చెత్తకొండల్ని కరిగించేదెలా?

పరిశుభ్రతే పౌరస్మృతిగా నయా జీవన సంస్కృతిగా వర్ధిల్లుతున్న దేశాలెన్నో ప్రగతి పథంలో స్థిరంగా పురోగమిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా గాడి తప్పి జోరెత్తుతున్న పట్టణీకరణ భారత్‌లోని అనేక నగరాలను పట్టణాలను అతిపెద్ద చెత్తకుప్పలుగా మారుస్తోంది.

Published : 21 Mar 2023 02:57 IST

రిశుభ్రతే పౌరస్మృతిగా నయా జీవన సంస్కృతిగా వర్ధిల్లుతున్న దేశాలెన్నో ప్రగతి పథంలో స్థిరంగా పురోగమిస్తున్నాయి. అందుకు విరుద్ధంగా గాడి తప్పి జోరెత్తుతున్న పట్టణీకరణ భారత్‌లోని అనేక నగరాలను పట్టణాలను అతిపెద్ద చెత్తకుప్పలుగా మారుస్తోంది. ఏదో ఒకనాడు దిల్లీలోని ఘాజీపుర్‌లో చెత్తదిబ్బలు కుతుబ్‌ మినార్‌ ఎత్తుకు చేరతాయంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానమే ఎద్దేవా చేయడం- వ్యర్థాలెంత అనర్థకాలవుతున్నాయో యావజ్జాతికీ చాటిచెప్పింది. నేటికీ సరైన దిద్దుబాటు చర్యలు కరవై, జనాభా అవసరాలకు తగ్గట్లు డంపింగ్‌ యార్డులు కొరవడి- పట్టణ ప్రాంత శివార్లు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పల కారణంగానే కొన్ని నగరాలు తీవ్ర అప్రతిష్ఠపాలవుతున్నాయి. కేరళలోని కొచ్చి నగర శివారు బ్రహ్మపురం ప్రాంతంలో భారీ డంపింగ్‌యార్డ్‌ వద్ద ఇటీవల మళ్ళీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి 12 రోజులు పట్టింది. అన్నాళ్లూ విషవాయువులు కొచ్చి నగరాన్ని దట్టంగా ఆవరించి ప్రజలు నానాయాతనల పాలబడ్డారు. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఎన్‌జీటీ (జాతీయ హరిత ట్రైబ్యునల్‌), అధికారుల దారుణ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల జరిమానా విధించింది! సుమారు 65 మీటర్ల ఎత్తున చరిత్రాత్మక తాజ్‌మహల్‌కు దీటుగా ‘ఎదిగిన’ ఘాజీపుర్‌ చెత్త పర్వతంలో నిరుడు చెలరేగిన అగ్నిజ్వాలల్ని ఆర్పడానికీ రోజుల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ముంబైలోని దేవ్‌నార్‌ డంపింగ్‌ క్షేత్రం 18 అంతస్తుల భవంతి ఎత్తుతో దేశంలోనే అగ్రస్థాయికి చేరింది. చెన్నైలోని కోసాపేట యార్డ్‌ ప్రతిరోజూ వెయ్యి టన్నులకు పైగా వచ్చిపడే వ్యర్థాలతో పరిసర ప్రాంతవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. కేరళలోని బ్రహ్మపురాన్ని తలపించేవి, తలదన్నేవి- దేశంలో మూడు వేలదాకా ఉన్నాయని అంచనా. వ్యర్థాల నిర్వహణలో వైఫల్యానికి కేరళ కన్నా ముందే పంజాబ్‌, దిల్లీ, కర్ణాటక, రాజస్థాన్‌ తదితరాలపైనా ఎన్‌జీటీ భారీ జరిమానాల కొరడా ఝళిపించింది. అయినా పరిస్థితి కుదుటపడకపోవడం వ్యక్తిపరంగాను, వ్యవస్థాగతంగాను పకడ్బందీ సంస్కరణల ఆవశ్యకతను చాటుతోంది.

వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్‌లో పోలాండ్‌, ఎస్తోనియా, ఐర్లాండ్‌ తదితర దేశాల విజయగాథలు ఎందరెందరిలోనో గొప్ప స్ఫూర్తి రగిలించాయి. ప్రణాళికాబద్ధంగా చెత్తను సమీకరించి వర్గీకరించి పునశ్శుద్ధి చేసే ప్రక్రియ పరంగా సమర్థవ్యూహం లోపించడమే దేశీయంగా వివిధ సమస్యలకు అంటుకడుతోంది. వీధి కూడళ్లనుంచి వ్యర్థాలను తీసుకెళ్ళి దూరంగా పారబోసే చెత్తవిధానం దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రత్యామ్నాయాల అన్వేషణ తక్షణావసరమని అయిదేళ్లక్రితమే సీఎస్‌ఈ (సైన్స్‌, పర్యావరణ కేంద్రం) ఉద్బోధించినా పట్టించుకున్నదెవరు? గాలి నాణ్యత, పైపులైన్ల ద్వారా నీటి సరఫరాలతోపాటు వ్యర్థాల నిర్వహణలో నిర్దేశిత లక్ష్యాలు చేరకపోతే పుర, నగరపాలక సంస్థలకు నిధులు నిలిపివేస్తామని కేంద్రం హెచ్చరించిన తరవాతా- చాలాచోట్ల పరిస్థితి తేటపడనే లేదు. దేశంలో అనుదినం సగటున కోటీ 40 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర వ్యర్థాలు పోగుపడుతుండగా అందులో 70 శాతందాకా శుద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం వల్లెవేస్తున్న లెక్కలపై ఎందరికో సందేహాలున్నాయి. తక్కినదంతా ఎక్కడికక్కడ పేరుకుపోతున్నట్లు అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. స్థానిక చొరవే ఈ విపత్కర సమస్యకు ప్రధాన విరుగుడు. భాగ్యనగరంలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో చెత్తను మండించి విద్యుదుత్పత్తి చేసే కేంద్రం దక్షిణ భారతావనిలో తొలిసారిగా ముప్ఫై నెలలక్రితం అందుబాటులోకి వచ్చింది. అటువంటిదే దుండిగల్‌లో మరొకటి సిద్ధమైంది. చెత్తను అశాస్త్రీయ పద్ధతుల్లో తగలబెట్టడమో, గుట్టలుగా పేరబెట్టడమో చేస్తే- ప్రజారోగ్యం, పర్యావరణం రెండూ దెబ్బతింటాయి. ఆ స్పృహతో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం, బయోమైనింగ్‌ లాంటి పద్ధతుల ద్వారా అంబికాపుర్‌(ఛత్తీస్‌గఢ్‌), చంద్రాపుర్‌(మహారాష్ట్ర), తళిపరంబ(కేరళ) వంటి పట్టణాలు చెత్తకొండల బరువును చాకచక్యంగా వదిలించుకుంటున్నాయి. బ్రహ్మపురం తరహా ఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, ప్రజారోగ్య సంరక్షణ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి- ఏ రాష్ట్రానికైనా వ్యర్థాలపై అటువంటి సమర్థ వ్యూహం ప్రాణావసరం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.