ఆహాఁ ఏమి రుచి...

‘తిండి కలిగితె కండ గలదోయ్‌, కండ గలవాడేను మనిషోయ్‌’ అన్నారు ముత్యాలసరాల్లో గురజాడ మహాకవి. ‘పంచెకట్టుట యందు ప్రపంచాన మొనగాడు’ అని సినారె అభివర్ణించిన తెలుగువాడి అభిరుచుల్లో భోజన ప్రీతి ప్రధానమైనది. నోరు ససి చెడితే నిమ్మకాయ పచ్చడో, దబ్బకాయో నాలిక్కి రాసుకోవాలన్న ‘రస’వత్తరమైన ఆలోచన వస్తే తెలుగువాడికే రావాలి తప్ప- ఆంగ్లేయుడికి తోచే అవకాశమే లేదు.

Published : 02 Apr 2023 00:46 IST

‘తిండి కలిగితె కండ గలదోయ్‌, కండ గలవాడేను మనిషోయ్‌’ అన్నారు ముత్యాలసరాల్లో గురజాడ మహాకవి. ‘పంచెకట్టుట యందు ప్రపంచాన మొనగాడు’ అని సినారె అభివర్ణించిన తెలుగువాడి అభిరుచుల్లో భోజన ప్రీతి ప్రధానమైనది. నోరు ససి చెడితే నిమ్మకాయ పచ్చడో, దబ్బకాయో నాలిక్కి రాసుకోవాలన్న ‘రస’వత్తరమైన ఆలోచన వస్తే తెలుగువాడికే రావాలి తప్ప- ఆంగ్లేయుడికి తోచే అవకాశమే లేదు. కోడికూర తింటే వేడి చేస్తుందని తోడుగా జున్ను... ఉలవచారు తాపానికి విరుగుడుగా గడ్డపెరుగు మీది చిక్కటి మీగడను జోడించాలన్న తెలివితేటలు కచ్చితంగా తెలుగువాడివే. అంతెందుకు... తెల్లారేసరికల్లా పెరుగూ అన్నం కలిపిన(చద్దన్నం) ముద్దలకు ఊరిన మాగాయ టెంకను నంజుకుంటే... దాని దుంపతెగ- పిల్లలకు కడుపులో ఎంత స్థిమితంగా ఉండేది మరి! కాశీఖండంలో ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడ తేర, గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్‌ కుడువంగ...’ అంటూ శ్రీనాథుడు లొట్టలేసుకొంటూ చెప్పింది దాని గురించే కదా! ‘మాటిమాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచు...’ చల్దులారగించే గోపబాలకులను పోతనా వర్ణించాడు. బాలకృష్ణుడు మరి ‘బాలుండీతడు కొండదొడ్డది...’ అంటూ భయపడకండి- ‘ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నా కేలు(చేయి) అల్లాడదు’ అని హామీ ఇచ్చి ఆ చద్దన్నాలు తిన్న కండపుష్టితోనే- గోవర్ధన పర్వతాన్ని ధీమాగా ఎత్తి పట్టుకొన్నాడంటే కాదంటారా! ఇంగ్లిషు చదువులొచ్చాక, నాగరికత ముదిరి చద్దన్నాన్ని చవకబారు తిండిగా తీసిపారేసినప్పుడే- ఈ జాతి చేవ చచ్చిపోయింది. ‘అయ్యా! మీరు చల్దివణ్ణం తింఛారా?’ అని కన్యాశుల్కంలో బుచ్చెమ్మ సందేహించడానికి కారణం- గిరీశం ఇంగ్లిషు చదువులు వెలగబెట్టాడు కాబట్టే!

ఓ వయసొచ్చాక తెలుగువాడు మొగ్గు చూపేది- ఇడ్లీ వైపు. ‘ఇడ్డెనలు’ అనేది జనం నోట, కవుల ప్రయోగాల్లోనూ వినిపించే అచ్చతెనుగు పదం. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడి’ అంటారు. ఇడ్లీ ఇండొనేసియాలో పుట్టిందని గూగుల్‌ చెబుతోంది. కావచ్చు కాని- దానిపై లెక్కకు మించిన ప్రయోగాలు చేసి, రకరకాల రుచులతో దానికి తిరుగులేని ప్రాచుర్యాన్ని కలిగించింది మాత్రం దక్షిణాది ప్రజానీకమే. ఇడ్లీ పిండిని పనసాకుల మధ్య ఒబ్బిడిగా ఉడికించి- ‘పొట్టిక్క బుట్ట’ను రూపొందించిన మేధావి తెలుగువాడు. ఆషాఢమాసపు చివరి రోజుల్లో కడుపులో పేరుకొనే క్రిముల సంహారానికి పనసాకులతో పాటు ఆవిరిపై ఉడికే పొట్టిక్క బుట్ట దివ్యమైన ఔషధం! తెల్లగా వేడివేడిగా... చూస్తుంటేనే నోరూరించే ఇడ్లీలను గురించి బులుసుకవి ‘చినచిన్న చందమామలు నును మల్లెల మెత్తదనము నోటికి హితమౌ జనప్రియములు రుచికరములు’ అని వర్ణిస్తూనే ‘ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని ప్రశ్నించారు. ఇడ్లీకి సాంబారుకి మంచి స్నేహం. కాబట్టే ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ అన్నారు శ్రీశ్రీ. నిజమే! ఇడ్లీలంటే ‘సాంబారులో తేలియాడే చందమామలు’. వాటిమీద ఓ హైదరాబాదు వాసి ఎంత మోజుపడ్డాడంటే- ఈ ఏడాదిలో ఆరులక్షల రూపాయల విలువైన 8428 ప్లేట్ల ఇడ్లీలను తమ సంస్థ ద్వారా తెప్పించుకొన్నాడని ‘స్విగ్గీ’ ప్రకటించింది. మొన్న మార్చి 30న ‘ప్రపంచ ఇడ్లీ దినోత్సవం’ సందర్భంగా గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీలను ఇళ్లకు సరఫరా చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. కాచిన నెయ్యి కారప్పొడితోనో, కొబ్బరి చట్నీతోనో, అల్లం ముక్కను తురిమిన చింతామణి చట్నీతోనో ఇడ్డెనలు సుష్ఠుగా లాగించిన వారందరికీ ‘సొడ్డు సుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనిపించక మానదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.