మహిళల క్రికెట్లో స్వర్ణశకం

దేశంలో క్రికెట్‌ అంటే ప్రధానంగా పురుషుల క్రీడేనన్న భావజాలానికి నూకలు చెల్లాయని ఎలుగెత్తుతున్న చారిత్రక పరిణామమిది.

Published : 31 Jan 2023 00:21 IST

దేశంలో క్రికెట్‌ అంటే ప్రధానంగా పురుషుల క్రీడేనన్న భావజాలానికి నూకలు చెల్లాయని ఎలుగెత్తుతున్న చారిత్రక పరిణామమిది. ముమ్మార్లు ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరీ మహిళల సీనియర్‌ జట్టు సాధించలేకపోయిన ఘనతను తొలియత్నంలోనే యువతుల బృందం ఒడిసిపట్టడం చిచ్చరపిడుగుల ఆగమనాన్ని సగర్వంగా చాటుతోంది! నిరుడు ఫిబ్రవరిలో 19 ఏళ్లలోపు అబ్బాయిలకు వెస్టిండీస్‌ వేదికగా నిర్వహించిన పోటీల్లో ప్రపంచకప్‌ భారత్‌కు దఖలుపడింది. అప్పట్లో మన యువజట్టు చేతిలో భంగపాటుకు గురైంది ఇంగ్లాండ్‌ బృందం. తాజాగా అదే ఇంగ్లాండ్‌కు చెందిన 19ఏళ్ల లోపు అమ్మాయిల జట్టును షెఫాలీ వర్మ సేన చిత్తుగా ఓడించి, ఇండియాను విశ్వవిజేతగా ఆవిష్కరించింది. మహిళా క్రికెట్లో భారత్‌కిది మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ కావడంతో- దక్షిణాఫ్రికా గడ్డమీద ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి నూతన చరిత్ర సృష్టించిన యువబృందంపై నేడు అభినందనల విరిజల్లు కురుస్తోంది! ధీమాగా విశ్వకప్‌ బరిలోకి దూకిన భారత జట్టు సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ను మట్టి కరిపించి, అదే ఊపుతో తుదిఘట్టంలో ఇంగ్లాండ్‌ను చాపచుట్టేసింది. ఈ టోర్నీ ఆసాంతం బ్యాట్‌తో శ్వేత, షెఫాలీ, త్రిష తదితరులు సృష్టించిన పరుగుల వరద, బౌలింగులో రెచ్చిపోయి పార్శవి చోప్రా, మన్నత్‌ కశ్యప్‌, అర్చనాదేవి ప్రభృతులు కూల్చిన వికెట్లు- భారత్‌ను కడకంటా విజయపథాన నిలబెట్టాయి. తెలుగమ్మాయిలు త్రిష, షబ్నమ్‌లూ మువ్వన్నెల పతాకను రెపరెపలాడించడంలో కీలక భూమిక పోషించారు. ఇటీవలి కొవిడ్‌ సంక్షోభం దేశీయంగా మహిళా క్రికెట్‌ ప్రస్థానాన్ని కనీసం రెండేళ్లపాటు వెనక్కి నెట్టేసిందని కొంతమంది ఆమధ్య వాపోవడం తెలిసిందే. ఆ నష్టాన్ని పూడ్చి క్షేత్రస్థాయిలో మహిళా క్రికెట్‌ వికాసానికి సరికొత్త అద్భుత విజయం గొప్ప దోహదకారి కాగలదన్న అంచనాలు మిన్నంటుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో మహిళల టీ20 ప్రపంచకప్‌ హోరాహోరీలోనూ మనదే పైచేయి అయితే- ప్రస్తుత విజయానందం రెండింతలవుతుంది.

ప్రపంచ మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ చిరకాలంగా ఆధిపత్యం చలాయిస్తున్నాయి. పురుషుల క్రికెట్లో దిగ్గజ శక్తిగా ఆవిర్భవించిన ఇండియాలో మహిళా క్రికెట్టుకు దశాబ్దాలుగా సరైన ప్రోత్సాహం, ఆదరణ కొరవడ్డాయి. తొలినాళ్లలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొని స్వశక్తితో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో రేపటి తరాలకు స్ఫూర్తిదాయక నమూనాలుగా ఎదిగిన మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామి వంటి వారికీ వ్యవస్థాగత సహకారం ఏళ్లతరబడి ఎండమావినే తలపించింది. నాటితో పోలిస్తే కొన్నాళ్లుగా పరిస్థితులు గణనీయంగా తేటపడుతున్నాయి. జట్టు సభ్యులకు ప్రోత్సాహకాల చెల్లింపు, వ్యక్తిగత ఒప్పందాలు కుదుర్చుకోవడంలో లింగపరమైన దుర్విచక్షణ పూర్తిగా రూపు మాసిపోకపోయినా- పరివర్తన ఆరంభమైంది. చెల్లింపుల్లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వ్యత్యాసాల పరిహరణ క్రమం మొదలు కావడంతో పాటు- ఐపీఎల్‌ తరహాలో వనితల ప్రీమియర్‌ లీగ్‌ పట్టాలకు ఎక్కనుండటం విశేష పరిణామం. ‘గుజరాత్‌ జెయింట్స్‌’కు మార్గనిర్దేశకురాలిగా ఎంపికైన మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించినట్లు- ‘మహిళల క్రికెట్‌ స్థిరంగా ఎదుగుతోంది... వృత్తిగా క్రికెట్‌ను ఎంచుకునే నూతన తరానికి సరికొత్త లీగ్‌ అవకాశాల గని’! మహిళా ప్రీమియర్‌ లీగ్‌ జట్లకు ఇటీవలి వేలంపాటలో భారీగా పలికిన ధరలు- జనాదరణ విస్తృతంగా లభిస్తుందన్న బీసీసీఐ నమ్మకానికి ప్రాణవాయువులు ఊదాయి. పాఠశాల దశనుంచే చదువుల్లో క్రీడల్ని అంతర్భాగం చేసి, మౌలిక వసతుల పరికల్పనకు ప్రభుత్వాలు నిష్ఠగా నిబద్ధమైతే ముడి కోహినూర్‌ వజ్రాలెన్నో వెలుగులోకి వస్తాయి. ఔత్సాహిక క్రీడాకారుల సహజ ప్రతిభకు సానపట్టే విధివిధానాల పరికల్పనకు తనవంతుగా బీసీసీఐ చేయూత అందిస్తే- మరెన్నో ఘన విజయాలకది నాంది పలుకుతుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు