క్రీడలపై జాతీయ వ్యూహం

దిల్లీ వేదికగా 65 దేశాలకు చెందిన 324 మంది బాక్సర్లు భిన్నశ్రేణుల్లో పాల్గొన్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ ఆధిక్యం ప్రస్ఫుటమైంది.

Published : 28 Mar 2023 00:20 IST

దిల్లీ వేదికగా 65 దేశాలకు చెందిన 324 మంది బాక్సర్లు భిన్నశ్రేణుల్లో పాల్గొన్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ ఆధిక్యం ప్రస్ఫుటమైంది. చైనా, రష్యాలను రెండు మూడో స్థానాలకు పరిమితం చేసిన ఇండియా నాలుగు స్వర్ణ పతకాలతో ఛాంపియన్‌గా అవతరించింది. ఈ విశేష ఘనతకు కారణమైన నలుగురు మహిళల క్రీడాప్రస్థానం- వారిని అలా రాటుతేల్చిన ప్రతికూలతలకు, అపార పోరాట స్ఫూర్తికి నిలువుటద్దం పడుతోంది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు నిఖత్‌ జరీన్‌ వరసగా రెండోసారి విశ్వవిజేతగా చరిత్ర సృష్టించింది. జూనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ గెలిచిన దరిమిలా క్రమేపీ తెరమరుగైపోయిన ఇతరుల్లాగా నిఖత్‌ కథా ముగిసిపోతుందన్న అంచనాలు నిరుడు చెల్లాచెదురయ్యాయి. అది గాలివాటం గెలుపేమీ కాదని నిరూపించి, వచ్చే ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి బాక్సింగ్‌ స్వర్ణం సాధించడమే తదుపరి లక్ష్యమని సింహనాదం చేస్తున్న నిఖత్‌ పేరిప్పుడు దేశమంతటా మార్మోగుతోంది! టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అస్సామీ యువతి లవ్లీనా ఈసారి ప్రపంచ పోటీల్లో విపరీత ఒత్తిడిని ఎదుర్కొని రాణించిన తీరు ఎందరికో విలువైన గొప్ప పాఠం. 2018, 2019 నాటి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యానికే పరిమితమైన లవ్లీనా ఇప్పుడు సర్వశక్తులూ ఒడ్డి 75 కిలోల విభాగంలో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. దశాబ్దకాలంగా బాక్సింగ్‌ బరిలో ఎన్నో ఒడుదొడుకులు, వరస పరాజయాలు చవిచూసిన స్వీటీ బూర అయిదోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అద్భుతం చేసి చూపించింది. 81 కిలోల విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకునేదాకా పంతం సడలనివ్వని ఆమె, తుది పోరులో తనకంటే ఎత్తయిన చైనా ప్రత్యర్థిని మట్టికరిపించింది. 2017, 2018లో ప్రపంచ యూత్‌ ఛాంపియన్‌ అయిన నీతూ గాంగాస్‌ తాజాగా 48 కిలోల విభాగంలో విశ్వవిజేతగా నిలిచి అసంఖ్యాక అభిమానుల్ని సముపార్జించుకుంది. ‘ఇప్పుడు వచ్చే నగదు బహుమతితో మా కుటుంబ అప్పులు తీర్చేస్తా’నంటున్న నీతూ వ్యాఖ్యలు- ప్రతిభా సంపన్నుల అన్వేషణ, శిక్షణ, ప్రోత్సాహకాల పరంగా వ్యవస్థాగత సంస్కరణల సత్వర ఆవశ్యకతను ఎలుగెత్తుతున్నాయి.

దేశంలో వ్యాయామ విద్యకు, క్రీడలకు ఇతోధిక ప్రాముఖ్యం దక్కాలంటూ- ‘కంప్యూటర్‌ ప్లే స్టేషన్‌లో కాదు... నిజమైన క్రీడామైదానాల్లో యువత స్వేదం చిందించా’లని గతంలో ప్రధాని మోదీ పిలుపిచ్చారు. పాఠశాలలన్నీ రోజుకు కనీసం గంటన్నర సమయాన్ని ఆటలకు కేటాయించాలన్న సిఫార్సులు మోతెక్కుతున్నా- తగినన్ని ఆటస్థలాలు, క్రీడాసామగ్రి ఎక్కడున్నట్లు? నేడు నవతారగా ప్రశంసలందుకుంటున్న నీతూ శిక్షణ కోసం ఆమె తండ్రి ఉద్యోగం మానేసి అప్పులపాలై ద్విచక్ర వాహనంపై రోజూ 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఇప్పటికీ మణిపుర్‌లోని 48 శాతం మహిళా అథ్లెట్లు రోజువారీ ప్రాక్టీస్‌ కోసం రానుపోను 20 కిలోమీటర్లకుపైగా వెళ్ళి రావాల్సి వస్తున్నదని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. జాతీయ స్థాయి పాఠశాలల బాక్సింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించిన చండీగఢ్‌ బాలిక పేదరికం కారణంగా బడికి ఆటకు దూరమై కూలిపనులకు వెళ్తున్న ఉదంతం ఆమధ్య వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో పట్టుదలగా కృషిచేసి పతకాలు కొల్లగొట్టినవారిని అభినందించడానికే ప్రధానంగా ప్రభుత్వాలు పరిమితమవు తుండటం దురదృష్టకరం. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అన్వేషణ సాగిస్తే ఎన్నో ముడి కోహినూర్లు వెలికివస్తాయి. సహజసిద్ధ ప్రతిభకు ఇక్కడ లోటులేదు. చైనా, ఆస్ట్రేలియా, యూకే ప్రభృత దేశాల్లో మాదిరిగా ఆటల పట్ల ఆసక్తి కలిగిన చురుకైనవారిని గుర్తించి శాస్త్రీయ శిక్షణతో సానపట్టి ఒలింపియన్లుగా తీర్చిదిద్దే పకడ్బందీ వ్యవస్థే దేశీయంగా కొరవడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రణాళికాబద్ధ క్రీడావికాసం పట్ల దృష్టి సారించి పాఠశాల దశలోనే సరైన వసతులు కల్పిస్తే- నిఖత్‌, నీతూ వంటి మెరికలు మరెందరో దొరుకుతారు. క్రీడాజగత్తులో మువ్వన్నెల పతాక ధగధగల్ని సగర్వంగా తేజరిల్లజేస్తారు!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి