ఉపాధికేదీ హామీ?
కొవిడ్ మహా సంక్షోభ వేళ అనివార్య లాక్‌డౌన్ల కారణంగా బతుకుతెరువు కోల్పోయి విలవిల్లాడిన కోట్లాది అభాగ్యుల్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నంతలో అన్నపూర్ణలా ఆదుకుంది.
కొవిడ్ మహా సంక్షోభ వేళ అనివార్య లాక్‌డౌన్ల కారణంగా బతుకుతెరువు కోల్పోయి విలవిల్లాడిన కోట్లాది అభాగ్యుల్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నంతలో అన్నపూర్ణలా ఆదుకుంది. అప్పట్లో సొంత ఊళ్లకు వలసబాట పట్టిన అసంఖ్యాక రోజుకూలీలతోపాటు వీధిన పడిన ఎందరో విద్యావంతులకూ ఉపాధి హామీయే కొండంత అండగా నిలిచింది. నాణేనికి మరో పార్శ్వం విస్తుగొలుపుతుంది. కొవిడ్ కోర సాచిన 2020-21 సంవత్సరంలో, జాబ్ కార్డు ఉండీ ఉపాధి కోరినవారిలో 39శాతం దాకా ఏ పనీ దక్కించుకోలేకపోయారని మూడు నెలల క్రితం అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ అధ్యయన నివేదిక విశ్లేషించింది. అంతకు ముందు అయిదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏటా సగటున 48రోజులపాటు మాత్రమే ఉపాధి పనులు కల్పించగలిగినట్లు గణాంకాలు స్పష్టీకరిస్తున్నాయి. గ్రామీణ పేదలకు చట్టబద్ధ హక్కుగా అక్కరకొస్తుందంటూ పదిహేడేళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పుడు కేంద్రం చెప్పిందేమిటి? పల్లెపట్టులనుంచి వలసలను అరికట్టే నిమిత్తం అడిగినవారికి లేదనకుండా శ్రమ జీవులకు ఉన్న ఊళ్ళోనే ఏడాదికి కనీసం వంద రోజులపాటు పని కల్పిస్తామన్నారు. ఇన్నేళ్లలో ఆ హామీని ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద 6.49 కోట్ల కుటుంబాలు పని కోరగా పొందినవారి సంఖ్య 5.7 కోట్లని తాజా ఆర్థిక సర్వే వెల్లడించింది. కేటాయింపుల తీరును పరికిస్తే, అడిగిన వారందరికీ ఉపాధి హామీ పనులు ఎందుకు లభించడంలేదో ఇట్టే విశదమవుతుంది. 2020-21లో ఉపాధి హామీ పద్దు కింద వెచ్చించిన మొత్తం రూ.1.1 లక్షల కోట్లు. ఆపై అవసరానుగుణంగా పెరగాల్సిన కేటాయింపులు తదుపరి బడ్జెట్లలో కుదించుకుపోయాయి. నిరుడు దాన్ని రూ.73 వేల కోట్లకు పరిమితం చేశారు. ఉపాధి హామీ కింద ప్రయోజనం పొందగోరే వారందరికీ 100 రోజులపాటు పనులు కల్పించాలంటే రూ.1.8 లక్షల కోట్ల మేర కేటాయింపులు ఆవశ్యకమని అంచనా. నేటి కేంద్ర బడ్జెట్ సమర్పణ ఘట్టంలోనైనా వాస్తవిక అవసరాల ప్రాతిపదికన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు అనుగ్రహిస్తారని ఆశిద్దాం!
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో గ్రామసీమలు ఎంతగా కునారిల్లుతున్నాయో సామాజిక ఆర్థిక విశ్లేషణలు చాటుతూనే ఉన్నాయి. పల్లెపట్టుల్లో నైరాశ్యమెలా దట్టంగా పేరుకుపోయిందో ఉపాధి హామీ గణాంకాలూ కళ్లకు కడుతున్నాయి. ఆ పథకం కింద ముట్టజెబుతున్న సగటు దినసరి వేతనం రూ.220 లోపు. వివిధ రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఉపాధి నిధుల బకాయిలు వేల కోట్ల రూపాయలుగా లెక్కతేలుతున్నాయి. వేరే పనులు దొరక్క, పస్తులకు తాళలేక, చేసిన పనికి వేతనం ఎప్పటికి అందుతుందో తెలియని దుస్థితిలో కోట్లమంది శ్రామికులు ఉపాధి పనులకు బారులు తీరుతున్నారంటే- అర్థం ఏమిటి? అటు గ్రామాల్లో కన్నా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత మరింతగా ముమ్మరిస్తోంది. దేశవ్యాప్తంగా 81 కోట్లమందికి పైగా అన్నార్తులకు ఉచితంగా తిండిగింజలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కేంద్రమే చెబుతోంది. అంటే, అంతమందీ పేదరికంలో మగ్గుతున్నట్లే కదా! కొవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా దారిద్య్రంలోకి జారిపోయిన ప్రతి అయిదుగురిలో నలుగురు భారతీయులేనన్న ప్రపంచబ్యాంకు నివేదిక- ఆపన్నుల్ని ఆదరంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వ విధ్యుక్త ధర్మాన్ని గుర్తుచేసేదే. ఉపాధి హామీ పథకం అమలును 200 రోజులకు పొడిగించాలని ఆ మధ్య అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సూచించింది. పథకం కింద పనుల్ని విస్తృతీకరించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంతర్గత అధ్యయన నివేదిక సిఫార్సు చేసింది. నిరుద్యోగ భూతం కోరల్ని పెరికేందుకు ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకూ వర్తింపజేయాలన్న మేలిమి సూచనలూ వచ్చాయి. వాటికి కేంద్రం ఇకనైనా తలొగ్గాలి. కోరిన అందరికీ పని, సాయంత్రానికి వేతన చెల్లింపులు, పకడ్బందీగా సామాజిక ఆస్తుల నిర్మాణ పర్యవేక్షణ... ఇవన్నీ సాకారమయ్యే కార్యాచరణతోనే ఉపాధి కల్పన ఉరకలెత్తుతుంది. అందుకోసం నేటి బడ్జెట్లో తీరైన చొరవ కనబరుస్తారా?
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు