శ్రేష్ఠ్‌భారత్‌ సాకారమవుతుందా?

మాంద్యంపై భయాందోళనలు, కొవిడ్‌తో కుదేలైన సరఫరా గొలుసులు, ఉక్రెయిన్‌పై రష్యా నిరవధిక యుద్ధ విపరిణామాలైన ధరాఘాతాలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వృద్ధి- స్థూలంగా చూస్తే మెరుగ్గానే కనిపిస్తోంది.

Published : 02 Feb 2023 00:28 IST

మాంద్యంపై భయాందోళనలు, కొవిడ్‌తో కుదేలైన సరఫరా గొలుసులు, ఉక్రెయిన్‌పై రష్యా నిరవధిక యుద్ధ విపరిణామాలైన ధరాఘాతాలతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వృద్ధి- స్థూలంగా చూస్తే మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ, దేశీయంగా పోనుపోను ఆదాయ అంతరాలు పెచ్చరిల్లుతున్నాయి. దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాల చేతుల్లో సొమ్ములు నిండుకుంటున్నాయి. ఆ చీకట్లను చీలుస్తూ సామాన్య జనజీవితాల్లో కేంద్ర బడ్జెట్‌ కొత్త వెలుగులను నింపబోతోందని పాలకశ్రేణులు ఊదరగొట్టాయి. రాబోయే సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్‌గా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతుండటంతో- తమ ఆకాంక్షలకు సర్కారు చెవొగ్గుతుందని విభిన్న జనవర్గాలూ ఎంతగానో ఎదురుచూశాయి. ప్రజాసంక్షేమానికి బాటలుపరుస్తూనే ద్రవ్యలోటును కట్టడి చేయడం కత్తి మీద సాముగా మారిన తరుణంలో శ్రేష్ఠ్‌భారత్‌ నిర్మాణం కోసమంటూ రూ.45.03 లక్షల కోట్ల భూరి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆ క్రమంలో ఎన్నో సుందర స్వప్నాలను ఆమె ఆవిష్కరించారు. సమ్మిళిత అభివృద్ధి, హరిత వృద్ధి, యువశక్తి, సామర్థ్యాల వెలికితీత, చివరి అంచె వరకు ప్రగతి ఫలాలు, మౌలిక వసతులూ పెట్టుబడులకు అమిత ప్రాధాన్యమిస్తున్నామన్న అమాత్యుల ప్రకటన వినసొంపుగా ఉంది. గతానికి భిన్నంగా పది లక్షల కోట్ల రూపాయలకు పైబడిన మూలధన వ్యయ ప్రతిపాదన... సహర్షంగా స్వాగతించదగింది. 2013-14 పద్దుతో పోలిస్తే తొమ్మిది రెట్లు ఎక్కువగా రూ.2.40 లక్షల కోట్ల మేరకు మూలధనాన్ని రైల్వేలకు ప్రత్యేకించడమూ హర్షణీయం. దేశ దీర్ఘకాల ప్రగతికి చోదకశక్తిగా కేటాయింపుల్లోని ఘన స్ఫూర్తి సంపూర్తిగా ఆచరణ రూపం దాల్చాలి! మహిళలకు ఆర్థిక సాధికారత, హస్తకళాకారులకు చేయూత, పర్యాటకానికి దన్ను, జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం, ఉత్కృష్ట కృత్రిమ మేధా కేంద్రాల ఏర్పాటు, సమాచార పాలనా విధానం, నైపుణ్యాభివృద్ధి వంటివెన్నో ఆర్థిక మంత్రి ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చాయి. రాయితీల తెగ్గోత, కీలక పథకాలకు అరకొర నిధుల విదిలింపుల వంటివి- నిర్మలమ్మ మాటల మెరుపుల వెనక వాతలుగా విస్మయపరుస్తాయి!

భారత జనాభాలో 65శాతం నేటికీ గ్రామాల్లోనే నివసిస్తోంది. 47శాతం ప్రజావళికి వ్యవసాయమే జీవనాధారం. కానీ, తాజా బడ్జెట్‌లో సాగు, దాని అనుబంధ కార్యకలాపాలకు కేటాయింపులు నిరుటి కన్నా చాలా స్వల్పంగానే పెరిగాయి. గ్రామీణాభివృద్ధికి అయితే అవి అయిదు వేల కోట్ల రూపాయలకు పైగా తరిగిపోయాయి. పల్లెసీమల ఆకలి వెతలను తీర్చడంలో ఉపాధి హామీ పథకం కీలకంగా నిలుస్తోందని ఇప్పటికే నిరూపితమైంది. అయినప్పటికీ గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే- ఈసారి దానికి దాదాపు 33శాతం తక్కువగా రూ.60వేల కోట్లే కేటాయింపులు దక్కాయి. ఆ పథకం కింద పనికోరుతున్న వాళ్లందరికీ వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలంటే అంతకు మూడు రెట్ల నిధులు అత్యావశ్యకం.   తయారీ రంగం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కేటాయింపులకూ కోతపెట్టడం విస్మయకరం. ప్రజల పోషకాహార భద్రతకు కట్టుబడి ఉన్నట్లుగా నిర్మలమ్మ ప్రకటించారు కానీ, ఆహార రాయితీ పద్దులోంచి దాదాపు రూ.90వేల కోట్ల నిధులను తెగ్గోసేశారు! ఎరువులూ పెట్రోలియం రాయితీలనూ అదే బాటపట్టించి- ధరలమోతకు రంగం సిద్ధంచేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను బాదుడు నుంచి ఈసారైనా కాస్తంత ఉపశమనం కలుగుతుందని  వేతన జీవులు వేయికళ్లతో వేచిచూశారు. ఆ మేరకు ఆర్థిక మంత్రి వరదానాలన్నీ పూర్తిగా కొత్త పన్ను విధానానికే పరిమితమయ్యాయి. వివిధ కారణాలతో పాత విధానాన్నే ఎంచుకొంటున్న అత్యధికులకు కొత్తగా ఒనగూడిందేమీ లేదు. ప్రభుత్వ రాబడిలో రూ.35వేల కోట్లను త్యాగంచేసి మరీ వ్యక్తిగత ఆదాయ పన్ను సడలింపులను తలకెత్తుకున్నామని నిర్మలమ్మ ఘనంగా ఉద్ఘాటించారు.  కానీ, పన్నులూ పన్నేతర మార్గాల్లో ప్రభుత్వ రాబడులు- నిరుటి సవరించిన అంచనాల కంటే రూ.2.83 లక్షల కోట్ల మేరకు ఈ ఏడాదిలో ఎగబాకనున్నాయి. అదే సమయంలో 2022-23 బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే- విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు నిధులు పెద్దగా పెరగలేదు. సామాన్యుల వినియోగ సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కేంద్రం తగినంతగా దృష్టి సారించలేదు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.