జపాన్‌తో చెలిమి... భద్రతకు బలిమి
‘ప్రియ మిత్రుడా...’ అని ఒకరికొకరు అప్యాయంగా పిలుచుకొంటూ రష్యా, చైనా అధినేతలు సోమవారం మాస్కోలో భేటీవేశారు. పాశవికమైన తన సామ్రాజ్యవాద కాంక్షకు ఉక్రెయిన్‌ను బలిపెడుతున్న పుతిన్- అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నారు. ఆయనకు స్నేహహస్తం చాచిన జిన్‌పింగ్- తమది అవధుల్లేని మిత్రత్వమని చాటిచెప్పారు.
‘ప్రియ మిత్రుడా...’ అని ఒకరికొకరు అప్యాయంగా పిలుచుకొంటూ రష్యా, చైనా అధినేతలు సోమవారం మాస్కోలో భేటీవేశారు. పాశవికమైన తన సామ్రాజ్యవాద కాంక్షకు ఉక్రెయిన్‌ను బలిపెడుతున్న పుతిన్- అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నారు. ఆయనకు స్నేహహస్తం చాచిన జిన్‌పింగ్- తమది అవధుల్లేని మిత్రత్వమని చాటిచెప్పారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద అదే రోజు భారత పర్యటనకు విచ్చేసి ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం- విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ‘నేడు ఉక్రెయిన్ ఉన్న బీతావహ స్థితిలో రేపు ఆసియా ఉండవచ్చు’ అన్న కిషిద నిశ్చితాభిప్రాయం- బీజింగ్ విస్తరణవాదంపై టోక్యో భయాందోళనలకు అద్దంపడుతోంది. దక్షిణ చైనా సముద్రం, సెంకాకు దీవుల్లో డ్రాగన్ దూకుడు- జపాన్‌ను తీవ్రంగా కలవరపరుస్తోంది. చైనాను నిలువరించే వ్యూహంలో భాగంగా దిల్లీ వేదికపై స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ ప్రాంతంకోసం తన నూతన ప్రణాళికను కిషిద ఆవిష్కరించారు. ఇండో-పసిఫిక్ దేశాల రక్షణ, వాటి మధ్య మెరుగైన ఆర్థిక సహకారమే లక్ష్యంగా 7500 కోట్ల డాలర్లను సమకూరుస్తామని ఆయన ప్రకటించారు. బహుళస్థాయి అనుసంధానత, కడలి నుంచి నింగి వరకు భద్రత, సవాళ్లను సమష్టిగా అధిగమించడం, శాంతిని స్థాపించడం అనే నాలుగు పునాదులపై టోక్యో ప్రణాళిక పురుడుపోసుకుంది. వాతావరణ మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ వంటి కీలకాంశాల్లో భాగస్వామ్య పక్షాల (ఆగ్నేయాసియా, దక్షిణాసియా, పసిఫిక్ ద్వీపదేశాలు) పరస్పర లబ్ధికి అది దారిచూపనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్య విస్తరణను అడ్డుకోవడంలో దాంతోపాటు భారత్, జపాన్‌ల ‘ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచస్థాయి భాగస్వామ్యమూ’ కీలకం కానుంది!
ఇండియా జపాన్‌ల సాంస్కృతిక అనుబంధానికి ఎన్నో శతాబ్దాల క్రితమే బౌద్ధం వారధి అయ్యింది. పోఖ్రాన్ అణుపరీక్షల సందర్భంలో దిల్లీపై టోక్యో చిర్రుబుర్రులాడినా- తదనంతర కాలంలో ఇరుపక్షాల చెలిమి చిక్కబడింది. రెండు దశాబ్దాలుగా భిన్న రంగాల్లోకి భూరిధనాన్ని ప్రవహింపజేస్తూ భారత ఆర్థికాభివృద్ధికి జపాన్ తనవంతు చేయూతను అందజేస్తోంది. రాబోయే అయిదేళ్లలో ఇండియాలో రూ.3.20 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్లుగాను అది నిరుడే వెల్లడించింది. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడు రైలు ప్రాజెక్టుకు ఆ దేశం అందిస్తున్న రుణంలో నాలుగో విడత నిధుల విడుదలకు కిషిద తాజా పర్యటన మార్గం సుగమం చేసింది. భారత్‌లో జపనీస్ భాషాబోధనకు సంబంధించి ముడివడిన ఒడింబడిక సైతం ద్వైపాక్షిక స్నేహాన్ని విస్తృతపరిచేదే. ఈ ఏడాది జీ20 కూటమికి ఇండియా నేతృత్వం వహిస్తుండగా- నాయకురాలిగా జీ7ను జపాన్ నడిపించనుంది. వచ్చే మే నెలలో హిరోషిమాలో నిర్వహించనున్న జీ7 సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మోదీని ఆహ్వానించిన కిషిద- ఇంధన భదత్ర, రక్షణ ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై ఆయనతో కూలంకషంగా చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా జనజీవితాలను ప్రభావితం చేస్తున్న గడ్డుసమస్యలపై జీ7, జీ20 సదస్సుల్లో లోతైన చర్చల దిశగా మేలిమి అజెండాల రూపకల్పనకు ఇండియా, జపాన్ మైత్రి అక్కరకు రానుంది. రెండు దేశాల నడుమ వాణిణ్యం- గతంతో పోలిస్తే గరిష్ఠంగా నిరుడు 2075 కోట్ల డాలర్లకు చేరుకుంది. ‘ధర్మ గార్డియన్’, ‘వీర్ గార్డియన్’ల పేరిట సాగుతున్న సంయుక్త సైనిక, గగనతల యుద్ధ అభ్యాసాలు- రక్షణ రంగంలోనూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తున్నాయి. చైనా పెనుముప్పును కాచుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియాలతో కలిసి ‘క్వాడ్’లో సభ్యదేశాలుగా ఇండియా, జపాన్ ఏకతాటిపై నడుస్తున్నాయి. ఆ బాంధవ్యాన్ని పటిష్ఠపరచుకుంటూనే- ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో ఉభయతారక చెలిమికి ఇరుపక్షాలు కొత్త చివుళ్లు తొడగాలి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
Smart phone: ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!
-
Sports News
CSK vs GT: సీఎస్కేను భయపెట్టిన చెన్నై కుర్రాడు.. గుజరాత్ జట్టులో ‘ఇంపాక్ట్’ అతడు!
-
General News
Vijayawada: చట్టబద్ధంగా రావాల్సిన వాటి కోసం అడగడం తప్పా?: బొప్పరాజు
-
World News
Putin: పశ్చిమ దేశాలను కాదని.. పుతిన్‌కు అండగా దక్షిణాఫ్రికా..!
-
World News
China: రికార్డు స్థాయికి.. చైనా యువత నిరుద్యోగిత రేటు