పరిమితులకులోబడి ప్రగతి ప్రస్థానం

తెలంగాణ తాజా బడ్జెట్‌ సకల జనులను సంతృప్తిపరచే ప్రతిపాదనలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల సమ్మిళిత ప్రగతి సాకారమవుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం సగర్వంగా చాటుకుంది.

Published : 08 Feb 2023 00:40 IST

తెలంగాణ తాజా బడ్జెట్‌ సకల జనులను సంతృప్తిపరచే ప్రతిపాదనలకు పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆదాయాన్ని అత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం, అభివృద్ధికి సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల సమ్మిళిత ప్రగతి సాకారమవుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగం సగర్వంగా చాటుకుంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో సంక్షేమం, వ్యవసాయాలకు అగ్ర తాంబూలమిచ్చారు. షెడ్యూల్డు కులాలూ తెగలు, వెనకబడిన వర్గాలు, మైనారిటీ సంక్షేమ శాఖలకు కేటాయింపులు పెంచారు. రైతుబంధు, రుణమాఫీ, వ్యవసాయ విద్యుత్తుకు పెద్దపీట వేశారు. పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం కల్పించారు. 2015-23 మధ్య వివిధ శాఖలకు పద్దుల తీరుతెన్నుల్ని పరికిస్తే క్రమానుగతంగా పెంపుదల కనిపిస్తోంది. ఆ జాబితాలో సేద్యం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమం, పట్టణాభివృద్ధి, నీటిపారుదల, విద్య, వైద్యం వంటివి ప్రముఖంగా చోటుచేసుకోవడం- ఎనిమిదేళ్లుగా బడ్జెట్ల గమనాన్ని సూచిస్తోంది. ఆరోగ్యశ్రీ, మిషన్‌ భగీరథ, ఆసరా, కల్యాణ లక్ష్మి- షాదీ ముబారక్‌, రహదారుల నిర్వహణ, ఉపకార వేతనాలు తదితర పద్దులకింద పెరుగుదల బడ్జెట్‌ రచనలో ప్రాథమ్యాల ఎంపికను కళ్లకు కట్టింది. మొత్తం రూ.2,90,396కోట్ల భారీ బడ్జెట్‌ సమర్పణ వేళ ‘ఆర్థిక ప్రగతికి కేంద్రం కల్పిస్తున్న ఆటంకాల’ను హరీశ్‌రావు పలుమార్లు ప్రస్తావించారు. 2023-24లో సుమారు రూ.41వేలకోట్ల  గ్రాంట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నట్లు బడ్జెట్‌ పత్రాలు సూచిస్తున్నాయి. కేంద్రం సహకరించినా లేకున్నా 18 శాతం వృద్ధితో సొంత రాబడులు తమను ఆదుకుంటాయన్న ధీమాను తెలంగాణ ఆర్థిక మంత్రి వెలిబుచ్చారు. పరిమితులు వెనక్కి లాగుతున్నా ఉన్నంతలో సంక్షేమానికి, మౌలిక వసతులకు లోటు రానివ్వరాదన్న పట్టుదలే- ఈ బడ్జెట్‌కు ఆయువుపట్టు.

ఆచార్య జయశంకర్‌ లోగడ విశ్లేషించినట్లు- దేశంలో సగానికిపైగా రాష్ట్రాలకన్నా తెలంగాణ పెద్దది. భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదికన పశ్చిమ్‌ బెంగాల్‌, కేరళ- తెలంగాణ కన్నా చిన్నవి. తెలంగాణలో హైదరాబాద్‌ మినహా తక్కిన జిల్లాల్ని వెనకబడినవిగా కేంద్రమే లోగడ అధికారికంగా గుర్తించింది. అటువంటి రాష్ట్రం నేడు పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటిగా ఎదిగిందని ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్‌ తమిళిసై ప్రసంగం ప్రస్తుతించింది. సాధించినదానితో సంతృప్తి చెందితే పురోగతి స్తంభించిపోతుంది. గ్రామీణాభివృద్ధి, రహదారుల నిర్మాణాలపై ఈ బడ్జెట్‌ ప్రత్యేక దృష్టి సారించడాన్ని ఆ కోణంనుంచే పరికించాలి. ఏ పద్దుకైనా కేటాయింపుల్లో ప్రతి రూపాయీ సద్వినియోగమైతేనే ‘బంగారు తెలంగాణ’ ఆవిష్కరణ సుసాధ్యమవుతుంది. ప్రజాధనం వ్యయీకరణలో సహేతుక విధానం అవలంబించాలన్న సద్వివేకం తెలంగాణ ఆర్థిక వ్యూహంలో స్ఫుటంగా గోచరిస్తోంది. కొనసాగుతున్న పథకాలను సమీక్షించి ఏ మేరకు సత్ఫలితాలు వస్తున్నాయన్న ప్రాతిపదికన వాటి విలీనం, తొలగింపు నిర్ణయాలు అమలుపరచడం ఎన్నదగ్గ మార్పు. మెరుగైన ఫలాలు అందించే పథకాలకే ప్రాధాన్యమివ్వాలన్న కట్టుబాటు- బడ్జెట్‌ రచనలో క్రమశిక్షణకు, ప్రజాధనం వ్యయీకరణలో జవాబుదారీతనానికి దోహదపడుతుంది! వైద్యరంగాన మౌలిక వసతుల వృద్ధికి మందభాగ్యం దాపురించిందని, రేపటి పౌరుల్ని రక్తహీనత వేధిస్తోందని, రాష్ట్రంలో అక్షరాస్యత పెరగాల్సి ఉందన్న విమర్శలు గతంలో హెచ్చుశ్రుతిలో వినిపించేవి. వాటికి తావే లేకుండా కీలక రంగాలకు సమధిక కేటాయింపులతో మెరుగుదల సాధించాలన్న లక్ష్యం నెరవేరాలంటే, అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఉరకలెత్తించాలి. జాతి నిర్మాణంలో ఉజ్జ్వల పాత్ర పోషణకు, భిన్న వర్గీయుల జీవితాల్లో సంపూర్ణ వికాస సాధనకు పరిశ్రమిస్తామంటున్న తెలంగాణ బడ్జెట్‌ సరళి- భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.