మలేరియాకు మళ్ళీ కోరలు!

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకెట్‌ వేగంతో విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలోనూ ఒక అల్పప్రాణి మానవాళిని హడలెత్తిస్తోంది. ఆకారంలో చిన్నదైన మశక సంతతి దేశదేశాలకు భారీనష్టం వాటిల్లజేస్తోంది. సాంక్రామిక వ్యాధులు ముసురేయడంలో దోమ కాటుదే కీలక పాత్ర.

Published : 10 Dec 2022 01:05 IST

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రాకెట్‌ వేగంతో విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలోనూ ఒక అల్పప్రాణి మానవాళిని హడలెత్తిస్తోంది. ఆకారంలో చిన్నదైన మశక సంతతి దేశదేశాలకు భారీనష్టం వాటిల్లజేస్తోంది. సాంక్రామిక వ్యాధులు ముసురేయడంలో దోమ కాటుదే కీలక పాత్ర. 2019లో విశ్వవ్యాప్తంగా నమోదైన మలేరియా కేసులు 23.2 కోట్లు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆ సంఖ్య 2020లో 24.5 కోట్లకు ఎగబాకింది. 2021లో 24.7 కోట్లకు చేరింది. ఇది ఆ రెండేళ్లూ కరోనాయేతర వ్యాధులు పెచ్చరిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలు కుంటువడిన పర్యవసానమే. 2019 నాటి 5,68,000 మలేరియా మృతులతో పోలిస్తే, తరవాతి రెండేళ్లూ మరణాలు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం ధ్రువీకరిస్తోంది. 2020లో ఆరులక్షల 25వేల మందిని, నిరుడు మరో ఆరు లక్షల 19వేల మందిని మలేరియా కబళించింది. మొత్తం మలేరియా కేసులలో సింహభాగం ఆఫ్రికా ఖండంలో నమోదవుతున్న మాట వాస్తవం. ఆగ్నేయాసియా ప్రాంతంలోని మలేరియా బాధితుల్లో 76శాతం దాకా భారత దేశంలోనే పోగుపడుతున్నారు. మలేరియా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న 11 దేశాల జాబితాలో ఇండియా ఒకటి. బుర్కినాఫాసో, కామెరూన్‌, కాంగో, ఘనా, నైజీరియా, ఉగాండా ప్రభృత దేశాల సరసన నిలవాల్సిన దుస్థితి భారత్‌కు అంతర్జాతీయంగా నగుబాటు కొనితెస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మలేరియా కేసులలో ఇండియా వాటా కనీసం రెండు శాతం అంటున్నా- నికరంగా అంకెల్లో అది దాదాపు అరకోటిగా తేలుతోంది. ఏటా లక్షల మందికి వ్యాపిస్తున్న మలేరియాను 2030 సంవత్సరంలోగా భారత్‌ నుంచి నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ 2016 ఫిబ్రవరిలో జాతీయ కార్యాచరణ వ్యూహం ప్రకటించింది. ‘మలేరియా ముక్త్‌ భారత్‌’ సాకారం కావడానికి ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది ఇప్పటికీ ఎంతో ఉంది!

డెంగీ, మలేరియాల కారణంగా ఇండియా ఏటా రూ.18వేలకోట్ల మేర నష్టపోతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమధ్య అంచనా కట్టింది. దోమల సంతతి ఇంతలంతలయ్యే వాతావరణంలో కమ్ముకుంటున్న ఇతరేతర రోగాలు, విషజ్వరాలనూ పరిగణిస్తే ఆర్థిక నష్టం మరింత భారీగా లెక్కతేలుతుంది. ఏళ్లతరబడి దోమ తెరల వినియోగం, ఇతరత్రా జాగ్రత్త చర్యలపై డబ్ల్యూహెచ్‌ఓ విస్తృత ప్రచారం చేపట్టినా- చాలాచోట్ల మలేరియా నియంత్రణ చతికిలపడిందన్న ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ అద్నామ్‌ గెబ్రయోసిస్‌ వ్యాఖ్యలు, భారత్‌ విషయంలో అక్షరసత్యాలు. మలేరియా నిర్మూలనలో విశేషంగా రాణిస్తున్నాయంటూ ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాలు ఇటీవల కేంద్ర పురస్కారాలకు ఎంపికయ్యాయి. క్షేత్రస్థాయి కథనాలు ఆందోళనకర స్థితిగతుల్ని కళ్లకు కడుతున్నాయి. గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో కేసుల ఉద్ధృతి రికార్డుల్లోకి ఎక్కడం లేదన్న విమర్శల్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. రక్తనమూనాల సేకరణకు తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంవల్లే కొన్నిచోట్ల కేసుల నమోదు తగ్గుతున్నట్లు అధ్యయనాలు చాటుతున్నాయి. వ్యర్థాలు, నిల్వనీరు పేరుకుపోయి లెక్కకు మిక్కిలి జనావాస ప్రాంతాలు పెద్దయెత్తున లార్వా ఉత్పత్తి కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయి. పారిశుద్ధ్య లోపాలకు తావివ్వకుండా సకలవిధ జాగ్రత్తలు తీసుకునే దేశాలే మలేరియాను నియంత్రించగలుగుతాయి. డబ్ల్యూహెచ్‌ఓ ఈమధ్య వెలువరించిన మలేరియా రహిత దేశాల పద్దులోని యూఏఈ, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, శ్రీలంక, చైనా తదితరాల అనుభవాలనుంచి తోటి దేశాలు ఎన్నో గుణపాఠాలు స్వీకరించగల వీలుంది. పౌరసమాజం స్వచ్ఛభారత్‌ స్ఫూర్తికి నిరంతరం గొడుగుపడితే- మలేరియా కట్టడికి ఆ చొరవ ఎంతగానో దోహదపడుతుంది. క్షయ, కొవిడ్‌ పరీక్షల్లో వినియోగిస్తున్న మైక్రోపీసీఆర్‌ విధానాన్ని మలేరియా కేసులకూ వర్తింపజేస్తే రోగనిర్ధారణ నిర్దుష్టమై సత్వర చికిత్సతో ప్రాణనష్టాన్ని నివారించగలమన్న నిపుణుల సూచనలకూ సరైన మన్నన దక్కాలి. దేశానికి దోమకాటు తప్పిస్తేనే- స్వస్థ భారతావని ఆవిష్కారమవుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.