మాతృత్వంతో వ్యాపారమా?
ఏ తల్లికైనా కాన్పు అన్నది అక్షరాలా పునర్జన్మే. అమ్మ జీవితంలోని అత్యంత కీలక ఘట్టమే కేంద్రబిందువుగా అమానవీయ వ్యాపార ధోరణులు ముమ్మరించడం, ఆలోచనాపరులెవరికైనా దుర్భరమే.
ఏ తల్లికైనా కాన్పు అన్నది అక్షరాలా పునర్జన్మే. అమ్మ జీవితంలోని అత్యంత కీలక ఘట్టమే కేంద్రబిందువుగా అమానవీయ వ్యాపార ధోరణులు ముమ్మరించడం, ఆలోచనాపరులెవరికైనా దుర్భరమే. దేశంలో ఒకప్పుడు పురుడు పోసుకోవడం అంటే అర్థం- సాధారణ సుఖప్రసవం. శస్త్ర చికిత్స మాట అరుదుగానే వినిపించేది. తల్లికి లేదా శిశువుకు ప్రాణాపాయ పరిస్థితి తలెత్తితేనే, సిజేరియన్ చేసేవారు. సాధారణ ప్రసవం జరిగితే మహిళ ఆరోగ్యానికి ఢోకా ఉండదని, రోజుల వ్యవధిలోనే అన్నిపనులూ చేసుకోగల స్థితికి చేరుకుంటారన్నది వైద్యనిపుణుల సిఫార్సు. వాస్తవంలో, దేశం నలుమూలలా తరతమ భేదాలతో ప్రసవ కోతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్దేశాల ప్రకారం, మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10-15 శాతానికి మించకూడదు. కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గణాంక విభాగం నివేదికాంశాల ప్రకారం, ప్రసవాల్లో సిజేరియన్ శస్త్ర చికిత్సల జాతీయ సగటు 23.29 శాతం. ఆ సగటు కన్నా అధికంగా దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రసవ కోతలు జోరుగా సాగుతున్నాయి. ఆ జాబితాలో తెలంగాణ (54.09శాతం), ఏపీ(42.15) సైతం ఉన్నాయి. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లో కడుపుకోతలనే లెక్కకడితే జాతీయ సగటు(37.95)ను మించిపోయి సి-సెక్షన్ శస్త్రచికిత్సలు సాగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 25గా నమోదైంది. ఒడిశాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు 74 శాతానికి పైబడటంతో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ఆడిటింగ్ నిర్వహిస్తోంది. ఆ శ్రేణిలో 61శాతానికి మించినట్లు వెల్లడయ్యాక ప్రైవేటు రంగాన సిజేరియన్ల నియంత్రణపై తనవంతుగా తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. అంతకుముందే సి-సెక్షన్ ప్రసవాల్ని కట్టడి చేయాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు కేంద్రం జారీ చేసిన హెచ్చరిక ప్రభావశూన్యమైంది. ఒడిశా, తెలంగాణ తరహాలో తక్కిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వేగిరం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ప్రాధాన్య అంశమిది!
ప్రసవ సమయంలో నొప్పుల్ని తట్టుకోలేరని నెలలు నిండిన మహిళల కుటుంబ సభ్యులను వైద్యసిబ్బందే భయాందోళనలకు గురిచేసి సిజేరియన్లకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు చిరకాలంగా వినిపిస్తున్నాయి. సాధారణ ప్రసవం కన్నా శస్త్ర చికిత్సలకైతే అధికంగా ఫీజులు దండుకోగల అవకాశం, ఆపరేషన్ అయ్యాక ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి రావడంవల్ల అదనపు బిల్లులు వడ్డించగల వీలు- ప్రైవేటు వైద్యుల్ని ప్రసవ కోతలకు ప్రేరేపిస్తున్నాయన్న విశ్లేషణలు తేలిగ్గా కొట్టిపారేయలేనివి. ఫలానా రోజున ఏ సమయానికి బిడ్డ తొలిసారి కేర్‌మనాలో ముహూర్తం పెట్టించుకుంటున్న కొంతమంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వేలంవెర్రి- సిజేరియన్ల విజృంభణకు మరో ముఖ్యకారణమవుతోంది. దురదృష్టం ఏమిటంటే, కాసుల యావ మాటున అనవసర సిజేరియన్ల తాలూకు దుష్ప్రభావాలు మరుగున పడిపోతున్నాయి. వైద్యపరంగా అత్యవసరం కాకపోయినా సిజేరియన్ చేయడమన్నది తల్లికి ప్రమాదకరం. శస్త్రచికిత్స సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఇతర అవయవాలు దెబ్బతినే ముప్పు పొంచి ఉంటుంది. మత్తువల్ల ఊపిరితిత్తులపై ప్రభావం, దీర్ఘకాలంలో ఇన్ఫెక్షన్లు తప్పకపోవచ్చుననీ వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సిజేరియన్ ప్రసవాల్లో జన్మించే శిశువులు అలర్జీలకు, ఇతరత్రా వైద్యపరమైన సమస్యలకు గురయ్యే అవకాశాలు అధికమంటున్న అధ్యయనాలు- తల్లీబిడ్డల ఆరోగ్యానికి తూట్లు పడకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టాలని ఉద్బోధిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు పెరిగేలా మౌలిక వసతుల పరిపుష్టీకరణ, జనచేతన కార్యక్రమాల నిర్వహణ చురుకందుకోవాలి. అనవసరంగా సిజేరియన్లు చేపట్టారని నిగ్గుతేలిన పక్షంలో ఆయా వైద్యులు, ఆస్పత్రులపై కఠినచర్యలు అమలుపరచేలా పకడ్బందీ నిబంధనావళిని కేంద్రం, రాష్ట్రాలు సత్వరం క్రోడీకరించాలి. మాతృత్వంతో అడ్డగోలు వ్యాపారం చేస్తున్న దారుణ అరాచకానికి తెరదించాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
-
Hyundai i20 N Line: హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్.. ధర, ఫీచర్ల వివరాలివే!
-
Tecno Phantom V Flip 5G: టెక్నో నుంచి రూ.50 వేల ఫ్లిప్ ఫోన్.. ఫీచర్లివే..!
-
Parineeti- Raghav Chadha: పరిణీతి- రాఘవ్ చద్దా పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్
-
ICC U19 World Cup 2024: అండర్ -19 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది
-
Priyamani: ‘జవాన్ 2’లో విజయ్!.. ప్రియమణి ఏమన్నారంటే?