మిథ్యాపథకం చేస్తారా?

బడి ఈడు పిల్లల చదువుకునే హక్కు ఆకలిమంటల్లో కమిలి, ఆశలన్నీ అణగారి పోరాదన్న సదుద్దేశంతో జాతీయ స్థాయిలో 28 ఏళ్ల క్రితం ప్రారంభమైంది- ప్రాథమిక విద్యకు పౌష్టికాహార దన్ను. ఆరేళ్ల తరవాత ఆ అన్న వితరణకే ‘మధ్యాహ్న భోజన పథకం’గా పేరు మార్చారు.

Published : 05 Jun 2023 00:34 IST

డి ఈడు పిల్లల చదువుకునే హక్కు ఆకలిమంటల్లో కమిలి, ఆశలన్నీ అణగారి పోరాదన్న సదుద్దేశంతో జాతీయ స్థాయిలో 28 ఏళ్ల క్రితం ప్రారంభమైంది- ప్రాథమిక విద్యకు పౌష్టికాహార దన్ను. ఆరేళ్ల తరవాత ఆ అన్న వితరణకే ‘మధ్యాహ్న భోజన పథకం’గా పేరు మార్చారు. అందుకయ్యే ఖర్చును వ్యయంగా కాక, రేపటి తరం అభ్యున్నతిని లక్షించి వెచ్చించే పెట్టుబడిగా సంభావించాలి. ఆ దృక్కోణంలోనే కావచ్చు- కేంద్రం రెండేళ్ల నాడు ‘ప్రధానమంత్రి పోషణ్‌ శక్తి నిర్మాణ్‌’గా తిరిగి బారసాల జరిపింది. నిరుడా పథకం అమలు తీరును కూలంకషంగా పరిశీలించిన సంయుక్త సమీక్షా సంఘం ప్రధానంగా వంటకాల జాబితా(మెనూ)లో మార్పులు సూచించింది. ఆ మేరకు జాతీయ పోషకాహార సంస్థ రూపొందించిన మెనూ ఈ నెలలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి అమలు కావాలన్నది తాజా ఆదేశాల సారాంశం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అయిదారు నెలల క్రితం మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం, ఇటీవలి బడ్జెట్లో కేటాయింపులు తెగ్గోయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 1-5 తరగతుల వారి భోజనానికి అయిదు రూపాయల 45 పైసలు, 6-8 తరగతులకు ఎనిమిది రూపాయల 17 పైసల చొప్పున చెల్లించే మొత్తాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇప్పటికే అరకొర చెల్లింపులతో భోజనం సమకూర్చలేకపోతున్నామంటున్న వంట కార్మికులు వాస్తవిక వ్యయం ప్రాతిపదికన ముట్టజెప్పాలని పలు సందర్భాల్లో ధర్నాలు చేపట్టారు. హేతుబద్ధ ధరల సంగతిని గాలికొదిలేసిన కేంద్ర విద్యాశాఖ బడ్జెట్‌ కుదించి కొత్త మెనూ వైపు మొగ్గితే- అదనపు భారాన్ని తలకెత్తుకునేది ఎవరు? ఇక నుంచి వారంలో ఒక రోజు కిచిడీ, వెజ్‌ బిరియానీ తప్పనిసరిగా అందించాలని, ప్రతిరోజూ అన్ని రకాల కూరగాయలతో మిక్స్‌డ్‌ కర్రీ వడ్డించాలని సరికొత్త ఆదేశాలు నిర్దేశిస్తున్నాయి. కిరాణా దుకాణదారులను బతిమాలి, అప్పుచేసి సరకులు తెచ్చి వండి వారుస్తున్న ఏజెన్సీలకిది- మూలిగే నక్కమీద తాటిపండు పడిన చందమే!

అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థకు చెందిన ఆర్థికవేత్తలు, పోషకాహార నిపుణులు, వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు కలిసి 23 ఏళ్ల పాటు సాగించిన విశేష అధ్యయనం ప్రకారం- పాఠశాల దశలో మధ్యాహ్న భోజనం ఆరగించినవారి సంతానంలో ఎదుగుదల లోపాలు తగ్గుతున్నాయి. అంటే, ఒక తరం కడుపు నింపిన పథకం మలితరం శిశువులకూ రక్షాకవచమవుతున్నట్లు శాస్త్రీయంగా రుజువైంది. అందుకు తగ్గట్లు నిధుల కేటాయింపులు, ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు కొరవడటమే దురదృష్ట కరం. కేంద్ర పాఠశాల విద్యాశాఖ, నీతి ఆయోగ్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, వివిధ రాష్ట్రాల అధికారులు, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్తలతో కూడిన నిపుణుల సంఘం- మధ్యాహ్న భోజనం సిద్ధపరచడానికి ఇచ్చే మొత్తాన్ని 20శాతం దాకా పెంచాలని సిఫార్సు చేసినట్లు నిరుడు కథనాలు వెలువడ్డాయి. అప్పటికి చెల్లిస్తున్న ధరలపై 9.6శాతం పెంపుదలకు కేంద్రం ఆమోదించేసరికి, పెదవి విరుపులే ఎదురయ్యాయి. పప్పులు, వంటనూనెలు, కోడిగుడ్లు, కూరగాయల ధరలు మండిపోతున్నా- కిరాణా బిల్లులు, సిబ్బందికి గౌరవవేతనాలపై మొత్తుకోళ్లు అరణ్య రోదనమవుతున్నాయి. ఇప్పుడు మరింతగా నెత్తిన రుద్దుతున్న వ్యయభారం తమ వల్ల కాదని వంట కార్మికులు చేతులెత్తేస్తే- విశిష్ట పథకం కాగితాలకే పరిమితమవుతుంది. పథకం ప్రవచిత లక్ష్యం, స్ఫూర్తి దెబ్బతినిపోతాయి. ఏటా ఆగస్టు నాటికి పీఎం పోషణ్‌పై సామాజిక తనిఖీ చేపట్టాలని, బడుల్లో పెరటి తోటల పెంపకం ద్వారా తాజా కూరగాయలతో వంటలు చేయాలని కేంద్ర విద్యాశాఖ అయిదు నెలల క్రితం అన్ని రాష్ట్రాల్నీ ఆదేశించింది. వాటి పకడ్బందీ అమలుతో పాటు, మార్కెట్‌ ధరవరలకు అనుగుణంగా బిల్లుల చెల్లింపూ పట్టాలకు ఎక్కాలి. సర్వోన్నత న్యాయస్థానం ఏనాడో స్పష్టీకరించినట్లు- బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం ఎవరి దయాధర్మమో కాదు, అది వారి చట్టబద్ధ హక్కు. దాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మిథ్యాపథకం కానివ్వకూడదు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి