నిరుద్యోగితపై రామబాణం

సృజనాత్మక మెదళ్లను నవకల్పనల నారుమళ్లుగా మలచాలన్నది, ఏడేళ్లక్రితం మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘స్టార్టప్‌ ఇండియా’ విధాన అంతస్సారం. అంకుర సంస్థలతోనే కొత్త సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయంటూ ఇటీవలి స్టార్టప్‌-20 సదస్సులో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెలిబుచ్చిన ఆశావాదం వట్టిపోరాదంటే, దీటైన వ్యవస్థాగత తోడ్పాటు అత్యావశ్యకం.

Published : 07 Feb 2023 00:22 IST

సృజనాత్మక మెదళ్లను నవకల్పనల నారుమళ్లుగా మలచాలన్నది, ఏడేళ్లక్రితం మోదీ ప్రభుత్వం రూపొందించిన ‘స్టార్టప్‌ ఇండియా’ విధాన అంతస్సారం. అంకుర సంస్థలతోనే కొత్త సవాళ్లకు పరిష్కారాలు లభిస్తాయంటూ ఇటీవలి స్టార్టప్‌-20 సదస్సులో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెలిబుచ్చిన ఆశావాదం వట్టిపోరాదంటే, దీటైన వ్యవస్థాగత తోడ్పాటు అత్యావశ్యకం. దశాబ్దాల తరబడి భారతావని ప్రగతిని మేధావలస (బ్రెయిన్‌ డ్రెయిన్‌) కుంగదీసింది. విరుగుడుగా మేధాలబ్ధి (బ్రెయిన్‌ గెయిన్‌)కి నిబద్ధత చాటిన కేంద్రం, యువ పారిశ్రామికవేత్తలకు దారిదీపంగా స్టార్టప్‌ ఇండియాను ఆవిష్కరించింది. అప్పటికి దేశంలో అంకుర సంస్థలు కేవలం 452. నేడా సంఖ్య 86 వేలకు పైబడింది. చిన్న పట్టణాల్లోనూ అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయని సగర్వంగా చాటిన ప్రధాని మోదీ- మున్ముందు అవి బహుళజాతి కార్పొరేషన్లుగా ఎదగాలనీ పలు సందర్భాల్లో ఆకాంక్షించారు. పోనుపోను కృత్రిమ మేధ వినియోగంతోపాటు అంకురాల సమధిక వృద్ధి తథ్యమని రతన్‌టాటా వంటివారు భవిష్యద్దర్శనం చేశారు. వాస్తవిక కార్యాచరణ ఎలా ఉంది? వచ్చే ఏడాది మార్చి నెలవరకు ఏర్పాటయ్యే అంకుర సంస్థలకు ఆదాయపన్ను ప్రోత్సాహకాలు వర్తిస్తాయన్న నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం- తరవాతి సంగతేమిటన్న ప్రశ్నను సహజంగానే లేవనెత్తింది. నష్టాలను మరుసటి సంవత్సరానికి బదలాయించే వెసులుబాటు గడువును ఏడేళ్లనుంచి పదేళ్లకు పొడిగించి అంతటితో సరిపుచ్చారు. నిధుల సమీకరణలో భాగంగా విదేశీ పెట్టుబడిని రాబడిగా గణించి పన్ను పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదించిన సవరణా విమర్శలు రేకెత్తించింది. కొవిడ్‌ సంక్షోభవేళ ఆర్థికంగాను, మానవ వనరుల పరంగాను గడ్డు సవాళ్లను తట్టుకోలేక ఎన్నో స్టార్టప్‌లు చతికిలపడ్డాయి. ప్రగతి సౌభాగ్య అంకురాలను ఆదరంగా సాకితేనే ప్రధానమంత్రి సుందర స్వప్నం ఏనాటికైనా సాకారమవుతుంది!

చిన్న మర్రి విత్తనంలో అనంత వృక్షరాజం ఒదిగి ఉంటుంది. చిరు అంకురాలుగా ప్రస్థానం ఆరంభించిన స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం వంటివి శాఖోపశాఖలుగా ఎదిగిన తీరు స్టార్టప్‌ల అంతర్నిహిత శక్తికి దర్పణం పడుతుంది. ఆ యథార్థాన్ని ఆకళించుకుని సాంకేతిక నవీకరణలో అంకుర సంస్థలకు అండదండలు అందించి వాటిని రాటుతేల్చడంలో స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, యూకే వంటివి పోటీపడుతున్నాయి. స్టార్టప్‌ల పురోగతికి ప్రాణప్రదమనదగ్గ మౌలిక వసతుల పరికల్పనకు ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఐర్లాండ్‌ తదితర దేశాలు చిరునామాగా మారుతున్నాయి. యూనికార్న్‌ (కనీసం రూ.7,500 కోట్ల టర్నోవరు కలిగిన స్టార్టప్‌)ల ఆవిష్కరణలో ఇండియా కన్నా అమెరికా, చైనా ఎంతో ముందున్నాయి. దేశీయంగా సేద్యంతోపాటు వివిధ గ్రామీణ వృత్తులు, వ్యాపారాలకు డిజిటల్‌ సేవలందిస్తూ అంకుర సంస్థలు క్రమేపీ పునాది విస్తరించుకుంటున్నాయన్నది యథార్థం. అంకురాల స్థాపనలో మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, యూపీ, గుజరాత్‌ తొలి అయిదు స్థానాల్లో నిలుస్తున్నాయి. స్టార్టప్‌ల కోసం దేశంలోనే తొలిసారిగా ఇన్నొవేషన్‌ విధానం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంకుర సౌభాగ్య సాధనలో చురుగ్గా పురోగమిస్తోంది. రాష్ట్రాల చొరవకు కేంద్ర తోడ్పాటు జతపడాలి. జాతీయ స్థాయిలో అంకుర సంస్కృతి దృఢంగా వేళ్లూనుకుంటేనే కేంద్రం ప్రవచిస్తున్న ఆత్మనిర్భరత సుసాధ్యమవుతుంది. స్టార్టప్‌లకు నిధుల కోసం దేశంలో ఔత్సాహికులు ఎంతగానో శ్రమించాల్సి వస్తున్నదని తరుణ్‌ ఖన్నా కమిటీ గతంలో తీవ్రంగా ఆక్షేపించింది. రెండు, మూడో శ్రేణి పట్టణాల్లో మొగ్గతొడుగుతున్న అంకురాలు ఎదుర్కొంటున్న క్షేత్రస్థాయి సమస్యల్ని ఇటీవలి ఆర్థిక సర్వే ఏకరువు పెట్టింది. స్టార్టప్‌ల ఏర్పాటు యోచనల్ని కళాశాల దశలోనే ప్రోత్సహించి, పరిశ్రమలతో అనుసంధానించేలా విధివిధానాల్ని ప్రభుత్వం ప్రక్షాళించాలి. 65శాతం యువతరంతో పోటెత్తుతున్న నవతరానికి మౌలిక దన్ను సమకూర్చి సరైన జీవన నైపుణ్యాలు అలవరచగలిగితే విద్యాలయాల్లోనే యువపారిశ్రామికవేత్తలు రూపుదిద్దుకొంటారు. భారత్‌ను అంకుర కేంద్రంగా అవతరింపజేస్తారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు