ప్రగతి పథంలో తెలంగాణ

భారత చిత్రపటంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆవిర్భవించిన కోటి రతనాల వీణ నేడు పదో ఏట అడుగిడుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో ఎన్నో సంక్షోభాల కుంపట్లు రాజుకుంటాయన్న రాజకీయ జోస్యాలెన్నో చెల్లాచెదురైపోయాయి.

Published : 02 Jun 2023 01:16 IST

భారత చిత్రపటంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆవిర్భవించిన కోటి రతనాల వీణ నేడు పదో ఏట అడుగిడుతోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో ఎన్నో సంక్షోభాల కుంపట్లు రాజుకుంటాయన్న రాజకీయ జోస్యాలెన్నో చెల్లాచెదురైపోయాయి. పసికూనలాంటి రాష్ట్రాన్ని కడు జాగ్రత్తగా సాకే బాధ్యతను భుజాన మోసిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిత్వంలో, తెలంగాణ ప్రగతిరథం సవ్యపథంలో పరుగులు తీస్తోంది. ప్రజల దృక్పథంతో ప్రజాప్రయోజనాలే పరమావధిగా సాగే భవిష్యత్‌ అభివృద్ధి క్రమాన్నే తెలంగాణ పునర్నిర్మాణంగా తొలినాళ్లలోనే సూత్రీకరించిన కేసీఆర్‌ విజన్‌- బీడువారిన నేలల్లో ఆశల విత్తులు జల్లింది. అవిప్పుడు మొలకెత్తి తీగసాగి ఆకుపచ్చటి తెలంగానాన్ని ఆలపిస్తున్న తరుణం, మహా పర్వదిన సంరంభాన్ని తలపిస్తోంది! ఒకప్పుడు ఇక్కడ 70 శాతానికిపైగా సాగుకు భూగర్భ జలాలే దిక్కయ్యేవి. పట్టుమని నాలుగేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదల తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చేసింది. 2018-19 నాటితో పోలిస్తే ప్రస్తుతం యాసంగి (రబీ) సాగు విస్తీర్ణం ఆరురెట్లకుపైగా పెరిగింది. అదే నిష్పత్తిలో ధాన్యం దిగుబడీ విస్తరించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు ఏటేటా పెరుగుతూ 2014-15తో పోలిస్తే రెట్టింపయ్యాయి. ఆహారధాన్యాల ఉత్పత్తిలో పంజాబ్‌, హరియాణాల తరవాత మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకింది. పచ్చదనం, పరిశుభ్రతతోపాటు వివిధ అభివృద్ధి ఇతివృత్తాల్లో తెలంగాణ పంచాయతీలకు దక్కిన కేంద్ర పురస్కారాల పంట- గ్రామీణాభివృద్ధిని సోదాహరణంగా చాటేదే. దేశ తలసరి ఆదాయం లక్షా 72వేల రూపాయలుగా నమోదైతే- తెలంగాణలో అది రూ.3,17,115గా కళ్లు చెదరగొడుతోంది. గడచిన తొమ్మిదేళ్లుగా తలసరి రాబడిలో 156 శాతం వృద్ధి, ప్రగతి ప్రస్థాన గతిలో తెలంగాణ చురుకుదనాన్ని ప్రస్ఫుటం చేస్తోంది!

వయసులో చిన్నదైనా, భౌగోళిక విస్తీర్ణం ప్రాతిపదికన దేశంలోని సగానికిపైగా రాష్ట్రాలకన్నా తెలంగాణ పెద్దది. అందుబాటులోని అవకాశాలను అందిపుచ్చుకొంటూ ప్రతిబంధకాలను అధిగమిస్తూ- తనకన్నా ముందే ఏర్పడ్డ రాష్ట్రాలు అబ్బురపడేలా తెలంగాణ పురోగమిస్తోంది. ఆరోగ్య సూచీలు, సులభతర వాణిజ్య విధానాల అమలు, భూరికార్డుల నవీకరణలో తెలంగాణ ముందున్నదని పేర్కొన్న పదిహేనో ఆర్థిక సంఘం- సమీకృత అభివృద్ధిలో భేష్‌ అంటూ ప్రశంసించింది. ప్రత్యేక రాష్ట్రంగా కన్ను తెరిచినప్పుడు పోనుపోను విద్యుత్‌ సంక్షోభం ముమ్మరించి తెలంగాణ చుట్టూ దట్టంగా చీకట్లు ముసిరేస్తాయన్న అంచనాలు భీతిగొలిపేవి. రాష్ట్రావతరణ నాటికి ఉన్న 7778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యానికి ఈ తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర వేల మెగావాట్లు అదనంగా జతపడి- తెలంగాణ నేడు విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా అవతరించింది. రహదారులు, పైవంతెనలు (ఫ్లైఓవర్లు) సహా మౌలిక వసతుల పరికల్పన, పోలీసింగ్‌, శాంతి భద్రతలు, ఇన్నొవేషన్‌లపై ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో విస్తృత పారిశ్రామికీకరణకు ప్రాణవాయువులూదింది. దేశ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణను ఆకర్షణీయ అనువైన గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కేటీఆర్‌ చేపట్టిన విశేష కార్యాచరణ వేలసంఖ్యలో ఉపాధి అవకాశాలకు బాటలు పరుస్తున్న తీరు స్ఫూర్తిమంతం. గట్టిగా తలచుకుంటే, ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే కొత్త రాష్ట్రమైనా అభివృద్ధి మిషన్‌తో ఎలా కదం తొక్కవచ్చో తెలంగాణ సాధికారికంగా నిరూపిస్తున్న వైనం- ఎన్నో రాష్ట్రాలకు విలువైన గుణపాఠం. సాధించినదానితో సంతృప్తి చెందకుండా జనాకాంక్షలను నూరుశాతం నెరవేర్చడానికి కేసీఆర్‌ ప్రభుత్వం యంత్రాంగానికి, శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. ఎందరో అమరవీరుల ఆత్మార్పణలతో, నెత్తుటి త్యాగాలతో అవతరించిన రాష్ట్రం కోసం, సముజ్జ్వల భవిత కోసం వారంతా పునరంకితమైతేనే- బంగారు తెలంగాణ వైపు ప్రస్థానం చరిత్రాత్మకమవుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.