వెండితెరపై తెలుగు సంతకం

కథాగమనమే ప్రధానమని భావిస్తూ... కళాత్మకతతోనూ కాసులపంట సాధ్యమేనని నిర్ద్వంద్వంగా నిరూపించిన దిగ్దర్శకుడు, కలల హాలికుడు కాశీనాథుని విశ్వనాథుడు. దర్శకుడిగా ఆయన తన చలనచిత్ర సృజన వైభవాన్ని ‘ఆత్మగౌరవం’తో ఆరంభించారు. తెలుగుజాతి ఆత్మస్వరూపాన్ని తన చిత్రాలన్నింటా అద్భుతంగా ఆవిష్కరించారు.

Published : 04 Feb 2023 00:23 IST

కథాగమనమే ప్రధానమని భావిస్తూ... కళాత్మకతతోనూ కాసులపంట సాధ్యమేనని నిర్ద్వంద్వంగా నిరూపించిన దిగ్దర్శకుడు, కలల హాలికుడు కాశీనాథుని విశ్వనాథుడు. దర్శకుడిగా ఆయన తన చలనచిత్ర సృజన వైభవాన్ని ‘ఆత్మగౌరవం’తో ఆరంభించారు. తెలుగుజాతి ఆత్మస్వరూపాన్ని తన చిత్రాలన్నింటా అద్భుతంగా ఆవిష్కరించారు. శంకరాభరణం చిత్రం విడుదలైన ఫిబ్రవరి రెండునే ఉపాధినుంచి తన ఆత్మను విముక్తం చేసి, శంకరుడి సన్నిధికి చేరిన శివార్చన కళాశీలుడు కాశీనాథుని విశ్వనాథుడు. తన చలనచిత్ర సేద్య సామర్థ్యంతో ఆయన- ఆధునిక క్షేత్రాల్లో సంప్రదాయాన్ని సాగుచేశారు. సంప్రదాయ కేదారాల్లో అభ్యుదయాన్ని పండించారు. అభ్యుదయ మాగాణి కమతాల్లో ఆధునికతను ఏపుగా పెంచారు. అన్నింటా అచ్చతెలుగుదనాన్ని పెంచి పోషించారు. ఆయనది వెండితెరపై చెరగని తెలుగు సంతకం. గుండెపొరల్లో చెదరని తీపి జ్ఞాపకం. వాహినీ స్టూడియోలోని ధ్వని ముద్రణ విభాగంలో ఆరంభమైన ఆయన సినీరంగ ప్రతిభా విన్యాసం, దర్శకత్వశాఖకు విస్తరించిన క్రమమంతా- ఒక విజేత జీవనయానం. చలనచిత్ర శాఖలన్నీ ఆయనకు కరతలామలకం. ‘విశ్వనాథ్‌ సినీగీతాలు రాయలేదు...’ అనుకొంటారు చాలామంది. అది అర్ధసత్యం. తనకు ఎంతో పేరు తెచ్చిన శంకరాభరణంలోని పాటలన్నీ విశ్వనాథ్‌  వివరణలోంచి అలవోకగా స్ఫురించినవే(ఇక్కడ సుందర రామ్మూర్తి వాడిన పదం- ‘రిఫ్లెక్సెస్‌’) అని స్వయంగా వేటూరే ప్రకటించారు. స్వరకల్పన కోసం విశ్వనాథ్‌ సృజించిన ఆపద్ధర్మ సాహిత్యం- ఎన్నోసార్లు అసలు పాటకు పల్లవిగా అమరిపోవడం అబ్బురపరచే సత్యం. ‘ఇక్కడొక రహస్యం చెప్పి తీరాలి. గీతరచనకే పూనుకొని ఉంటే- విశ్వనాథ్‌ ప్రముఖ సినీకవిగా గుర్తింపు పొంది ఉండేవారు’ అన్నారు ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకంలో వేటూరి. వాస్తవానికి ఒక వేటూరిని, ఒక సిరివెన్నెలను వెండితెరకు పరిచయం చేసిన ఖ్యాతి చాలు- విశ్వనాథ్‌ను ఈ జాతి చిరకాలం స్మరించుకోవడానికి!

సినిమాలు చూస్తే యువతరం పెడదారి పడుతుందన్న మాట ఎంత నిజమో తెలియదు గాని, విశ్వనాథ్‌ చిత్రాలు యువతను మంచిదారిలో పెడతాయన్నది పచ్చి నిజం. శంకరాభరణం చూసిన పిల్లలు సంగీత కళాశాలల్లో, సప్తపదో, సాగర సంగమమో చూసిన దరిమిలా నృత్యకళాశాలల్లో చేరిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. కథారచనలోను, కథా సంవిధాన(స్క్రీన్‌ ప్లే) కల్పనలోను విశ్వనాథ్‌ దిట్ట. ఆత్రేయ మాటలు రాసిన ఎన్నో చిత్రాల్లో- ‘ఇక్కడ హాస్య సన్నివేశం వస్తుంది’ అంటూ ఖాళీలు వదిలేసేవారట. ఆ ఖాళీలను విశ్వనాథ్‌ హాస్య సంభాషణలతో పూరించేవారని ముళ్లపూడి ‘కోతికొమ్మచ్చి’లో వెల్లడించారు. ఇలా పాటలు, మాటలకు సంబంధించిన విశ్వనాథ్‌ ప్రమేయాలు ఎన్నో వెలుగులోకి రానేలేదు. కథను కీలక మలుపు తిప్పే పెద్దాయన తరహా పాత్రలు పోషించడానికీ విశ్వనాథ్‌ పెట్టింది పేరు అయ్యారు. ఆయనను బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిరూపించే అంశాలివి. ఏ వాద్య సహకారంతోనో ‘ఎంతవారలైనా కాంతదాసులే’ వంటి ఏ త్యాగరాజ కృతినో అనుసంధానించడం ద్వారా విశ్వనాథ్‌ తన చిత్రాల్లోని సన్నివేశాలకు ఎంతగానో పుష్టిని చేకూర్చేవారు. ఆయన దర్శకత్వ ప్రతిభకు చెందిన ఈ కోణం- జాతికి గొప్ప అభిరుచిని అలవరచింది. ఆయనను ‘సంస్కృతీ నిర్మాత’గా రూపొందించింది. ‘కళాతపస్వి’ బిరుదాన్ని అందించింది. ‘మాయాబజార్‌’ సినిమాను చూశారా... అని అడగడం అపచారం. ఎన్నిసార్లు చూశారని అడగడమే సరైన పద్ధతి. తిరిగి ఆ తరహా ఖ్యాతి విశ్వనాథ్‌ సినిమాలకు దఖలుపడింది. ఇంటిల్లపాదీ కలిసి కూర్చొని చూడగలిగేవే- ఆయన చిత్రాలన్నీ. అన్ని తరాలవారూ బాహాటంగా చర్చించుకోదగినవే- సన్నివేశాలన్నీ. ఈ స్వచ్ఛత తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. గౌరవాన్ని ఆపాదించింది. కీర్తికాయులకు మరణం ఉండదనే భర్తృహరి శ్లోకం- ‘జయంతితే...’తో సాగరసంగమం చిత్రం ముగుస్తుంది. అదే విశ్వనాథ్‌కూ వర్తిస్తుంది!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి