ముమ్మరిస్తున్న నీటిఎద్దడి

గొంతు తడిపే గుక్కెడు జలాలు పరిశుభ్రమైనవైతే, సేద తీరి ప్రాణాలు కుదుటపడతాయి. అవే కలుషితమైనవైతే, రోగాలు కమ్ముకుంటాయి. కొందరి ప్రాణదీపాలూ కొడిగట్టిపోతాయి. భూతలంమీద జీవజాలం మనుగడకే కాదు- హరితశోభ వర్ధిల్లడానికి, దేశాలు సుస్థిరాభివృద్ధి పథంలో కొనసాగడానికి... నీరే ప్రాణాధారం.

Published : 24 Mar 2023 00:41 IST

గొంతు తడిపే గుక్కెడు జలాలు పరిశుభ్రమైనవైతే, సేద తీరి ప్రాణాలు కుదుటపడతాయి. అవే కలుషితమైనవైతే, రోగాలు కమ్ముకుంటాయి. కొందరి ప్రాణదీపాలూ కొడిగట్టిపోతాయి. భూతలంమీద జీవజాలం మనుగడకే కాదు- హరితశోభ వర్ధిల్లడానికి, దేశాలు సుస్థిరాభివృద్ధి పథంలో కొనసాగడానికి... నీరే ప్రాణాధారం. వాస్తవంలో, ప్రపంచవ్యాప్తంగా 26 శాతం జనాభా స్వచ్ఛమైన తాగునీరు పొందలేకపోతున్నారు. కనీస పారిశుద్ధ్యానికి నోచనివారు ఎకాయెకి 46శాతం. రెండువందల కోట్లమందికి పైగా మానవాళి రక్షిత మంచినీటి వసతికి దూరమై అలమటించడం కన్నా విషాదం ఇంకేముంటుంది? ఐరాస ప్రపంచ జల అభివృద్ధి నివేదిక క్రోడీకరించిన యథార్థాల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్లవారీ నీటికొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహారా పరీవాహక ప్రాంతాల భవితవ్యం మరింత దుర్భరం కానుందనీ నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచ జనాభాలో 18శాతానికి నెలవైన భారత్‌కు అందుబాటులో ఉన్న మంచినీటి వనరులు కేవలం నాలుగు శాతమే. అందువల్ల నీటిఎద్దడి తాలూకు దుష్ప్రభావాల తీవ్రత దేశీయంగా అధికంగానే ఉండనుందని వివిధ అధ్యయనాలు ఇప్పటికే తెలియజెప్పాయి. విశ్వవ్యాప్తంగా ఉపరితల నీటినిల్వలు ఏడాదికి సగటున సెంటీమీటరు చొప్పున తెగ్గోసుకుపోతుండగా ఇండియాలో అంతకు మూడు రెట్లకుపైగా తరుగుదల నమోదైనట్లు ఆమధ్య ప్రపంచ వాతావరణ సంస్థ ధ్రువీకరించింది. నీటి కొరత నానాటికీ ముమ్మరిస్తున్న దేశంలో 2030 నాటికి 40 శాతం జనాభా తాగునీటి కటకటతో ఇక్కట్లపాలయ్యే ముప్పుందని నీతిఆయోగ్‌ అయిదేళ్లక్రితమే మదింపు వేసింది. పొంచి ఉన్న పెను సంక్షోభాన్ని నిలువరించడానికి, ఉరుముతున్న జలగండాన్ని తప్పించుకోవడానికి- కేంద్రం, రాష్ట్రాలు, బాధ్యతాయుత ప్రజానీకం... ఏకోన్ముఖంగా సంరక్షణ మహాయజ్ఞానికి నిబద్ధం కావడమే అత్యుత్తమ పరిష్కారం!

చరిత్రలో కనీవినీ ఎరుగనంతటి జలసంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండియా 2050 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో ఆరుశాతందాకా నష్టపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు గతంలోనే గగ్గోలు పుట్టించాయి. సేద్యరంగంపై తీవ్రప్రభావం ప్రసరించనుందన్న డబ్ల్యూఆర్‌జీ (జలవనరుల బృందం) తాజా అధ్యయనం ప్రకారం, 2030 నాటికి భారత్‌కు అవసరమైన జలరాశిలో సగమే అందుబాటులో ఉండనుంది. ఒకవైపు నీటి ఎద్దడి, మరో పక్క ఉష్ణపవనాల కారణంగా- 2050 సంవత్సరం నాటికి దేశంలో ఆహార సరఫరాలు సుమారు 16శాతం దాకా తగ్గిపోనున్నాయన్న అంచనాలు యావజ్జాతినీ బెంబేలెత్తించేవే. వివిధ ప్రమాద సంకేతాలు ఇప్పటికే ప్రస్ఫుటమవుతున్నాయి. దేశంలో ప్రతిరోజూ కుళాయి ద్వారా నీటి సరఫరా పొందుతున్నవారు 74శాతమని, నేటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒక్కరోజే నల్లా వస్తున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ్‌బెంగాల్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, యూపీల్లో మూడోవంతు కుటుంబాలైనా నల్లా భాగ్యానికి నోచుకోవడంలేదు. దేశార్థికానికి జీవనాడులుగా ప్రధాని మోదీ అభివర్ణించిన నదులు అనేకం కాలుష్యకాసారాలుగా భ్రష్టుపడుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు క్రిమిసంహారిణులు జంతుకళేబరాలు- నదీ ప్రవాహాల్ని ముంచెత్తుతున్నాయి. అటు భూగర్భజలాలూ విషపూరితాలవుతున్నాయి. 70శాతం నీటి వనరులు కలుషితమై, ఏటా కనీసం రెండు లక్షలమంది అకాల మృత్యువాత పడుతున్న దేశం మనది. ఈ దారుణ మారణహోమాన్ని నిలువరించి ప్రజానీకానికి జలభాగ్యం ప్రసాదించడమే ప్రభుత్వాల అగ్రప్రాధాన్యాంశం కావాలి. మనిషి ఎంతటి జ్ఞానసంపదను సముపార్జించినా, విజ్ఞాన సాగరాలను మధించినా- కొత్తగా నీటిని సృష్టించలేడు. జలవనరుల్ని కలుషితం కాకుండా సంరక్షించుకోవడం, నీటి ఎద్దడిని అధిగమించేలా వర్షజలధారల్ని ఒడిసిపట్టుకోవడమే శరణ్యం. దేశంలో ఏటా కురిసే వాననీటిలో సగమైనా శాస్త్రీయ జాతీయ ప్రణాళికతో భద్రపరచుకుని, వ్యర్థజలాలను శుద్ధిచేసి పునర్వినియోగానికి మళ్ళించగలిగితే- భారత్‌కు మున్ముందు నీటిఎద్దడి ముప్పన్నదే దాపురించదు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు