పుతిన్‌ పైశాచికత్వం

‘ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠీకరించడం, మానవ హక్కులూ స్వేచ్ఛలను పరిరక్షించడంలో రష్యా కృషికి అడ్డుపడటం అన్యులకు అసాధ్యం’- తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వ్లాదిమిర్‌ పుతిన్‌ సెలవిచ్చిన మాటలివి!

Published : 20 Mar 2023 00:53 IST

‘ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠీకరించడం, మానవ హక్కులూ స్వేచ్ఛలను పరిరక్షించడంలో రష్యా కృషికి అడ్డుపడటం అన్యులకు అసాధ్యం’- తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వ్లాదిమిర్‌ పుతిన్‌ సెలవిచ్చిన మాటలివి! దుర్బల రాజ్యాలపై అగ్రదేశాల దాష్టీకాలను గతంలో ఛీత్కరించిన ఆయన- సామ్రాజ్యవాద దురహంకారిగా తన నిజస్వరూపాన్ని ఆ తరవాతి రోజుల్లో బయటపెట్టుకున్నారు. పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని సహించలేనితనంతో ఏడాది క్రితం ఏకపక్షంగా రణభేరి మోగించిన పుతిన్‌- ఉక్రెయిన్‌ను మరుభూమిగా మారుస్తున్నారు. పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని సహించలేని పుతిన్‌ యుద్ధోన్మాదం- కోటీ నలభై లక్షల మందికిపైగా ఉక్రెయిన్‌ వాసులను నిర్వాసితులను చేసింది. మాస్కో మూకల రాక్షసదాడుల్లో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు, అనాథలుగా మిగులుతున్న అభాగ్యులు, అత్యాచారాల పాలబడి జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్న మహిళల దయనీయగాథలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. 16వేల మందికి పైగా ఉక్రెయిన్‌ చిన్నారులను రష్యా దళాలు బలవంతంగా తమ దేశానికి తరలించాయన్న ఐరాస విచారణ సంఘం నివేదికాంశాలు ఇటీవలే వెల్లడయ్యాయి. ఆ మేరకు యుద్ధనేరాలకు ఒడిగట్టినట్లుగా నిర్ధారిస్తూ పుతిన్‌ అరెస్టుకు అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) తాజాగా వారెంటు జారీచేసింది. ఉక్రెయిన్‌ ఉసురుపోసుకున్న మహాపాపానికి పుతిన్‌ తప్పనిసరిగా బాధ్యత వహించాల్సిందే. అందువల్లే ఐసీసీ అరెస్టు వారెంటును ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్యవాదులు సమర్థిస్తూ, అది అమలుకావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. కానీ, క్రెమ్లిన్‌ శక్తియుక్తుల దృష్ట్యా ఐసీసీ ఆదేశాలు ఆచరణసాధ్యం కానివన్నది సుస్పష్టం. అనేక అనర్థాలకు కారణభూతమవుతున్న విధ్వంసక సమరం ముగిసి విశ్వమానవాళి ఊపిరి పీల్చుకునేది ఎప్పుడో కూడా ఎవరికీ అంతుపట్టకపోతుండటమే ఆందోళనకరం!

రష్యా అధినేతకు భారత ప్రధాని మోదీ హితవుపలికినట్లు- ఇది యుద్ధాల శకం కాదు. కానీ, రోజుకు సుమారు రూ.2400 కోట్లకు పైగా వెచ్చించి ఉక్రెయిన్‌లో రక్తపుటేళ్లు పారిస్తున్న పుతిన్‌... అంతిమంగా సాధించేదేమిటి? పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుతానికి అంతగా లేదనే కథనాలు వెలువడుతున్నా- యుద్ధాన్ని విరమించకపోతే, దీర్ఘకాలంలో అది ఘోరంగా దెబ్బతినడం ఖాయమే. కాబట్టే, సామాన్య రష్యన్‌ పౌరులూ తమ అధ్యక్షుడి రణపిపాసను బలంగా నిరసిస్తున్నారు. అంతులేని నియంతృత్వంతో స్వదేశంలో వ్యతిరేకులపై ఉక్కుపాదం మోపుతున్న పుతిన్‌- అంతర్జాతీయ ఆహారసంక్షోభానికి ప్రధాన కారకులవుతున్నారు. నిరవధికంగా కొనసాగుతున్న యుద్ధం మూలంగా సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమై పలు దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు భగ్గుమంటూ జనసామాన్యం బతుకులు భారమవుతున్నాయి. అయినప్పటికీ తన కదన మూర్ఖత్వాన్ని వదిలిపెట్టడానికి సుతరామూ ఇష్టపడని మాస్కో- అణ్వస్త్ర ప్రయోగ బూచితో ప్రపంచాన్ని మరింతగా భయాందోళనలకు గురిచేస్తోంది. తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే ఎంతటి నిర్ణయానికైనా వెనకాడబోమని రష్యా అధికారవర్గాలు హుంకరిస్తున్నాయి. అణ్వస్త్రాల కోరలకు పదునుపెట్టడమంటే- ఆత్మవినాశనాన్ని కోరి ఆహ్వానించడమేనన్న కీలకాంశాన్ని అవి మరచిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నేడు రష్యా పర్యాటనకు వెళ్తున్న చైనా అధినేత జిన్‌పింగ్‌- యుద్ధ విరమణ దిశగా పుతిన్‌ను నడిపించగలరా అన్నదే ఆసక్తికరం. వివాదాలు, సంక్షోభాలు ఏవైనా చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని బీజింగ్‌ తాజాగా స్పష్టీకరించడం- ఆ మేరకు విశ్వశాంతిపై కొత్త ఆశలకు అంటుకడుతోంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.