవాణులు, టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లు తదితరాలెన్నో యథాతథంగా చెత్తకుప్పల్లోకి చేరిపోతున్నాయి. ఆయా పరికరాల్లోని మూలకాలు, రసాయనాలు నేరుగా భూమిపొరల్లోకి ఇంకి మానవాళికి అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. తగినంతగా రీసైక్లింగ్‌, పునశ్శుద్ధి ఊపందుకోని కారణంగా ఇనుము, సీసం, రాగితోపాటు బంగారం, నియోడిమియం, కాడ్మియం వంటి విలువైన లోహాలూ చేజారిపోతున్నాయి. ఏడాదికాలంలో ఈ-వ్యర్థాల నుంచి సుమారు ఎనిమిది వేలకోట్ల రూపాయల విలువైన బంగారం వెలికితీసే అవకాశాన్ని ఇండియా కోల్పోతున్నదని ఫిక్కి (భారతీయ వాణిజ్య పారిశ్రామిక సంస్థల సమాఖ్య) ఆమధ్య లెక్కకట్టింది. వ్యర్థాలనుంచి సంపద సృష్టి చురుకందుకోవాలన్న ప్రధాని మోదీ దిశానిర్దేశం అమలుకు నోచుకొనేదెన్నడు?

దేశంలో ఈ-వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసమంటూ 2011లోనే నిర్దిష్ట నిబంధనావళిని క్రోడీకరించారు. వాస్తవిక కార్యాచరణ చతికిలపడిన దరిమిలా నూతన మార్గదర్శకాలను 2016లో మోదీ ప్రభుత్వం రూపొందించింది. ఆ మేరకు పకడ్బందీ చర్యల్ని ఉపేక్షిస్తే వాటిల్లే దుష్పరిణామాల పట్ల జనచేతన పెంపొందించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వాలదే. అవి మిన్నకుండిపోవడం నేటికీ చూస్తున్నాం. విధ్యుక్తధర్మ నిర్వహణలో రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్ల పోటాపోటీ వైఫల్యం నివ్వెరపరుస్తోంది. 14 లక్షల టన్నులకు పైబడిన సామర్థ్యంతో 470దాకా అధీకృత రీసైక్లర్లు పనిచేస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా- అందులో సగం మేరకైనా వినియోగంలోకి రావడం లేదు. ఈ-వ్యర్థాల్లో సింహభాగం అసంఘటిత రంగానికి పోటెత్తుతోంది. పునశ్శుద్ధి చేసే నైపుణ్యం, తగిన శిక్షణ లేని అభాగ్య కార్మికులకు, వారి సంతానానికి సైతం మహమ్మారి వ్యాధుల ప్రకోపం వ్యర్థాల పుణ్యమే! వస్తూత్పాదకులే ఈ-వ్యర్థాలను వెనక్కి తీసుకునే విధానం నార్వేలో ఒకటిన్నర దశాబ్దాలుగా అమలవుతోంది. కాలం చెల్లిన ఎలెక్ట్రికల్‌ ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాల సమీకరణను పునశ్శుద్ధిని ప్రణాళికాబద్ధంగా పట్టాలకు ఎక్కించడంలో దక్షిణ కొరియా, యూకే, జపాన్‌, నెదర్లాండ్స్‌ మిన్నగా రాణిస్తున్నాయి. పునశ్శుద్ధిలో ఎంతగానో వెనకబడిన ఇండియా- హానికారక వ్యర్థాల అక్రమ దిగుమతుల విషయంలోనూ అప్రతిష్ఠపాలవుతోంది. పాతటీవీలు, కంప్యూటర్లు తదితరాలను పౌరులే స్వచ్ఛందంగా పునశ్శుద్ధి కేంద్రాలకు తరలించే స్వీడన్‌ తరహా సంస్కృతి ఇక్కడా వేళ్లూనుకునేలా ప్రభుత్వ కార్యాచరణ పదును తేలాలి. ఈ-వ్యర్థాల నిర్వహణలో తమవంతు పాత్ర పోషణకు వస్తూత్పాదకులను, డీలర్లను సన్నద్ధపరచాలి. శాస్త్రీయ ప్రాతిపదికన చెత్తశుద్ధి వ్యవస్థీకృతమైతే- వ్యర్థాలే సంపద వనరులుగా అక్కరకొస్తాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.