సైబర్ సీమలో బందిపోట్లు
నకిలీ యాప్ ద్వారా రాజస్థానీ రైతు పవన్‌కుమార్ సోనీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఇటీవల ఎనిమిది లక్షల రూపాయలకు పైగా దోచేశారు. సకాలంలో తేరుకుని సంబంధిత యంత్రాంగం వెంటపడిన బాధితుడు- కేటుగాళ్లు కొల్లగొట్టిన మొత్తంలో రూ.6.24 లక్షలను రాబట్టుకోగలిగారు.
నకిలీ యాప్ ద్వారా రాజస్థానీ రైతు పవన్‌కుమార్ సోనీ బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు ఇటీవల ఎనిమిది లక్షల రూపాయలకు పైగా దోచేశారు. సకాలంలో తేరుకుని సంబంధిత యంత్రాంగం వెంటపడిన బాధితుడు- కేటుగాళ్లు కొల్లగొట్టిన మొత్తంలో రూ.6.24 లక్షలను రాబట్టుకోగలిగారు. ఇటువంటి అరుదైన ఉదంతాలు మినహా సైబర్ చోరులు స్వాహాచేస్తున్న సామాన్యుల సొమ్ములో తిరిగి స్వాధీనమవుతోంది స్వల్పమే. ఆంధ్రప్రదేశ్‌లో 2019-2021 మధ్యకాలంలో డిజిటల్ దొంగలు రూ.11.47 కోట్లకు పైగా కొట్టేశారు. నిరుడు మార్చినాటికి ఆ సొమ్ములో వెనక్కి వచ్చినవి రెండు కోట్ల రూపాయలే! అంతర్జాల వేదికల్లో ఆర్థిక మోసాలపై రోజుకు మూడున్నర వేలకు పైగా ఫిర్యాదులు అందుతున్నట్లు జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త, విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ రాజేష్ పంత్ గత నెలలో వెల్లడించారు. ‘విచారణ రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది... ఆ శాతమెంతో చెప్పను, ఎందుకంటే అది అత్యల్పం’ అన్న ఆయన వ్యాఖ్యలు- సైబరాసురుల కట్టడిలో వ్యవస్థ వైఫల్యానికి అద్దంపడుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2019-2021 నడుమ దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై 1.47 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో 1968 కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి. తొమ్మిది రాష్ట్రాలకు చెందిన కనీసం 36 ప్రాంతాలు- మేవాత్, ఆజంగఢ్, అహ్మదాబాద్, సూరత్, ఆల్వార్, భరత్‌పుర్, చిత్తూరు వంటివి సైబర్ నేరగాళ్ల అడ్డాలుగా అవతరించాయి. వాళ్ల దోపిడిపర్వాలకు చెక్ పెట్టేందుకు ‘సమన్వయం- సమాచార మార్పిడి’ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర హోంశాఖామాత్యులు అమిత్ షా తాజాగా వ్యాఖ్యానించారు. ఎక్కడో ఉంటూ మరెక్కడో సొమ్మును అంతర్జాల బందిపోట్లు అవలీలగా కాజేస్తున్నారు. జనాన్ని క్షణాల్లో బురిడీ కొట్టిస్తున్నవాళ్లను కట్టడి చేయాలంటే- రాష్ట్రాల నడుమ అర్థవంతమైన సమన్వయం సాకారం కావాలి. దేశీయంగా సురక్షిత అంతర్జాలంకోసం సైబర్ భద్రతపై పెట్టుబడులూ పెరగాలి.
‘మెకెన్సె’ గత నివేదిక ప్రకారం, పదిహేడు పెద్దదేశాల్లో ఇండొనేసియా తరవాత అత్యంత వేగంగా డిజిటలీకరణ చెందుతున్న విపణి ఇండియాదే. మూడు లక్షల కోట్ల డాలర్ల విలువైన భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్- 2026 నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతుందని ఇటీవలే ఒక అధ్యయనం లెక్కగట్టింది. స్థానికంగా సామాజిక మాధ్యమాల జోరూ పోనుపోను ఇంతలంతలవుతోంది. చైనీయులు, అమెరికన్ల కంటే భారతీయులే వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నట్లు పలు పరిశీలనలు చాటుతున్నాయి. అంతర్జాల వినియోగదారుల సంఖ్య అధికమవుతున్న కొద్దీ దేశీయంగా సైబర్ నేరాలూ విపరీతమవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్ రంగప్రవేశంతో ఆ ముప్పు మరింతగా పెచ్చరిల్లనుందని మొన్న జనవరిలో రాష్ట్రాల డీజీపీలూ ఐజీపీల సమావేశంలో చర్చకు వచ్చిన ఓ నివేదిక హెచ్చరించింది. ఇప్పటికే 75శాతానికి పైగా భారతీయ సంస్థలు ర్యాన్సమ్‌వేర్ల దాడులకు గురైనట్లు అంచనా. తరచూ సంభవిస్తున్న అటువంటి సైబర్ దాష్టీకాల్లో ప్రతి సందర్భంలో సగటున రూ.35 కోట్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. కీలక రంగాల్లోని సంస్థలు, వినియోగదారుల సున్నిత సమాచారాన్ని సైబరాసురులు అతిసులువుగా చేజిక్కించుకుని, యథేచ్ఛగా అమ్ముకొంటున్నారు. అక్రమ కాల్‌సెంటర్ల నిర్వాహకులు, అంతర్జాల మోసగాళ్లు అంతర్జాతీయంగాను పలు నేరాలకు పాల్పడుతున్నారు. దేశం పరువును వాళ్లు నిలువునా మంట కలుపుతున్నారు. సమగ్ర జాతీయ సైబర్ భద్రతా వ్యూహాన్ని అనుసరిస్తూ, అంతర్జాల ముసుగు దొంగల పనిపట్టడానికి శక్తిమంతమైన సాంకేతిక సేనను సిద్ధం చేసుకోవాలి. ఆ మేరకు సర్కారీ కార్యాచరణలో జరుగుతున్న జాప్యం- ఆర్థికంగానే కాదు; భద్రతాపరంగానూ దేశాన్ని తీవ్ర ప్రమాదంలో పడదోస్తోంది!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
General News
Polavaram: పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించాలని కుట్ర జరుగుతోంది: చలసాని
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించేందుకు.. అన్ని పార్టీలు ఏకమై..!
-
Movies News
Social Look: అనూ అవకాయ్.. సారా స్టెప్పులు.. బీచ్‌లో రకుల్
-
India News
Odisha Train Tragedy: ‘కవచ్ ఉన్నా కాపాడేది కాదు’ : వందేభారత్ రూపకర్త
-
General News
CBI: ఆ రోజు అర్ధరాత్రి ఎవరెవరితో మాట్లాడారు.. 7గంటలపాటు అవినాష్ సీబీఐ విచారణ