డ్రాగన్ పన్నాగాలకు విరుగుడు
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, ప్రజాసంబంధాల పరంగా ఇండియా, నేపాల్ బాంధవ్యం శతాబ్దాల నాటిది. సిక్కిమ్, పశ్చిమ్ బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో 1850 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను పంచుకొంటున్న నేపాల్- భద్రతాపరంగా భారతావనికి అత్యంత కీలకమైనది.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, ప్రజాసంబంధాల పరంగా ఇండియా, నేపాల్ బాంధవ్యం శతాబ్దాల నాటిది. సిక్కిమ్, పశ్చిమ్ బెంగాల్, బిహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో 1850 కిలోమీటర్లకు పైగా సరిహద్దులను పంచుకొంటున్న నేపాల్- భద్రతాపరంగా భారతావనికి అత్యంత కీలకమైనది. ప్రభుత్వాధినేతల పరస్పర పర్యటనలతో 1997 వరకు ఉభయ దేశాల స్నేహబంధం సాఫీగానే సాగిపోయింది. ద్వైపాక్షిక అంశాలపై దృష్టిసారిస్తూ ఆపైన భారత ప్రధానులెవరూ నేపాల్‌లో పర్యటించలేదు. అదే సమయంలో ప్రాంతీయ అగ్రరాజ్యంగా ఇండియా తమపై పెత్తనం చేస్తోందన్న ప్రతికూల భావనలు అటు నేపాల్‌లో ప్రచారమయ్యాయి. చిరకాల మిత్రుల నడుమ అపనమ్మకాల అగాథం మరింతగా విస్తరించకుండా తాను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రధాని మోదీ చొరవ తీసుకున్నారు. 2014లో కాఠ్‌మాండూలో పర్యటించిన ఆయన- నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో ఇండియా జోక్యం చేసుకోబోదని స్పష్టంగా ప్రకటించారు. ప్రగతిపథంలో చేయూతనందిస్తామంటూ వ్యూహాత్మకంగా అమిత ప్రాధాన్యం కలిగిన పొరుగు దేశంతో భారత మైత్రికి మోదీ ఆనాడు కొత్త చివుళ్లు తొడిగారు. చైనా చేతిలో కీలుబొమ్మగా కేపీ ఓలీ మధ్యలో కొన్నేళ్లు కాఠ్‌మాండూలో అధికారం చలాయించి ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడినపడుతున్న వాటికి ప్రతిఫలాలుగా- నేపాల్ ప్రధాని ‘ప్రచండ’ తాజా భారత పర్యటనలో ఏడు ఒడంబడికలు ముడివడ్డాయి. ఆర్థిక, వాణిజ్య, ఇంధన రంగాల్లో పరస్పర సహకారంతో పాటు అనుసంధానత, మౌలిక వసతుల పెంపు ద్వారా ఉభయతారక ఫలితాల సాధనకు అవి చోదకశక్తులు కానున్నాయి!
ఇండియాలో నివసిస్తూ, పనిచేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకొంటున్న నేపాలీల సంఖ్య ఎనభై లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే- నాలుగోవంతుకు పైగా నేపాల్ జనాభాకు భారతదేశమే జీవనాధారం. నిర్నిరోధ స్వేచ్ఛాయుత సరిహద్దుల ద్వారా ప్రజల రాకపోకలు, సరకుల రవాణాకు 1950 నాటి ఇండో-నేపాల్ ఒప్పందం ప్రధాన భూమికగా నిలుస్తోంది. ఇరుదేశాలు శాంతియుతంగా సహజీవనం సాగించాలన్న నాటి ఒడంబడిక స్ఫూర్తికి పొలిమేర పేచీలు గండికొడుతున్నాయి. వివాదాస్పద కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలకు సంబంధించి కేపీ ఓలీ హయాములో నేపాల్ అనుసరించిన ఏకపక్ష విధానాలు- ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఉత్తరాఖండ్‌లోని చంపావత్ సరిహద్దు సమీపంలో అయిదు హెక్టార్ల భారత భూభాగాన్ని కాఠ్‌మాండూ ఆక్రమించిందన్న ఆ రాష్ట్ర అటవీశాఖ నివేదిక నిరుడు కలకలం సృష్టించింది. దక్షిణాసియాలో తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవడం కోసం ఇండియాను అస్థిరపరిచేందుకు తెగబడుతున్న చైనా- కొన్నేళ్లుగా నేపాల్‌ను దువ్వుతోంది. తన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ద్వారా దానికి నిధుల వల విసిరింది. చైనా రుణపాశాల్లో చిక్కి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక అనుభవాలు- నేపాల్ నాయకత్వాన్ని పునరాలోచనలో పడేశాయి. ఇండియాతో సౌహార్ద సంబంధాల కొనసాగింపు దిశగా వారిని అవే ప్రేరేపిస్తున్నాయి. జలవిద్యుత్తు రంగంలో ఇతోధిక సహకారం- హిమాలయ రాజ్యంతో ఇండియా మైత్రీబంధాన్ని పటిష్ఠం చేయగలదు. రామాయణ సర్క్యూట్ ప్రాజెక్టుల వంటివి ఇరువైపులా పర్యాటక వృద్ధికి దోహదపడతాయి. బీజింగ్ గుప్పిట్లోకి నేపాల్ జారిపోకూడదంటే- ఆ దేశంలో భారత పెట్టుబడులూ ఇనుమడించాలి. ఇరుగుపొరుగులను రెచ్చగొట్టి ఇండియాకు ఎడతెగని తలనొప్పులను సృష్టించాలన్నది డ్రాగన్ దేశ పన్నాగం. దాన్ని దీటుగా తిప్పికొట్టాలంటే- చుట్టుపక్కల చిన్నదేశాలకు భారత్ విశ్వసనీయ భాగస్వామి కావాలి. వాటి ఆకాంక్షలూ ఆందోళనలను అర్థం చేసుకుంటూ, కష్టనష్టాల్లో వాటికి తోడుగా నిలిచే ఆప్తబంధువు పాత్రను పోషించాలి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా
-
YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?