జన భాషలో న్యాయపాలన

ప్రజలకు న్యాయం చేయడమెంత ముఖ్యమో- జనానికి అర్థమయ్యే భాషలోనే న్యాయసేవలను అందించడమూ అంతే ప్రధానం.

Published : 27 Jan 2023 00:50 IST

ప్రజలకు న్యాయం చేయడమెంత ముఖ్యమో- జనానికి అర్థమయ్యే భాషలోనే న్యాయసేవలను అందించడమూ అంతే ప్రధానం. ఉన్నత న్యాయస్థానాల ఆంగ్ల తీర్పులు కక్షిదారులకు సులువుగా బోధపడాలంటే- వారికి తెలిసిన భాషలో ఆయా న్యాయనిర్ణయాల అనువాద ప్రతులను సమకూర్చడం అత్యావశ్యకం. రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ అయిదేళ్ల క్రితం చేసిన కీలక సూచనలివి! ప్రజలకు అర్థమయ్యేలా న్యాయమూర్తులు స్థానిక భాషల్లో తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గతంలో ఆకాంక్షించారు. భాషాపరమైన అడ్డంకులతో దేశీయంగా 99శాతం పౌరులకు మన న్యాయ కార్యకలాపాలు కొరుకుడుపడటం లేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అయిదు రోజుల క్రితం ఆవేదన వ్యక్తపరిచారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను అన్ని భారతీయ భాషల్లోకి అనువదింపజేసి అందరికీ అందించే ఘన సంకల్పాన్ని ఆయన ప్రకటించారు. అందులో భాగంగా- పన్నెండు వందలకు పైగా ‘సుప్రీం’ జడ్జిమెంట్లను తాజాగా తెలుగుతో పాటు మొత్తం పదమూడు భాషల్లో అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయం! న్యాయార్థులు, సాక్షులు, నిందితుల్లో చాలామందికి ఆంగ్లం రానేరాదు. అందులో వకీళ్ల వాద ప్రతివాదాలు వారికి ఏమాత్రం అర్థం కావు. వివిధ అర్థచ్ఛాయలతో నిండిన న్యాయపరిభాషలో వెలువడే తీర్పులైతే- సామాన్యులకు ఇనుప గుగ్గిళ్ల వంటివే! ఇటువంటి పరిస్థితుల్లో తమకు నిజంగా న్యాయం జరిగిందో లేదో కక్షిదారులకు ఎలా తెలుస్తుంది? ఉన్నత న్యాయస్థానాల్లో ప్రాంతీయ భాషల వినియోగానికి అనుమతించాలన్న డిమాండ్లు చిరకాలంగానే వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టుల్లో స్థానికేతర న్యాయమూర్తులూ విధులు నిర్వర్తిస్తుంటారు కాబట్టి ఆయా డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. ఆలోగా జిల్లాస్థాయి వరకు జనం భాషలోనే న్యాయపాలన సాగించాలి. ప్రధాని మోదీ గతంలో పిలుపిచ్చినట్లు, న్యాయవ్యవస్థలో ప్రాంతీయ భాషల వాడకం కచ్చితంగా చురుకందుకోవాల్సిందే. అప్పుడే బోలెడంత సమయంతో పాటు డబ్బునూ ధారపోస్తూ న్యాయాన్ని కనీసం ‘అర్థం’ చేసుకునేందుకు తిప్పలు పడుతున్న సాధారణ కక్షిదారులకు కాస్తయినా సాంత్వన కలుగుతుంది!

సుదీర్ఘ విచారణలతో దేశీయంగా సకాలంలో సరైన న్యాయమన్నది సామాన్యులకు కుందేటి కొమ్మే అవుతోంది. సుప్రీంకోర్టే ఇటీవల వ్యాఖ్యానించినట్లు- మన నేరన్యాయ వ్యవస్థే ఒక శిక్షగా పరిణమిస్తోంది. దేశవ్యాప్తంగా జిల్లా, తాలూకా కోర్టుల్లో 4.33కోట్ల కేసులు అపరిష్కృతంగా పోగుపడ్డాయి. వాటిలో నలభై లక్షలకు పైగా వ్యాజ్యాలు పదేళ్ల నుంచి ముప్ఫై ఏళ్లుగా అక్కడే పడిఉన్నాయి. మరో 1.14 లక్షల కేసులైతే మూడు దశాబ్దాలకు పైబడిన కాలం నుంచి మోక్షానికి ఎదురుచూస్తున్నాయి. హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 59.75 లక్షల వ్యాజ్యాల్లో దాదాపు 24శాతం కనీసం దశాబ్దం కిందటివే! కృత్రిమ మేధను అందిపుచ్చుకోవడం ద్వారా చైనా స్మార్ట్‌కోర్టులు నెలల వ్యవధిలోనే తీర్పులను వెలువరిస్తున్నాయి. మధ్యవర్తిత్వ విధానానికి అగ్రతాంబూలమిస్తూ తమ న్యాయస్థానాలపై పనిభారాన్ని  అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు గణనీయంగా తగ్గిస్తున్నాయి. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కొరత, వివిధ వ్యవస్థాగత సమస్యల కారణంగా భారత్‌లో తీర్పులు తెమిలేసరికి తరాలకు తరాలే దొర్లిపోతున్నాయి. రెండేళ్లకు పైబడి ఏ కేసూ ఎక్కడా అపరిష్కృతంగా ఉండకుండా చూసేందుకు ఉన్నత న్యాయస్థానాల్లో ప్రత్యేక విభాగాలను నెలకొల్పాలన్నది మలీమత్‌ కమిటీ మేలిమి సూచన. అలా కేసులు సత్వరం ఒక కొలిక్కి రావాలంటే- వాయిదాలతో వ్యాజ్యాలను ఏళ్లూపూళ్లూ సాగదీసే సంస్కృతిని విడనాడాలి. సాధారణంగా నేరపరిశోధనల్లో మన్నుతిన్న పాములుగా కదిలే పోలీసు యంత్రాంగాలనూ సంస్కరించాలి. జనాభా విస్ఫోటం, సామాజిక ఆర్థిక పరిణామాల దృష్ట్యా కోర్టు మెట్లెక్కే వారి సంఖ్య పోనుపోను పెరిగేదే తప్ప తరిగేది కాదు. అందుకు తగినట్లుగా న్యాయమూర్తుల నియామకాలను చేపట్టాలి. అత్యాధునిక సాంకేతికతలకు నెలవులుగా కోర్టులను తీర్చిదిద్దాలి. న్యాయవితరణలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలిసికట్టుగా శ్రీకారం చుట్టాలి. ఆ మేరకు సంస్కరణలు సాకారమైతేనే- న్యాయంకోసం బడుగు బలహీన వర్గాలవారు మరో జన్మ ఎత్తాల్సి వస్తున్న దుర్భరావస్థకు ముగింపు పలకగలం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.