భాజపా ప్రభంజనం

గుజరాత్‌ ఎన్నికల్లో అన్ని రికార్డులనూ తిరగరాస్తాం... అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని కమలదళం అంతులేని ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది.

Published : 09 Dec 2022 00:19 IST

గుజరాత్‌ ఎన్నికల్లో అన్ని రికార్డులనూ తిరగరాస్తాం... అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని కమలదళం అంతులేని ఆత్మవిశ్వాసంతో ప్రకటించింది. అన్నట్లుగానే అది తన కంచుకోటలో కొత్త చరిత్ర లిఖించింది. మాధవ్‌ సింహ్‌ సోలంకీ కూర్చిన కులసమీకరణాల దన్నుతో 1985 ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 182 శాసనసభా స్థానాల్లో నూట నలభై తొమ్మిదింటిని కాంగ్రెస్‌ పార్టీ ఒడిసిపట్టింది. ఆనాటి విశేష ప్రజాతీర్పును తలదన్నిన గుజరాతీయుల ప్రేమాభిమానాల కుంభవృష్టిలో తాజాగా భాజపా తడిసిముద్దయ్యింది. 52శాతానికి పైగా ఓట్లతో ఏకంగా 156 సీట్లను కైవసం చేసుకుని అది ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రంలో అధికారం చలాయిస్తూనే ప్రభుత్వ వ్యతిరేకతను కమలదళం అతిసునాయాసంగా అధిగమించింది. ఎన్నికల సంసిద్ధత, ప్రచార ప్రణాళికలు, వ్యవస్థాగత దీక్షాదక్షతలలో జాతీయస్థాయిలో భాజపాకు సరిజోడు కాగల పార్టీ సమకాలీన భారతంలో మరేదీ లేదని గుజరాత్‌ నిర్ద్వంద్వంగా నిరూపించింది.  ‘వ్యక్తుల కన్నా పార్టీ మిన్న’ అన్నది భాజపా ప్రవచిత ఆదర్శం. కానీ, ఈ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలను ప్రధాని మోదీ ఒంటిచేత్తో మోశారు. సొంతరాష్ట్రంలో స్వీయపక్షానికి అలా ఆయనే మరోసారి విజయ సారథి అయ్యారు. వరస ఎన్నికల ఓటములతో కొన్నేళ్లుగా డీలాపడిన కాంగ్రెస్‌- దింపుడు కళ్లం ఆశలతో గుజరాత్‌ గోదాలోకి దిగింది. జాతీయ నాయకత్వం ముందే కాడి వదిలేసినా... వాగ్దానాల వంతెనపై విజయ తీరానికి చేరుకోవాలని అది కలలుగంది. అయిదేళ్ల క్రితం 41.44శాతం ఓట్లను కొల్లగొట్టిన హస్తం పార్టీ- ఈసారి వాటిలో  పద్నాలుగు శాతానికి పైగా కోల్పోయింది. దాంతో 2017తో పోలిస్తే అరవై సీట్లు పోగొట్టుకుని ఘోర పరాభవాన్ని మూటగట్టుకొంది. గతంలో కన్నా సుమారు మూడున్నర శాతం ఓట్లే అధికంగా ఆర్జించిన భాజపా ఏమో 57 స్థానాలను అదనంగా చేజిక్కించుకోగలిగింది. భారతీయ ఎన్నికల వ్యవస్థ బలహీనతకు అద్దంపట్టే ‘అద్భుతాలు’గా ఇటువంటివి ప్రతిసారీ నమోదవుతూనే ఉన్నాయి!

పంజాబ్‌లో సాధించిన సంచలన ఫలితాలతో ఆశలమేడలు కట్టుకున్న ‘ఆప్‌’- హంగూ ఆర్భాటాలతో గుజరాత్‌ బరిలోకి దూకింది. ఉచిత తాయిలాలతో ఓటర్లను తన బుట్టలో వేసుకోవడానికి శతథా ప్రయత్నించి... ఆఖరికి అయిదు స్థానాలకు పరిమితమైంది. అదే సమయంలో దాదాపు 13శాతం ఓట్లను గుప్పిటపట్టిన ‘ఆప్‌’- ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పుట్టి ముంచింది. అనితరసాధ్యమైన భాజపా విజయానికి దోహదపడిన అంశాలెన్నో ఉండవచ్చు. కానీ, 35శాతానికి పైగా గుజరాతీ ఓటర్లు తమ ఓటుహక్కును అసలు వినియోగించుకోకపోవడానికి కారణమేమిటి? ఎన్నికలపై అక్కడి ప్రజల్లో గతంలో కంటే ఎక్కువగా గూడుకట్టుకున్న అయిష్టత దేనికి సంకేతం? అటు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ 24శాతానికి పైగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల మొహంచూడలేదు. అయినప్పటికీ అధికార పార్టీకి వరసగా రెండోసారి పట్టంకట్టని తన ప్రత్యేకతను హిమాచల్‌ ప్రజానీకం ఈసారీ నిలబెట్టుకుంది. తత్ఫలితంగా కిరీటం కాంగ్రెస్‌కే దఖలుపడింది. 68 శాసనసభ స్థానాల ఆ చిన్న రాష్ట్రంలో గుడ్డిలో మెల్ల గెలుపు- జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ పునరుత్థానానికి ఏ రకంగానూ ఆలంబన కాకపోవచ్చు. ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ వంటి కీలక రాష్ట్రాల్లో ప్రజావిశ్వాసాన్ని పొందలేని కాంగ్రెస్‌ క్రమేణా కకావికలమవుతోంది. అదే సమయంలో ప్రతిపక్షాల బలహీనతే తన బలిమిగా భాజపా అప్రతిహతమవుతోంది. సమర్థ పాలనకు సుస్థిర సర్కారు కీలకం.  ప్రజావాణిని పాలకులకు వినిపించేందుకు, ప్రభుత్వ తప్పొప్పులను జనానికి విశదీకరించేందుకు దీటైన విపక్షమూ అత్యావశ్యకం. అధికార ప్రతిపక్షాలు అలా జోడెద్దులైతేనే- ప్రజాస్వామ్య శకటం సాఫీగా ముందుకు సాగుతుంది. దురదృష్టవశాత్తు కేంద్రం, రాష్ట్రాల స్థాయుల్లో ప్రస్తుతం గట్టి ప్రతిపక్షమంటూ ఏదీ లేకుండా పోయింది. ప్రత్యామ్నాయ అభివృద్ధి, సంక్షేమ ప్రణాళికలతో ప్రజల మద్దతును గెలుచుకోవడంలో విపక్షాల వైఫల్యం- దేశాన్ని ప్రమాదకరమైన ఏకపక్ష ప్రజాస్వామ్యంలోకి నెట్టుకుపోతోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.