మత్తు వదలరా నరుడా...

హోరున వర్షం మొదలైంది. పొలాల్లో పనిచేసుకుంటున్నవారంతా తలదాచుకోవడానికి పక్కనే ఉన్న పూరిగుడిసెలోకి పరుగులు తీశారు. లోపల చోటు చాలక కొందరు బయటే తడుస్తూ ఉండిపోయారు.

Published : 19 Mar 2023 00:12 IST

హోరున వర్షం మొదలైంది. పొలాల్లో పనిచేసుకుంటున్నవారంతా తలదాచుకోవడానికి పక్కనే ఉన్న పూరిగుడిసెలోకి పరుగులు తీశారు. లోపల చోటు చాలక కొందరు బయటే తడుస్తూ ఉండిపోయారు. లోపల కిక్కిరిసిన జనంలో ఉక్కబోత మొదలైంది. కొంతసేపటికి పరిస్థితి ఏమిటంటే- లోపలివారంతా ఏదో విధంగా బయటపడాలని చూస్తున్నారు, బయటివారంతా ఎలాగోలా లోపలికి దూరిపోవాలని తోసుకుంటున్నారు. వ్యసనం అనేది- అదిగో ఆ గాలివానలో పూరిగుడిసె లాంటిది. వ్యసనపరులు వాటినుంచి బయటపడాలని తపనపడుతూ ఉంటారు, కొత్తవారు వ్యసనాన్ని రుచి చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. సప్తవ్యసనాల్లో ఒకటైన మద్యపానం సంగతీ అంతే. ‘అమృతమంటే ఏమిటి? ఈ సారాయే! ఆనాడు దీనికోసమే దేవతలు రాక్షసులు తన్నుకు చచ్చారు’ అంటాడు కన్యాశుల్కంలో బైరాగి. నారసింహపురాణంలో హరిభట్టు చెప్పినట్టు ‘పరమ యోగికినైన భావింపగా రాని ఆనంద సంపద ఆవరించి...’ తీరుతుందని అందరిలో ఓ అందమైన భ్రమ. మత్తు తలకెక్కగానే మాట తడబడటం చాలామందికి అనుభవం. ఆ తడబాటును అక్షరాల్లోకి అనువదిస్తూ ‘పపప పాటలగంధి పాట పాడు... వవవ వారిజముఖి వలదు వలదు...’ అంటూ వాదులాడుకొంటున్న స్త్రీలను సుదక్షిణాపరిణయంలో అన్నయకవి వర్ణించాడు. ఒకోసారైతే మామూలుగా ఉన్నప్పుడు మాట పెగలనివారు మందు పడగానే ‘మాటాడ నేరని మౌగ్ధ్యంబు విడనాడి, ప్రౌఢిమ తనుతానె గాఢమై’నట్లు మహా వక్తలైపోతారు. మరికొందరైతే ‘మందిరంలో మద్యపానాన్ని దయచేసి అనుమతించు, తప్పంటావా! దేవుడు లేని చోటొక్కటి చూపించు’ అంటూ అతి తెలివికి పోతారు. ‘పెక్కు భంగుల్‌ వివేక భ్రష్ట సంపాతముల్‌’ అని భర్తృహరి చెప్పింది ఈ వికారాల గురించే!

యుద్ధానికి వెళ్ళే సమయంలో యోధులు తమలో పౌరుషాగ్నిని రగిలించేందుకై మద్యపానం చేసే సందర్భాలను ‘వీరపాణం’ అంటారు. ‘ఆజికి(రణానికి) ఏగు అత్తరిని తేజము విక్రమంబు ధృతి ధీరతయుం కడు సాహసంబునున్‌...’ అంటూ కుబ్జాకృష్ణ విలాసకావ్యం వివరించింది- వీరపాణం గురించి. మదన కదనానికి సైతం మద్యపానం అలాగే సహకరిస్తుందని ఓ నమ్మకం. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు ఎన్నిసార్లు కాదని నిరూపించినా, జనంలో ఆ భ్రాంతి మిగిలే ఉంది. స్త్రీలకు సైతం ఈ భ్రమ వర్తిస్తుంది... ‘జవ్వనులకు(ప్రౌఢ స్త్రీలకు) మరల శైశవము(కుర్రతనం) తెచ్చె- వారుణియు(మద్యం) ఎట్టి సిద్ధ ఓషధీ రసంబొ!’ అని చమత్కరించాడు- వారు పసివాళ్లలా నేలపై పాకడం చూసి, కవికర్ణ రసాయనంలో సంకుసాల నృసింహకవి. ఇలా రకరకాల అపోహలతో జనం వ్యసనపరులు అవుతారు. ‘వెలుగుతున్న సిగరెట్‌కు రెండో చివర ఒక మూర్ఖుడు ఉంటాడు’ అన్న ఆంగ్ల సామెత ఈ వ్యసనాలన్నింటికీ వర్తిస్తుంది. వరదనీటిలో ఇద్దరు కొట్టుకుపోతుండగా ఒకడికి ఏదో ఆధారం దొరికి గట్టిగా పట్టుకొన్నాడు. మైదాన ప్రాంతంలోకి వచ్చినా ‘ఇంకా వదిలిరావేం?’ అని మిత్రుడు అడిగాడు. ‘నేను పట్టుకొన్నది మొసలిని మిత్రమా... ఇప్పుడది నన్ను వదలడం లేదు’ అన్నాడు నిస్సహాయంగా. ఇది వ్యసనపరుల అంత్యదశ! పూటుగా మద్యం తాగి పెళ్ళిపీటలపై పడి నిద్రపోయిన ప్రసేన్‌ జీత్‌ హలోయ్‌ అనే అస్సాంలోని నల్‌బరి జిల్లా యువకుడి ఉదంతం తాజా ఉదాహరణ. బొమ్మలాటవాడు చివరిలో ‘కీలు సడలించిన జంత్రపు బొమ్మయో అనన్‌ మత్తుచేత మహిని వ్రాలె...’ అని కవిజన చకోర చంద్రోదయంలో అల్లమరాజుకవి వర్ణించినట్లు కాళ్లు కీళ్లు సడలి అడ్డంగా పడిపోయిన ప్రసేన్‌ తీరు చూసి ‘ఈ మొసలి నన్నూ మింగేస్తుంది... నాకీ పెళ్ళి వద్దు’ అని వధువు లేచి వెళ్ళిపోవడం కొసమెరుపు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.