పొగాకు కోరల్లో దేశం

జాతీయ పొగాకు నివారణ కార్యక్రమం(ఎన్‌టీసీపీ) ఆరంభమై ఇప్పటికి పదిహేనేళ్లవుతోంది. పొగాకు ఉత్పత్తుల తయారీ, సరఫరాలను కట్టడిచేసేందుకు ఉద్దేశించిన ఎన్‌టీసీపీ ఇన్నేళ్లుగా సాధించిందేమిటి? సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా వంటివి విపణిలోకి వెల్లువెత్తుతున్నాయి.

Published : 01 Jun 2023 01:27 IST

జాతీయ పొగాకు నివారణ కార్యక్రమం(ఎన్‌టీసీపీ) ఆరంభమై ఇప్పటికి పదిహేనేళ్లవుతోంది. పొగాకు ఉత్పత్తుల తయారీ, సరఫరాలను కట్టడిచేసేందుకు ఉద్దేశించిన ఎన్‌టీసీపీ ఇన్నేళ్లుగా సాధించిందేమిటి? సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కా వంటివి విపణిలోకి వెల్లువెత్తుతున్నాయి. ధూమపానం ఆరోగ్యానికి హానికరం వంటి సర్వసాధారణ ప్రకటనలు- పొగాకు ఉత్పత్తుల వినియోగ ఉద్ధృతిని అరికట్టలేకపోతున్నాయి. పదేళ్ల వయసులోనే వాటికి వ్యసనపరులుగా మారుతున్న పిల్లల సంఖ్య దేశంలో గణనీయంగా ఉండటం తీవ్రంగా కలవరపరచేదే. పొగతాగని వారితో పోలిస్తే- ధూమపాన ప్రియుల సగటు ఆయుర్దాయం దాదాపు దశాబ్ద కాలం తక్కువన్నది వివిధ అధ్యయనాల సారాంశం. ఖైనీ, జర్దా, గుట్కా తదితరాలకు అలవాటు పడుతున్నవారు  అంతిమంగా నోటి క్యాన్సర్‌ కోరల్లో చిక్కి శల్యమవుతున్నారు. కేవలం పొగాకు కారణంగానే దేశవ్యాప్తంగా రోజుకు సగటున 3699 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలను విషాదసంద్రంలో ముంచేస్తున్న ఆ మహమ్మారి గురించి ఇకపై ఓటీటీ వేదికల్లోనూ హెచ్చరికల ప్రసారానికి కేంద్రం తాజాగా నిశ్చయించింది. ఆ మేరకు సవరించిన నిబంధనలను మొన్న బుధవారం నోటిఫై చేసింది. ప్రజారోగ్య భద్రతకు పెనుప్రమాదకరమైన జాడ్యాన్ని సమూలంగా తుడిచిపెట్టాలంటే- వ్యవస్థాగతంగా జరగాల్సింది ఇంకెంతో ఉంది. వాణిజ్యపంటగా ఒకవైపు పొగాకు విపరీత ప్రాధాన్యం పొందుతున్నప్పుడు- దేశీయంగా వినియోగంలోంచి దాన్ని పూర్తిగా తొలగించడం ఎలా సాధ్యపడుతుంది? ‘ఆహారాన్ని పండించండి, పొగాకును కాదు’ అన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హితోక్తిని ప్రభుత్వాలు చెవికెక్కించుకోవాలి!

విషతుల్యమైన పొగాకు సాగులో చైనాది అగ్రస్థానమైతే- జాబితాలో దాని వెన్నంటి ఇండియా నిలుస్తోంది. దేశీయంగా దాదాపు 11లక్షల ఎకరాల్లో పొగాకు విరగపండుతోంది. 2021-22లో అది రూ.6,529.30 కోట్ల విలువైన విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టినట్లు పొగాకు బోర్డు ఘనంగా సెలవిస్తోంది. దేశీయంగా సిగరెట్లు, గుట్కాల వంటి వాటికి బానిసలై ఆసుపత్రి పాలవుతున్నవారివల్ల ఏడాదికి ఆరువేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారంతో బాధిత కుటుంబాలు చితికిపోతున్నాయి. పొగాకు మూలంగా సంభవిస్తున్న అర్ధాంతర మరణాలవల్ల ఏటా రూ.1.32 లక్షల కోట్ల వరకు దేశం కోల్పోతున్నట్లు అంచనా. పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపుతోనే సామాన్యులను ఆయా వ్యసనాలకు దూరం చేయవచ్చునని ప్రభుత్వాలు తలపోస్తున్నాయి. రోగ నివారణకు అటువంటి పైపై చికిత్సలు ఎంతమాత్రమూ సరిపోవు. దేశవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్ల మందికి పొగాకే జీవనాధారమని సర్కారీ నివేదికలు చాటుతున్నాయి. ఆరోగ్య భారతావని నిర్మాణం సాకారం కావాలంటే- వారందరినీ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లోకి మళ్ళించాలి. ముఖ్యంగా పొగాకు రైతులను ఇతర పంటల సాగు దిశగా ప్రోత్సహించాలి. ప్రాణాంతక వ్యసనాల గుప్పిట్లో చిన్నారులూ చిక్కువడేలా చేసి, తమ విషవ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పొగాకు ఉత్పత్తుల తయారీదారులు తెగబడుతున్నారు. చట్టాల్లోని లోపాలే దన్నుగా సర్కారీ నిషేధాజ్ఞల నుంచి వాళ్లు తప్పించుకుంటున్నారు. నెత్తుటికూడుకు అర్రులుచాస్తున్న అటువంటివాళ్ల ఆటకట్టించేలా శాసనాలను సంస్కరించాలి. పొగాకు ఉత్పత్తులను అక్రమంగా తరలించేవారు, విక్రయించేవారిపైనా ఉక్కుపాదం మోపాలి. ఆ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకోన్ముఖ లక్ష్యంతో పరిశ్రమిస్తేనే- పొగాకు పీడిత భారతావని ఆరోగ్యం కుదుటపడుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.