పార్లమెంటు ప్రతిష్ఠ పెంపొందేలా...

తెల్లదొరల చీకటిపాలనలో చీలికలుపేలికలైన భారతీయులను ఏకం చేయడం- ప్రజాస్వామ్యంతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు.

Published : 28 May 2023 00:52 IST

తెల్లదొరల చీకటిపాలనలో చీలికలుపేలికలైన భారతీయులను ఏకం చేయడం- ప్రజాస్వామ్యంతోనే సాధ్యపడుతుందని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. సార్వత్రిక వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన ప్రజలకు చట్టసభల్లో ప్రత్యక్ష ప్రాతినిధ్యం కల్పించారు. భారతావని సామాజిక, రాజకీయ ఐక్యతకు ప్రతిరూపంగా పార్లమెంటుకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా దేశ ప్రగతి ప్రస్థానానికి దారిదీపాలుగా ఎగువ, దిగువసభలు ఏర్పాటయ్యాయి. ఇన్నేళ్లుగా వాటిని తనలో పొదివిపుచ్చుకొన్న పార్లమెంటు పాత భవనం- విశేష సందర్భాలెన్నింటికో వేదికైంది. మరెన్నో కీలక ఘటనలకు మౌనసాక్షిగా నిలిచింది. దాని స్థానే సకల హంగులతో రూపుదిద్దుకొన్న నూతన భవన సముదాయం నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమవుతున్న వేళ- ప్రజాకాంక్షలకు పట్టంకట్టడంలో పార్లమెంటు వైఫల్యానికి కారణమేమిటో రాజకీయపక్షాలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. స్వపక్ష విపక్ష భేదాలకు అతీతంగా విశాల భారత విస్తృత ప్రయోజనాల కోసం పరిశ్రమించాల్సిన నాయకులు- చట్టసభల్లో సిగపట్లకు దిగుతూ తాము సాధిస్తున్నదేమిటో తరచి చూసుకోవాలి. ‘నిరంకుశత్వం నుంచి ప్రభుత్వాన్ని దూరంగా ఉంచాలంటే తప్పనిసరిగా రెండు పార్టీలు ఉండాలి... అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా నడిపించేదే ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం అవుతుంది’ అనేవారు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. అంతటి రాజనీతిజ్ఞత కొరవడిన నేతాగణం పుణ్యమా అని ప్రజాసమస్యలపై చట్టసభల్లో చర్చలు శూన్యమవుతున్నాయి. మొక్కుబడి భేటీలూ అనవసర రాద్ధాంతాలతో ప్రజాస్వామ్య దేవాలయ గౌరవప్రతిష్ఠలు మంటకలుస్తున్నాయి! 

అన్నార్తుల కడుపులు నింపడం, తమ శక్తిసామర్థ్యాలకు దీటుగా ఎదిగేందుకు ప్రజలకు అన్ని అవకాశాలూ కల్పించడమే భారత రాజ్యాంగ లక్ష్యమని ప్రథమ ప్రధాని నెహ్రూ ఉద్ఘాటించారు. ఆ మేరకు సంవిధాన ప్రమాణాల ప్రకారమే పరిపాలన సాగుతోందా లేదా అని కనిపెట్టుకుని ఉండాల్సింది చట్టసభలే. ప్రజాహిత చట్టాలకు ప్రాణంపోయడం, ప్రభుత్వ ఉత్తర్వుల్లోని తప్పొప్పులను సమీక్షించడం- పార్లమెంటు సభ్యుల విధివిహిత కర్తవ్యం. అందులో ఎంపీలు ఎంతమేరకు సఫలీకృతులవుతున్నారంటే- కడుపు చించుకొంటే కాళ్లమీద పడిన చందమవుతుంది. అమెరికా, యూకే, కెనడా తదితర దేశాల్లో ప్రజాప్రతినిధులు ఏటా వంద రోజులకు పైగానే భేటీ అవుతుంటారు. కూలంకష చర్చలతో స్వదేశ ప్రగతికి తమవంతుగా పాటుపడుతుంటారు. 1952-1974 మధ్యలో భారత లోక్‌సభ సైతం సగటున ఏడాదికి 120 రోజుల పాటు సమావేశమైంది. ఆపై క్రమేణా తెగ్గోసుకుపోయిన భేటీల సంఖ్య- 2017 వచ్చేసరికి 61 రోజులకు పడిపోయింది. సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షాలకు తగిన ప్రాధాన్యమిచ్చే మేలిమి విధానాలు కాలక్రమంలో మాయమయ్యాయి. సభ్యుల పరిశీలనకు ఆస్కారమేమీ లేకుండానే బిల్లులు క్షణాల్లో సభామోదం పొందుతున్నాయి. ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పాదుకొల్పే ప్రశ్నోత్తరాల వంటివీ తూతూమంత్రమవుతున్నాయి. రాష్ట్రాల శాసనసభల పనితీరూ అలాగే దిగనాసిల్లిపోతోంది. ఆస్ట్రేలియాలో ప్రతిపక్షాన్ని ‘ప్రత్యామ్నాయ ప్రభుత్వం’గా గుర్తిస్తుంటే- ‘షాడో క్యాబినెట్‌’ పేరిట సర్కారీ తీరుతెన్నులను యూకే విపక్షం నిశితంగా గమనిస్తుంటుంది. స్థానికంగానేమో అసమ్మతిని సహించలేని అప్రజాస్వామిక ధోరణులు అధికారపక్షాల్లో బుసలు కొడుతున్నాయి. తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా ప్రవర్తించే పెడపోకడలు ప్రతిపక్షాల్లోనూ పెచ్చరిల్లుతున్నాయి. దాంతో చట్టసభల సమావేశాలు తరచూ అరుపులూ కేకలతో దద్దరిల్లుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనంలోనైనా అందుకు భిన్నమైన దృశ్యాలను చూడగలమా? ప్రజలకు మేలుచేకూర్చడంపై ఇకనైనా అక్కడ సానుకూల సంవాదాలు సాగుతాయా? అటువంటి నూతన రాజకీయ సంస్కృతికి పార్టీలు శ్రీకారం చుట్టకపోతే- పార్లమెంటు భవంతి మారినా భారతావని తలరాతలో మార్పేమీ ఉండబోదు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు