అన్నీ ఒకేచోట... సమీకృత మార్కెట్లు!

దేశం నలుమూలలా తరతమ భేదాలతో పట్టణీకరణ పోనుపోను జోరందుకుంటోంది. ఇంతలంతలవుతున్న జనాభాకు, పెరుగుతున్న వలసలకు అనుగుణంగా తీరైన అభివృద్ధి ప్రణాళికలు కొరవడి ఎన్నో పట్టణాలు సమస్యల పుట్టలుగా మారుతున్నాయి. వేగమే జీవనవేదమైన నేపథ్యంలో...

Updated : 30 May 2023 09:38 IST

దేశం నలుమూలలా తరతమ భేదాలతో పట్టణీకరణ పోనుపోను జోరందుకుంటోంది. ఇంతలంతలవుతున్న జనాభాకు, పెరుగుతున్న వలసలకు అనుగుణంగా తీరైన అభివృద్ధి ప్రణాళికలు కొరవడి ఎన్నో పట్టణాలు సమస్యల పుట్టలుగా మారుతున్నాయి. వేగమే జీవనవేదమైన నేపథ్యంలో, పావుగంట ప్రయాణకాలంలోనే అన్ని వసతులూ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్న పట్టణవాసుల సంఖ్య అధికమవుతోంది. తమవంతుగా దిద్దుబాటు చర్యల్లో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఆధునిక సమీకృత మార్కెట్లు అవతరింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభాముఖంగా మూడు నెలలక్రితం ప్రకటించారు. నిజాం జమానాలో ప్రారంభమై సికింద్రాబాద్‌లో నేటికీ కొనసాగుతున్న మోండా మార్కెట్‌లో సమస్త వస్తుసంబారాలు లభ్యమవుతాయని నాడాయన ప్రస్తావించారు. ఖమ్మం, నిజామాబాద్‌, నారాయణపేట, వరంగల్‌ వంటిచోట్లా అటువంటి సమీకృత మార్కెట్లు ఏర్పాటై విజయవంతంగా నడుస్తున్నాయి. అదే నమూనాలో రాష్ట్రమంతటా ప్రతి పురపాలిక పరిధిలోనూ మొత్తం 144 చోట్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఇప్పుడు సన్నద్ధత చాటుతోంది. అందులో 14 ఇప్పటికే అందుబాటులోకి రాగా, తక్కినవి వివిధ నిర్మాణ దశల్లో స్థల సేకరణలో ఉన్నాయంటున్నారు. వాటన్నింటికీ ఆదర్శప్రాయ నమూనాలుగా గజ్వేల్‌, సిద్దిపేట మార్కెట్లు రాణిస్తున్నాయి. ఏడాదిలోగా అన్ని పురపాలక సంఘాల్లో సిద్ధమవుతాయంటున్న సమీకృత మార్కెట్లు వాసి పరంగా, వసతులూ నిర్వహణపరంగా గజ్వేల్‌, సిద్దిపేట విపణులకు ఏమాత్రం తగ్గకుండా అధికార యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. అందులో అది కృతకృత్యమైతేనే- అపరిశుభ్ర పరిసరాల్లో, ఇరుకిరుకు మార్గాల్లో, రోడ్లపైనే సాగుతున్న ఆహార విక్రయాలకు తెరదించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది!

యావత్‌ కూరగాయల వ్యాపారం దళారుల కనుసన్నల్లో వాళ్ల ఇష్టారాజ్యంగా సాగుతున్న తరుణంలో మూడున్నర దశాబ్దాలక్రితం పంజాబ్‌ విశిష్ట ప్రయోగానికి నాంది పలికింది. పచ్చిదోపిడికి గురవుతున్న కూరగాయలు, పళ్ల రైతులకు ప్రయోజనదాయకమయ్యేలా అప్నామండీలకు అక్కడ శ్రీకారం చుట్టింది. ఆ పథకమే స్ఫూర్తిగా తెలుగుగడ్డపై రైతుబజార్లు పుట్టుకొచ్చాయి. అనంతర కాలంలో వాటి రూపరేఖలు చెదిరిపోయాయి. రైతుల ముసుగులో దళారులు, వ్యాపారులు చొరబడి నిర్దేశించిన ధరలకన్నా అధిక మొత్తాలను వినియోగదారులనుంచి గుంజుతున్నారన్న ఆరోపణలకు కొదవలేదు. రకరకాల కారణాలతో ఎన్నోచోట్ల కూరగాయల అంగళ్లు రోడ్లపైకి చేరాయి. నేలపైనే కుప్పలు పోసి విక్రయిస్తున్న ఉదంతాలు అనేకం. గల్లీల్లోనే చేపలు, మాంసం అమ్మకాలు చేపట్టడం- ట్రాఫిక్‌, పారిశుద్ధ్య సమస్యల్ని తీవ్రతరం చేస్తోంది. ఎక్కడపడితే అక్కడ నడిరోడ్లపైనే శాకాహార, మాంసాహార విక్రయాలు ప్రజారోగ్యానికీ తూట్లు పొడుస్తున్నాయి. ఇరుకిరుకు మార్గాల్లో ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని ఛేదించుకుంటూ నాలుగైదు చోట్లకు తిరిగి నానా అవస్థలూ పడే బదులు- ఒకే ప్రాంగణంలో క్రమ పద్ధతిలో నెలకొల్పిన వివిధ దుకాణాల్లో ప్రశాంతంగా విక్రయాలు చేపట్టడమన్నది, వినియోగదారులెవరికైనా గొప్ప వెసులుబాటు. ఆ స్వప్నాన్ని సాకారం చేసే క్రమంలో ఇప్పటివరకు ఎదురైన సమస్యలు, ఇబ్బందులు తక్కినచోట్ల పునరావృతం కాకుండా- తెలంగాణ పురపాలక మంత్రిత్వశాఖ చాకచక్యంగా కాచుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఊరికి దూరంగా శివార్లలో మార్కెట్ల ఏర్పాటు కారణంగా వ్యాపారులు అనాసక్తి కనబరుస్తున్నట్లు క్షేత్రస్థాయి కథనాలు చాటుతున్నాయి. కొన్నిచోట్ల తగినన్ని నిధులున్నా నిర్మాణాలు నత్తనడకన సాగుతున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ బాలారిష్టాలను చురుగ్గా అధిగమించి పురపాలక సంఘాలన్నింటా సమీకృత మార్కెట్ల వ్యవస్థ రూపుదాలిస్తే- తక్కిన రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి