అవ్యవస్థకు సరైన చికిత్స!

రోగులకు సాంత్వన ప్రసాదించే వైద్య చికిత్సలో అత్యంత కీలకమైన ఔషధాలకు సంబంధించి తాజాగా వెలుగుచూసిన కథనాలు ఆందోళనపరుస్తున్నాయి. అందులో ఒకటి ధరల పెరుగుదలపై, రెండోది నకిలీల ఉత్పాతం గురించి.

Published : 29 Mar 2023 00:31 IST

రోగులకు సాంత్వన ప్రసాదించే వైద్య చికిత్సలో అత్యంత కీలకమైన ఔషధాలకు సంబంధించి తాజాగా వెలుగుచూసిన కథనాలు ఆందోళనపరుస్తున్నాయి. అందులో ఒకటి ధరల పెరుగుదలపై, రెండోది నకిలీల ఉత్పాతం గురించి. ఔషధాల కొనుగోలుకయ్యే వ్యయభారం తట్టుకోలేక కిందుమీదులవుతున్న ఎందరికో ఆరోగ్య భాగ్యాన్ని దక్కనివ్వని పరిణామాలివి. ఏప్రిల్‌ నెల నుంచి నొప్పి నివారిణులు (పెయిన్‌ కిల్లర్స్‌), యాంటీబయాటిక్స్‌, గుండె జబ్బులకు వాడేవి సహా వివిధ రకాల మందుల ధరల పెంపుదలకు రంగం సిద్ధమైంది. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ) సమాచారం ప్రకారం- రేట్ల పెరుగుదల సుమారు 12 శాతందాకా ఉండనుంది. ద్రవ్యోల్బణం జోరందుకుని వస్తుసేవలు ఖరీదవుతున్న తరుణంలో వినియోగదారులకిది కచ్చితంగా అదనపు బరువే. 2004-05తో పోలిస్తే తరవాతి పదిహేనేళ్లలో వైద్యఖర్చుల్లో దేశ ప్రజానీకం సొంతంగా భరిస్తున్న మొత్తం 70శాతం నుంచి 40 శాతానికి తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు నిరుడు వెల్లడించాయి. అవన్నీ వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయనే అనుకున్నా- ప్రపంచ సగటు 18శాతంతో పోలిస్తే భారతీయులు తమ జేబునుంచి చెల్లిస్తున్నది ఇప్పటికీ అధికమే. అమానవీయ కార్పొరేట్‌ వైద్యం పుణ్యమా అని- కుటుంబంలో ఎవరైనా అస్వస్థులైతే ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక మందుల ఖర్చులు భరించలేక ఏటా ఆరుకోట్ల మందిదాకా దుర్భర పేదరికంలోకి జారిపోతున్న దేశం మనది. ఇటువంటిచోట వందల సంఖ్యలో అత్యవసర ఔషధాలకు ధరల రెక్కలు మొలుచుకొస్తే అసంఖ్యాక కుటుంబాలపై ప్రసరించే దుష్ప్రభావాల తీవ్రత అంచనాలకందదు. అటు మందుల నాణ్యతను, ఇటు ధరవరల కట్టడిని ప్రాథమ్యాంశాలుగా కేంద్రప్రభుత్వం పరిగణించి మానవీయ స్ఫూర్తికి ఎత్తుపీట వేయాలి. ధరల పెంపు నిర్ణయం విషయంలో పునరాలోచించాలి!

ఔషధ తయారీ రంగాన దిగ్గజ శక్తిగా భారత్‌ వెలుగులీనుతున్నా మందుల చుట్టూ చీకటి కోణాలు నివ్వెరపరుస్తున్నాయి. ఇండియాలో నకిలీ మందుల వ్యాపారం అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరంగా ఎదిగిందని ఎనిమిదేళ్లనాడే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచాలకులుగా అనిల్‌ సిన్హా దిగ్భ్రాంతికర దృశ్యాల్ని ఆవిష్కరించారు. ఆమధ్య గాంబియాలో పిల్లల మరణాలకు భారత్‌నుంచి వచ్చిన దగ్గుమందులే కారణమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం గగ్గోలు పుట్టించింది. డైఇథలీన్‌ గ్లైకాల్‌, ఇథలీన్‌ గ్లైకాల్‌తో కలుషితమైన ఔషధాలు గాంబియా చేరినట్లు అమెరికా వ్యాధుల నియంత్రణ నివారణ కేంద్రం (సీడీసీ) ఇటీవలే ధ్రువీకరించింది. హైదరాబాదుకు చెందిన ఓ ప్రయోగశాలలో తయారైన క్యాన్సర్‌ ఔషధం కలుషితమైనదంటూ లెబనాన్‌, యెమెన్‌ ఆరోగ్యాధికారులు తాజాగా చేసిన ఆరోపణ- కొన్ని సంస్థలు నాణ్యతా ప్రమాణాలకు నీళ్లొదులుతున్నాయన్న వాదనలకు వత్తాసు పలుకుతోంది. యూపీలో ఉత్పత్తయిన ఎసిడిటీ మందుల్లో పిండి తప్ప ఔషధ గుణాలేమీ లేవని వరంగల్‌ తనిఖీల్లో బట్టబయలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఉత్తరాఖండ్‌ వంటిచోట్ల లోపభూయిష్ఠ ఔషధ నియంత్రణ వ్యవస్థ కారణంగా నాసిరకం మందుల ప్రవాహం జోరెత్తుతోందన్న విశ్లేషణలు- పూడ్చాల్సిన కంతలేమిటో విశదీకరిస్తున్నాయి. దేశాన్ని తీవ్ర అప్రతిష్ఠ పాల్జేసే అకృత్యాలకు పాల్పడే సంస్థలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. నాసిరకం ఔషధాల వినియోగంతో మనుషుల ప్రాణాలు పోవడానికి కారకులైనవాళ్లకు గరిష్ఠశిక్ష విధించేలా శాసన నిబంధనావళిని పరిపుష్టీకరించాలి! తమిళనాట ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే రోగులకు 100శాతం మందుల్ని ఉచితంగా అందిస్తున్నారు. దిల్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారు దిద్దిన ఒరవడిని అనుసరిస్తూ, పంజాబులో నాణ్యమైన ఉచిత వైద్యసేవల కోసం 500 మొహల్లా క్లినిక్కులు ప్రారంభమయ్యాయి. జాతి నిర్మాణంలో కీలకమైన విద్య, వైద్యం ప్రభుత్వరంగంలోనే ఉండాలి. ఆరోగ్య సంరక్షణకోసం ఆస్తులమ్ముకుని అప్పుల ఊబిలో కూరుకుపోయే దురవస్థ ఎవరికీ దాపురించకుండా విధాన సంస్కరణలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గట్టిపూనిక వహిస్తేనే కోట్లాది నిరుపేద కుటుంబాలు తెరిపిన పడతాయి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి