పాత(క) చట్టాలకు పాతర

ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరవాతా ఆంగ్లేయుల జమానా నాటి అసంబద్ధ, కర్కశ చట్ట నిబంధనలెన్నో వలస పాలనావశేషాలుగా దేశంలో నిక్షేపంగా కొనసాగుతున్నాయి.

Published : 25 Jan 2023 00:03 IST

డున్నర దశాబ్దాల స్వాతంత్య్రం తరవాతా ఆంగ్లేయుల జమానా నాటి అసంబద్ధ, కర్కశ చట్ట నిబంధనలెన్నో వలస పాలనావశేషాలుగా దేశంలో నిక్షేపంగా కొనసాగుతున్నాయి. అందువల్లే, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లజేసే నల్లచట్టాలన్నింటినీ చాపచుట్టాలన్న డిమాండ్లు తరచూ మార్మోగుతున్నాయి. నేర న్యాయ వ్యవస్థకు గుదిబండలుగా పరిణమిస్తున్న పురాతన శిక్షాస్మృతుల ప్రక్షాళనకు నిబద్ధమైనట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ గతంలో పలుమార్లు ఉద్ఘాటించింది. వాడుకలో లేని, అనవసరమైన శాసనాలను వదిలించుకునేందుకు రాష్ట్రాలు చొరవ కనబరచాలని తనవంతుగా ప్రధానమంత్రి లోగడ పిలుపిచ్చారు. తాజాగా అఖిల భారత డీజీపీలు, ఐజీల సదస్సులోనూ కాలం చెల్లిన చట్టాల రద్దుపైనే మోదీ ప్రధానంగా దృష్టి సారించారు. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) ఏనాడో 1860 నాటిది. ఖాకీ యంత్రాంగం పనిపోకడల్ని కరకుబారుస్తూ దాష్టీకానికి మారుపేరుగా భ్రష్టు పట్టిస్తున్న పోలీస్‌ చట్టం 1861 నాటిది. సాక్ష్యాధార చట్టం, నేర శిక్షాస్మృతి సైతం నూట పాతికేళ్లకు పైబడ్డాయి. ఎవరెంతగా మోతెక్కించినా- లోపభూయిష్ఠమైన ఆయా చట్టాల క్షాళన ప్రక్రియ నత్తలతో పోటీపడుతోంది. 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు 15 వందలదాకా పాత శాసనాల్ని ఊడ్చిపారేశామని, కాలం చెల్లిన మరో 15 వందల చట్టాల్ని రద్దు చేయతలపెట్టామని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు ఆమధ్య వెల్లడించారు. అధికారికంగా రద్దయిన వాటి కథ అంతటితో ముగిసిపోయిందనుకోవడానికి వీల్లేదని ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66(ఏ) బాగోతం ఎలుగెత్తుతోంది. భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా పేర్కొంటూ దాన్ని సుప్రీంకోర్టు ఏనాడో కొట్టేసింది. అయినా ఆ నల్ల నిబంధనను అధికార వర్గాలు ప్రయోగిస్తూనే ఉండటమేమిటని న్యాయపాలికే నిర్ఘాంతపోయింది. ప్రశ్నించడమే నేరంగా పాత్రికేయులు, విమర్శకులు, ఉద్యమకారుల అణచివేతకు ప్రభుత్వాల చేతిలోని అస్త్రంగా పరువుమాసిన ‘రాజద్రోహం’ నిబంధన ఇంకా కొనసాగుతూనే ఉంది. తెల్లదొరల నల్లముద్రల్ని సాకల్యంగా తుడిచిపెట్టనంతవరకు దేశంలో పౌరస్వేచ్ఛ దిక్కులేనిదే!

అలనాటి బ్రిటిష్‌ ప్రభువుల్ని సంబోధిస్తూ రూపొందిన చట్టాలు, విడ్డూర ప్రకరణలు నేటికీ చలామణీ కావడమేమిటి? దేశద్రోహ తలంపుతో పౌరులు సమావేశం కావడాన్ని నిషేధించిన 1911 నాటి చట్టం 2017 వరకు సజీవంగా చెల్లుబాటులోనే ఉంది. అటువంటివెన్నో కనుమరుగైనా, పాత చట్టాలను పట్టుకుని పాకులాడే పద్ధతి నేటికీ కొనసాగుతోంది. 1937 నాటి ఏర్‌క్రాఫ్ట్‌ నిబంధనావళి, 1939 నాటి విదేశీయుల రిజిస్ట్రేషన్‌ చట్టం, 1855 నాటి సొంథాల్‌ పరగణాల చట్టం... వంటివి ఆ జాబితాలోనివే. గత ఎనిమిదేళ్లలో సుమారు 15వందల చట్టాలతోపాటు 32వేలకుపైగా అసంబద్ధ నిబంధనలపైనా వేటు వేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించినా- జరగాల్సిన క్షాళన మరెంతో ఉంది. ఏ చట్టమైనా దారుణంగా దుర్వినియోగమవుతున్నట్లు గుర్తించినప్పుడు తమ పూర్వతీర్పులను కోర్టులు సమీక్షించాలని సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా ఆమధ్య ఎంతో విలువైన సిఫార్సు చేశారు. అందుకు సరైన మన్నన దక్కని కారణంగా హక్కుల హననం అంతులేని కథగా మారింది. ప్రొసీజరల్‌ డిలేల మూలాన అసంఖ్యాక ఖైదీల నిస్సహాయ నిట్టూర్పులతో కారాగారాల గోడలు పొగచూరిపోతున్నాయి. నిరసన తెలపడాన్నీ ఘోరమైన నేరంగా పరిగణిస్తున్న కొన్ని రాష్ట్రాలు పోలీస్‌ రాజ్యాన్ని కళ్లకు కడుతున్నాయి. ప్రధాని మోదీ అభిలషిస్తున్న విస్తృత సంస్కరణలు సాకారం కావాలంటే, చీకటి చట్టాలన్నింటిపైనా వేటు పడాలి. నిర్దిష్టకాలంపాటు చట్టాలు అమలయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కొత్తగా ప్రతిపాదించారు. వాస్తవానికి, ఔచిత్యం కోల్పోయిన శాసనాలు నిర్దిష్ట కాలావధిలో తెరమరుగయ్యేలా చేసే విధానాన్ని అమెరికా వంటివి ఇప్పటికే పాటిస్తున్నాయి. గడువు తీరగానే మురిగిపోయేలా చట్టంలోనే ‘సన్‌సెట్‌ క్లాజ్‌’ చేర్చాలన్న జైన్‌ కమిషన్‌ కీలక సిఫార్సును ప్రతి శాసనానికీ వర్తింపజేయాలి. ఇప్పుడు రూపొందించిన చట్టాలకూ కొన్నాళ్ల తరవాత కాలదోషం అనివార్యం కనుక నిరంతర సమీక్ష కొనసాగుతూనే ఉండాలి. క్రమశిక్షణతో చట్టబద్ధంగా మెలగేవారికి ఆపద్బంధువుగా, వ్యవస్థల్ని ప్రజాప్రయోజనాల్ని కుమ్మి కూలగొట్టే జగన్మాయగాళ్ల పాలిట అపర కాళికావతారంగా శాసనాల్ని పరిపుష్టీకరిస్తేనే- దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.