కన్నడనాట గెలిచేదెవరు?

‘కమలం వికసిస్తుంది... కర్ణాటక గెలుస్తుంది’ అంటూ అక్కడ తమ పునర్విజయంపై భాజపా శ్రేణులు అంతులేని ధీమా వ్యక్తంచేస్తున్నాయి.   ‘వాళ్లవన్నీ పగటికలలే... అధికారంలోకి వచ్చేది మేమే’నని కాంగ్రెస్‌ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి.

Published : 30 Mar 2023 00:41 IST

‘కమలం వికసిస్తుంది... కర్ణాటక గెలుస్తుంది’ అంటూ అక్కడ తమ పునర్విజయంపై భాజపా శ్రేణులు అంతులేని ధీమా వ్యక్తంచేస్తున్నాయి.   ‘వాళ్లవన్నీ పగటికలలే... అధికారంలోకి వచ్చేది మేమే’నని కాంగ్రెస్‌ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. ఉభయపక్షాల పోటాపోటీ ప్రచారంతో కర్ణాటక వీధులు ఇప్పటికే హోరెత్తిపోతున్నాయి. ఎన్నికల వేడి ఏనాడో రాజుకొన్న ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పండగకు నిర్వాచన్‌ సదన్‌ తాజాగా ముహూర్తం నిర్ణయించింది. మొత్తం 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో మే పదోతేదీన ఎన్నికలు నిర్వహించి, పదమూడున ఫలితాలను వెల్లడించనున్నట్లు అది ప్రకటించింది. 5.21 కోట్ల మంది ఓటర్లు కలిగిన కర్ణాటకలో ఎనభై ఏళ్లకు పైబడినవారు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసే సదుపాయాన్ని తొలిసారి కల్పించడం హర్షణీయం. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా సక్రమంగా పూర్తిచేస్తామని ఈసీ యథాప్రకారం ప్రతిజ్ఞ చేసినా- నేతల ప్రలోభాల జాతరకు అదెంత వరకు అడ్డుకట్ట వేయగలదన్నదే ప్రశ్నార్థకం! అందుకు తార్కాణంగా కర్ణాటక కాంగ్రెస్‌ దళపతి డి.కె.శివకుమార్‌ మొన్న మంగళవారం రోడ్‌షోలో జనంపై అయిదు వందల నోట్లను వెదజల్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. ‘ఒక్కొక్కరికీ ఆరువేల రూపాయలిస్తా... అందరూ నాకే ఓటు వేయా’లంటూ మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే రమేశ్‌ జార్ఖిహొళి ఇటీవల ఓ బహిరంగ సభలో ఓటర్లకు ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఓట్ల కొనుగోలుస్వామ్యంగా మారిన భారత ప్రజాస్వామ్య దుస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలపై ఉప్పందించాలని ప్రజలకు పిలుపిస్తున్న నిర్వాచన్‌ సదన్‌- ప్రతి ఫిర్యాదుపైనా వంద నిమిషాల్లోనే తప్పక ప్రతిస్పందిస్తామంటోంది. భారత జీడీపీలో 8.7శాతాన్ని సమకూరుస్తున్న అతికీలక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన తన విధులను ఈసీ ఎంతమేరకు సమర్థంగా నిర్వర్తిస్తుందో చూడాలి!

కన్నడనాట 1985 ఎన్నికల్లో కమలదళం సాధించిన శాసనసభా స్థానాలు... రెండంటే రెండు! అంచెలంచెలుగా తన ప్రజాబలాన్ని పెంచుకొన్న భాజపా 2008 ఎలెక్షన్లలో 110 సీట్లను ఒడిసిపట్టి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తరవాత అయిదేళ్లు కర్ణాటకను ఏలిన కమలదళం- స్వీయతప్పిదాలతో ఆ తరవాతి ఎన్నికల్లో పరాజయం పాలైంది. 2013లో సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుతీరితే- అయిదేళ్ల క్రితం ఎన్నికల్లో త్రిశంకుసభ ఏర్పడింది. మెజారిటీ మార్కుకు ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయిన భాజపాకు అధికారాన్ని దూరంచేసేందుకు కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) పెట్టుకొన్న పొత్తు ఆ తరవాత కొన్నాళ్లకే పెటాకులైంది. రాష్ట్రాధిపత్యం మళ్ళీ భాజపా చేతుల్లోకి వచ్చినా- ఆ క్రమంలో ప్రదర్శితమైన రాజకీయ నాటకాలు ప్రజాస్వామ్య ప్రతిష్ఠను పలుచన చేశాయి. యడియూరప్ప నాయకత్వంపై స్వపక్షీయులే కినుక వహించిన దరిమిలా ఏడాదిన్నర క్రితం ముఖ్యమంత్రి బాధ్యతలు బి.ఆర్‌.బొమ్మైకు దఖలుపడ్డాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి తదితరాలు వచ్చే ఎన్నికల్లో తమకు కలిసివస్తాయని కాంగ్రెస్‌ విశ్వసిస్తోంది. అభివృద్ధి పనులు, పథకాలే దన్నుగా మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోగలమని భాజపా భావిస్తోంది. వారిద్దరి పోరులో తన రొట్టె విరిగి నేతిలో పడాలని జేడీ(ఎస్‌) ఎప్పట్లాగానే తలపోస్తోంది. ముస్లిములకు ఓబీసీ కోటాలో ఉన్న నాలుగుశాతం రిజర్వేషన్లను తొలగించి- రాష్ట్రంలో బలమైన శక్తులైన లింగాయతులు, వక్కళిగలకు ఆ మేరకు అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు బొమ్మై ప్రభుత్వం ఇటీవల నిశ్చయించింది. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణకు సర్కారు పచ్చజెండా ఊపడంపై రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. భాజపా ఎన్ని‘కలల’పై అవి ఎటువంటి ప్రభావం చూపనున్నాయన్నది ఆసక్తికరం. మొన్న జనవరి నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ- కమలదళం గెలుపు దరికి చేరడం ఖాయమంటున్నారు. అధికారపక్షం ఆకాంక్ష నెరవేరుతుందా... విపక్షాల ఆశలు ఈడేరతాయా... కన్నడిగులు ఈసారైనా ఏ పార్టీకైనా సంపూర్ణ సంఖ్యాధిక్యతను కట్టబెడతారా... ఫలితాలు వెల్లడయ్యేదాకా ఉత్కంఠ తప్పదు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.