అలసత్వమే మహాముప్పు

అణగారిపోయిందనుకున్న కొవిడ్‌ మహమ్మారి తిరిగి కోరసాచి విజృంభిస్తున్న వేళ- దేశంలో కొత్త కేసుల నమోదు క్రమేపీ జోరెత్తుతోంది. డెల్టా, ఒమిక్రాన్‌, దాని ఉపరకాలైన బీఏ1, బీఏ2, ఎక్స్‌ఈ... తదితరాల రూపేణా ఎప్పటికప్పుడు అవతారాలు మారుస్తున్న రాకాసి వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది.

Published : 01 Apr 2023 01:17 IST

అణగారిపోయిందనుకున్న కొవిడ్‌ మహమ్మారి తిరిగి కోరసాచి విజృంభిస్తున్న వేళ- దేశంలో కొత్త కేసుల నమోదు క్రమేపీ జోరెత్తుతోంది. డెల్టా, ఒమిక్రాన్‌, దాని ఉపరకాలైన బీఏ1, బీఏ2, ఎక్స్‌ఈ... తదితరాల రూపేణా ఎప్పటికప్పుడు అవతారాలు మారుస్తున్న రాకాసి వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో తాజాగా కొవిడ్‌ కేసులు ఆరునెలల గరిష్ఠానికి చేరడం, వరసగా రెండో రోజూ 24 గంటల వ్యవధిలో మూడు వేలకుపైగా కొత్తకేసులు వెలుగుచూడటం- ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు వంటిచోట్ల కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతుండగా- కేరళ, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణాల్లో ఉద్ధృతి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు మునుపటి స్థాయిలో లేనప్పటికీ- ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశాల అనుసారం కొవిడ్‌ పరీక్షల నిర్వహణ కొనసాగాల్సిందేనని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గతవారం రాష్ట్రాలను హెచ్చరించింది. అంతకు మూన్నాళ్ల ముందు సాకల్య సమీక్ష చేపట్టిన ప్రధాని మోదీ- ఇటీవలి కాలంలో ఇన్‌ఫ్లుయెంజా, కొవిడ్‌ కేసుల ఉరవడి దృష్ట్యా కరోనా పరీక్షల్ని పెంచాలని ల్యాబ్‌ సౌకర్యాలను విస్తరించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కొవిడ్‌ కేసులు 15వేలకు పైబడ్డాయి. 18 రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం అంతకుమించి ఉందని, 72 జిల్లాల్లో అది 5-10శాతం మధ్యన ఉందని గణాంక విశ్లేషణ చాటుతోంది. కేంద్రం హెచ్చరిస్తున్నట్లు, ఈ దశలో అలసత్వం పెనుముప్పు తెచ్చిపెడుతుంది. వారం రోజుల వ్యవధిలోనే కొవిడ్‌ మహమ్మారి 17 నిండుప్రాణాలను కబళించింది. బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్ద ప్రాంతాల్లో మాస్కుల ధారణ లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అందరూ గుర్తెరగాలి. మనకేమవుతుంది లెమ్మన్న దిలాసా ప్రాణాంతకమని నిరూపించిన గతానుభవాలను స్ఫురణకు తెచ్చుకుని మెలగడం అత్యంత కీలకమైన ఆత్మరక్షణ సూత్రం!

మానవాళికి గడ్డుసవాలు విసిరి, శతాబ్ది సంక్షోభానికి తెరతీసి, ప్రపంచ దేశాల్ని పట్టి కుదిపేసిన మాయదారి కొవిడ్‌ నేటికీ సమసిపోలేదని యూకే స్వచ్ఛంద సంస్థ ‘సెపీ’ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ రిచర్డ్‌ హాచెట్‌ చెప్పింది అక్షరసత్యం. ఆ యథార్థాన్ని విస్మరించి, లోగడ కరోనా కొంత ఉపశమించగానే కనీస జాగ్రత్తల్నీ గాలికొదిలేసిన అమెరికా ఐరోపాలు ఒక్కుదుటున వైరస్‌ మళ్ళీ పెచ్చరిల్లేసరికి నిలువునా వణికిపోయాయి. అప్పట్లో విశ్వవ్యాప్త కొవిడ్‌ కేసులలో 22శాతానికి, మరణాల్లో 23శాతానికి కేంద్రంగా మారిన ఐరోపా శోకసంద్రమైంది. ఇటీవల బీఏ2 రకం వైరస్‌ హఠాత్తుగా విజృంభించినప్పుడు చైనాలోని షాంఘై మహానగరంలో రోదనలు, ఆకలికేకలు మిన్నంటాయి. దేశంలో నేడంతటి విపత్కర పరిస్థితి లేనప్పటికీ పౌరసమాజం, ప్రజాప్రభుత్వాలు ఏ దశలోనూ అజాగ్రత్తగా ఉదాసీనంగా వ్యవహరించకూడదు. కొత్తకేసులు పెరుగుతున్న దృష్ట్యా యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు- ముందు వరస యోధుల్ని, ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్ని యుద్ధసన్నద్ధం చేస్తోంది. దిల్లీలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం వైద్యాలయాల ప్రాంగణాల్లో మాస్కుల ధారణను తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతుల పరికల్పన నేటి ప్రాణావసరం. గతంలో కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొని రాటుతేలిన వైద్యరంగం, ప్రభుత్వ యంత్రాంగాలు ఈసారి ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా సమర్థ కార్యాచరణతో నెగ్గుకురావాలి. కొత్తగా కేసులు పెరగకుండా కాచుకోవడం ఒకెత్తు. ఇప్పటికే కర్కశ వైరస్‌ కాటుకు గురై దీర్ఘకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న ‘లాంగ్‌ కొవిడ్‌’ బాధితుల సంరక్షణ మరొకెత్తు. బూస్టర్‌ డోసుల విషయంలో పెద్దగా జనచైతన్యం రేకెత్తించలేకపోయిన కేంద్రం- స్వీయజాగ్రత్తలే శ్రీరామరక్ష అన్న స్పృహను పౌరుల్లో రగిలిస్తేనే, ఉరుముతున్న ముప్పు నుంచి జాతి తప్పించుకోగలుగుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.