ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా...

దేశ సాంస్కృతిక సామాజిక వారసత్వంతో పాటు ఆధునికత, ఆత్మనిర్భరతలకు ప్రతీకగా పార్లమెంటు నూతన భవనం నిర్మితమైంది. ఉభయసభల సమావేశాలకు ఇక ముందు అది వేదిక కానుంది.

Published : 19 Sep 2023 01:02 IST

దేశ సాంస్కృతిక సామాజిక వారసత్వంతో పాటు ఆధునికత, ఆత్మనిర్భరతలకు ప్రతీకగా పార్లమెంటు నూతన భవనం నిర్మితమైంది. ఉభయసభల సమావేశాలకు ఇక ముందు అది వేదిక కానుంది. పార్లమెంటు అంటే- నూట నలభై కోట్ల భారతీయుల ఆశలూ ఆకాంక్షలకు ప్రతిరూపం. శాసనాల రూపకల్పనలో సర్వోన్నతమైన వేదికగా యావద్భారతం బాగోగులకు అది బాధ్యత వహించాలి. ప్రగతి ప్రణాళికల సాఫల్య వైఫల్యాలను నిశితంగా సమీక్షిస్తూ ప్రభుత్వాలకు చట్టసభలు సరైన మార్గనిర్దేశం చేయాలి. పండిత నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, గోవింద్‌ వల్లభ్‌ పంత్‌, కృష్ణమీనన్‌, మధులిమాయే తదితరుల వాక్పటిమతో పార్లమెంటరీ చర్చలు ఒకప్పుడు హుందాగా స్ఫూర్తిమంతంగా సాగేవి. పార్టీలకు అతీతంగా ఆనాటి  ఎంపీల ప్రసంగాలు- వారి ప్రజాసేవానురక్తికి అద్దంపట్టేవి. కాలం గడిచేకొద్దీ గౌరవ సభ్యుల సమరోత్సాహ ప్రదర్శనశాలలుగా చట్టసభలు మారిపోయాయి. చర్చలూ సంవాదాల స్థానంలో అరుపులూ పరస్పర వెక్కిరింతలు, నిరవధిక నిరసనలూ వాకౌట్లు సర్వసాధారణమవుతున్నాయి. ప్రభుత్వాన్ని ఉభయ సభలకు జవాబుదారీ చేసే ప్రశ్నోత్తరాలకు సమయం చిక్కిపోతుంటే- సభ్యుల సమగ్ర పరిశీలనకు నోచుకోకుండానే అనేక బిల్లులు శాసనరూపం దాల్చేస్తున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం లోక్‌సభలో సభ్యుల అనుచిత ప్రవర్తనను గర్హిస్తూ- ‘అత్యున్నత శాసనాధికారంగల సంస్థను బోట్‌క్లబ్‌ స్థాయికి దిగజార్చారు’ అంటూ ఆనాటి స్పీకర్‌ పీఏ సంగ్మా ఆవేదన వ్యక్తపరిచారు. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్న అధికారపక్షం, విపక్షాల తీరుపై ప్రస్తుత లోక్‌సభాపతి ఓంబిర్లా సైతం ఇటీవల తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పోనుపోను పతనమవుతున్న పార్లమెంటరీ ప్రమాణాలు- చట్టసభల గౌరవాన్ని మంటగలుపుతున్నాయి!

ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, సర్కారీ విధానాల్లోని లోటుపాట్లను తూర్పారపట్టడం, మెరుగైన పాలనకు మేలిమి సూచనలు అందించడం- చట్టసభల సభ్యుల విధివిహిత కర్తవ్యం. ఆ మేరకు తమ గళాలను వినిపించేందుకు ప్రజాప్రతినిధులు అందరికీ పార్లమెంటులో సమాన అవకాశాలు లభించాలి. దానికి గండికొడుతూ- సభలు సమావేశమయ్యే రోజుల సంఖ్య క్రమేణా తెగ్గోసుకుపోతోంది. మొదటి లోక్‌సభ(1952-57) ఏడాదికి సగటున 135 రోజుల పాటు భేటీ అయ్యింది. 2014-19 మధ్యకాలంలో లోక్‌సభ పనిదినాలు సంవత్సరానికి సగటున 66కే పరిమితమయ్యాయి. అమెరికా, యూకే, జపాన్‌, కెనడా, జర్మనీ తదితర దేశాల్లో ప్రజాప్రతినిధుల సభలు ఏడాదికి సగటున వంద రోజులకు పైగా సమావేశమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల సమధిక భాగస్వామ్యంతో కూలంకష సంవాదాలకు అక్కడ అవి వేదికలవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి పుట్టిల్లుగా నేతల నోట అభివర్ణితమవుతున్న భారతదేశంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమాలకు ఎంతవరకు దోహదపడుతోందన్నదే పార్లమెంటు పనితీరుకు గీటురాయి. నూతన భవనంలో భేటీల సంఖ్య ఇతోధికమై, పార్లమెంటరీ సంప్రదాయాలకు మన్ననదక్కి, దేశ బంగారు భవిష్యత్తుకు దిక్సూచీలుగా ఉభయసభలు విరాజిల్లాలి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల నుంచి రప్పించిన నిర్మాణ సామగ్రి, కళాకృతులతో కొత్త పార్లమెంటు భవంతికి వన్నెలద్దారు. ప్రసిద్ధ కళాకారుల సంగీత ఉపకరణాలను సేకరించి భవనంలో అందంగా అలంకరించారు. ఆయా వాద్యాల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే- దేశీయంగా భిన్న ప్రాంతాలకు విభిన్న అవసరాలూ ఆకాంక్షలుంటాయి. అందుకు తగినట్లుగానే అసమ్మతి స్వరాలూ వినిపిస్తాయి. సంఖ్యాబలంతో వాటిని అణచివేయకుండా సభలో అధికారపక్షం రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తేనే- ‘ఏక్‌ భారత్‌... శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తి పరిఢవిల్లుతుంది. సహేతుక విమర్శలు, నిర్మాణాత్మక సలహాలతో జన క్షేమంకోసం తమవంతు పాత్రను ప్రతిపక్షాలు సమర్థంగా పోషించాలి. సంకుచిత రాజకీయాలను పక్కనపెట్టి దేశంకోసం అర్థవంతమైన సమన్వయంతో ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి నడవాలి. పార్లమెంటు నూతన భవంతి సాక్షిగా అన్ని రాజకీయపక్షాలు అందుకు ప్రతినబూనితేనే- భారత ప్రజాస్వామ్య రథగమనం సాఫీగా సాగుతుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి