బెంబేలెత్తిస్తున్న క్యాన్సర్లు

గడచిన మూడు దశాబ్దాల్లో అమెరికాలో క్యాన్సర్‌ మరణాలు దాదాపు 33శాతం తగ్గిపోయాయి. 38 లక్షల ప్రాణదీపాలు అర్ధాంతరంగా కొండెక్కిపోకుండా నిలిచాయి.

Published : 06 Feb 2023 00:21 IST

డచిన మూడు దశాబ్దాల్లో అమెరికాలో క్యాన్సర్‌ మరణాలు దాదాపు 33శాతం తగ్గిపోయాయి. 38 లక్షల ప్రాణదీపాలు అర్ధాంతరంగా కొండెక్కిపోకుండా నిలిచాయి. వ్యాధి నిర్ధారణ, నియంత్రణ, చికిత్సా సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ ఇనుమడించడం వల్లే అది సాధ్యపడినట్లు అమెరికన్‌ క్యాన్సర్‌ సొసైటీ ఇటీవల వెల్లడించింది. అటువంటి ఆరోగ్యకర వాతావరణానికి నోచుకోని ఇండియాలో క్యాన్సర్‌ బాధితులు, మృతుల సంఖ్య ఏటా పెచ్చరిల్లుతూనే ఉంది. 2020లో దేశీయంగా 13.92 లక్షల క్యాన్సర్‌ కేసులు నమోదైతే- 2021లో ఆ సంఖ్య 14.26 లక్షలకు చేరింది. నిరుడైతే అది 14.61 లక్షలకు పైగా ఎగబాకింది. 2018లో దేశవ్యాప్తంగా 7.33 లక్షల జీవితాలను క్యాన్సర్‌ కబళిస్తే- 2022లో అది 8.08 లక్షల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. రాబోయే రోజుల్లో ఆ మహమ్మారి మరింత ఉద్ధృతంగా విరుచుకుపడనుందని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌, దిల్లీ) హెచ్చరిస్తోంది. 2026 నాటికి ఇండియాలో ఏడాదికి 20లక్షల మంది క్యాన్సర్‌ కోరల్లో చిక్కుకోవచ్చునని భారతీయ వైద్య పరిశోధనా మండలి సమాచారం ఆధారంగా ఎయిమ్స్‌ తాజాగా అంచనా వేసింది. ప్రజారోగ్యానికి పొంచి ఉన్న పెనుముప్పును తప్పించాలంటే- ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించడం అత్యంత కీలకం. పార్లమెంటరీ స్థాయీసంఘం ఇటీవల సిఫార్సు చేసినట్లు- ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జనాభా ఆధారిత క్యాన్సర్‌ రిజిస్ట్రీలను పక్కాగా నిర్వహించడం అత్యావశ్యకం. వైద్య వసతులను విస్తృతపరచి అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రాణాంతక వ్యసనాల బారినపడకుండా ప్రజాచేతనకు ప్రోదిచేయాలి. రకరకాల క్యాన్సర్లు ప్రబలడానికి ప్రధాన కారణాలవుతున్న పొగాకు, మద్యాలను ఆదాయ వనరులుగా భావించే ప్రభుత్వాల పెడధోరణుల్లో ఇకనైనా మార్పు రావాలి!

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం- కాలేయం, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము, నోరు, పెదవుల క్యాన్సర్లకు మద్యపానం కారణభూతమవుతోంది. ఆ దురలవాటుకు ధూమపానం వంటివీ తోడైతే ప్రమాద తీవ్రత ఇంకా అధికమవుతుందని అది వెల్లడించింది.  దేశీయంగా వెలుగుచూస్తున్న క్యాన్సర్‌ కేసుల్లో మూడోవంతు వాటికి పొగాకే పుణ్యం కట్టుకుంటోంది. సిగరెట్లు, గుట్కా, ఖైనీ, జర్దా, పాన్‌మసాలాలకు అలవాటుపడిన వ్యక్తుల ఆరోగ్యం అతివేగంగా గుల్లవుతోంది. ఆ వాస్తవాన్ని గుర్తించకుండా ‘పొగాకును ఎక్కువగా వినియోగించే వాళ్లు క్యాన్సర్‌ వ్యాధికి గురికారు’ అంటూ రాజస్థాన్‌ వైద్యారోగ్య మంత్రి పర్‌సాదీ లాల్‌ మీనా నిరుడు తీర్మానించడం- వైద్యవర్గాలను తీవ్రంగా దిగ్భ్రాంతపరచింది. అటువంటి బాధ్యతారహిత నేతల ఏలుబడిలో- గుట్కాలూ తదితరాల తయారీ విక్రయాలూ, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధాజ్ఞలు పలు రాష్ట్రాల్లో కొల్లబోతున్నాయి. పొగాకు ఉత్పత్తులపై పన్నులను పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని కట్టడిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఊదరగొడుతున్నాయి. ఆయా పన్నుల రూపంలో వసూలయ్యే ప్రతి వంద రూపాయలకూ సమాంతరంగా భారత ఆర్థిక వ్యవస్థ రూ.816 నష్టపోవాల్సి వస్తున్నట్లు గతంలోనే వెలుగులోకి వచ్చింది. పొగాకు మోసుకొస్తున్న వ్యాధులు, వాటితో సంభవిస్తున్న మరణాల మూలంగా జీడీపీలో ఒకశాతం వరకు ఇండియా కోల్పోతోంది. ప్రజారోగ్యానికి ప్రథమ శత్రువులైన పొగాకు, మద్యాలను పూర్తిగా నిషేధించడమే దేశానికి శ్రేయస్కరం. ఆ మేరకు పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళించాలి. బీడీ కార్మికులనూ ఇతర ఉపాధి మార్గాల్లోకి నడిపించాలి. వ్యసనాల విపరిణామాలపై విద్యార్థులను అప్రమత్తం చేయడమూ ప్రభుత్వాలకు ప్రాధాన్యాంశం కావాలి. ఆరోగ్య భారతం ఆవిష్కృతం కావాలంటే- ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకునేది’ అన్న న్యాయపాలిక మహితోక్తిని పాలకులు పూర్తిగా చెవికెక్కించుకోవాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.