పట్టాలు తప్పిన భద్రత
దేశం నలుమూలలా నెలకొన్న 7325 స్టేషన్లు... రోజూ పట్టాలపై పరుగులు తీసే 22 వేలకు పైగా రైళ్లు... ఎకాయెకి రెండుకోట్ల 40లక్షల మంది దాకా ప్రయాణికులు... భారతీయ రైల్వే మహా విస్తృతికి దర్పణం పట్టే గణాంకాలివి.
దేశం నలుమూలలా నెలకొన్న 7325 స్టేషన్లు... రోజూ పట్టాలపై పరుగులు తీసే 22 వేలకు పైగా రైళ్లు... ఎకాయెకి రెండుకోట్ల 40లక్షల మంది దాకా ప్రయాణికులు... భారతీయ రైల్వే మహా విస్తృతికి దర్పణం పట్టే గణాంకాలివి. అందుకే అది జాతి ప్రగతికి అక్షరాలా జీవనాడిగా అధికారిక ప్రకటనల్లో హోరెత్తుతోంది. దురదృష్టవశాత్తు, అంతటి బృహత్తర వ్యవస్థ ఏటేటా అసంఖ్యాక కుటుంబాల్లో ఆరని శోకాగ్నులు రగిలిస్తోంది. రైళ్లు పట్టాలు తప్పి, పరస్పరం ఢీకొని, ఇతరత్రా ప్రమాదాలూ దుర్ఘటనల్లో అమూల్యమైన ప్రాణాలెన్నో గాలిలో కలిసిపోతున్నాయి. మరెందరో క్షతగాత్రులుగా మిగిలి కుమిలిపోతున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా వారికి సంబంధీకులకు ఇచ్చే పరిహారాన్ని పదింతలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద సంభవించే ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఇకనుంచీ అయిదు లక్షల రూపాయల పరిహారం ముట్టజెబుతామంటోంది. కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే, అటువంటి కేసులకు పరిహారం చెల్లించేది లేదని రైల్వేబోర్డు భీష్మించడం విస్మయపరుస్తోంది. కాపలాదారుల్నీ నియమించకుండా, పరిహారం సైతం ఎగ్గొడతామనడం అమానుషం. వాస్తవానికి, 2017లో సవరించిన రైల్వే ప్రమాదాల పరిహారాల నిబంధనావళి ప్రకారం- ప్రయాణికులెవరైనా మరణిస్తే వారి బంధుగణానికి చెల్లించాల్సిన పరిహారం ఎనిమిది లక్షల రూపాయలు. తాజాగా రైల్వేబోర్డు పదింతలకు పెంచామంటున్న మొత్తం- అంతకన్నా తక్కువ! గత పదేళ్లలో రైలు ప్రమాదాలు రెండులక్షల అరవైవేల నిండు ప్రాణాల్ని కబళించినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ ఇటీవలే ధ్రువీకరించింది. రైలుపట్టాలు దాటుతూ ఏటా వేలమంది మృత్యువాత పడుతున్నారని గతంలో అనిల్ కాకోద్కర్ కమిటీ నిగ్గుతేల్చింది. రైల్వేల నిర్లక్ష్యానికి, వ్యవస్థాగత అలసత్వానికి బలైపోతున్న అభాగ్యుల ప్రాణాలకు ఏ లెక్కన ఎలా విలువ కడతారు? బోర్డు ఖరారు చేసిందో, రైల్వే నిబంధనావళి సూచిస్తున్నదో నష్టపరిహారం చెల్లించినంత మాత్రాన ఆప్తుల్ని అయినవాళ్లను శాశ్వతంగా కోల్పోయినవారి దుఃఖోద్వేగాల్ని బాపగలరా? ఎంతో కొంత పరిహారం విదపడం కాదు... ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానం చేర్చాలి. ఒక్కముక్కలో- పరిహారం కాదు... భద్రత ముఖ్యం!
ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనాల తరవాత ఇండియాదే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. వాటితో పోలిస్తే ఆధునికీకరణలో భారతీయ రైల్వేలది యోజనాల వెనకంజ. ప్రకృతి విపత్తులు, ఉగ్రదాడుల వంటివి సంభవించినప్పుడు ఉపగ్రహ సంకేతాల సాయంతో ప్రమాదభరిత మార్గాల నుంచి రైళ్లను క్షణాల్లో దారి మళ్ళిస్తూ అమెరికా, చైనా ప్రభృత దేశాలు అబ్బురపరుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు భద్రతలో, సమయపాలనలో... జపాన్‌ది విశిష్టముద్ర. ఐరోపాలో అత్యంత భద్రమైన రైల్వే వ్యవస్థకు డెన్మార్క్ చెరగని చిరునామా. దేశీయంగా పరిస్థితి ఏమిటి? పటిష్ఠ కంట్రోల్ కమాండ్ వ్యవస్థల ఆవిష్కరణలో మందభాగ్యం భారత్‌ను నేటికీ పీడిస్తోంది. దేశ రైల్వే వ్యవస్థ ప్రమాదాలకు, అభద్రతకు పర్యాయపదంగా మారిందని సాక్షాత్తు పార్లమెంటరీ కమిటీలే తూర్పారపట్టాయి. భారతీయ రైల్వేల్లో ప్రయాణభద్రతకు నిలువునా తూట్లు ఎందుకు పడుతున్నాయన్నది బహిరంగ రహస్యం. భద్రతా శ్రేణికి చెందిన లక్షా 70 వేల పోస్టులు సహా 2.74లక్షల రైల్వే కొలువులు భర్తీ కాకుండా ఖాళీగా పోగుపడి ఉన్నాయి. ‘కాగ్’ నివేదికాంశాలు వెల్లడించిన సమాచారం ప్రకారం- రైలుమార్గాల ఆధునికీకరణకు నిధులు తెగ్గోసుకుపోతున్నాయి. ట్రాకుల మరమ్మతులకు ప్రత్యేకించిన సొమ్మూ పూర్తిగా వినియోగం కావడంలేదు. 26శాతం రైలు ప్రమాదాలకు ఆయా మార్గాల్లో ట్రాకుల నవీకరణ కొరవడటమే ప్రధాన కారణమని నిగ్గుతేలినా- సత్వర దిద్దుబాటు చర్యలు ఎండమావుల్ని తలపిస్తున్నాయి. ఇటువంటప్పుడు పట్టాలపై ప్రయాణభద్రత ఆనవాయితీగా ఛిద్రం కాకుండా ఉంటుందా? ‘వందేభారత్’ రైళ్లు ప్రవేశపెట్టినట్లు కేంద్ర అమాత్యులు ఘనంగా చాటుకుంటున్నా- వాటి గరిష్ఠ వేగానికి తగ్గట్లు ట్రాకుల ఆధునికీకరణ కోసం అయిదారేళ్ల నిరీక్షణ తప్పదంటున్నారు. రైల్వేల ద్వారా దేశాభివృద్ధి ఉరకలెత్తాలని ప్రధాని మోదీ ఏడేళ్లనాడు బృహత్తర లక్ష్యం నిర్దేశించారు. అది సాకారం కావాలంటే- రైల్వేకు భద్రతను బాధ్యతగా మప్పాలి. రైలెక్కినవారి ప్రాణాలు గాలిలో దీపాలయ్యే దుస్థితిని నివారించడానికి... కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ఆధునిక వసతుల పరికల్పన ప్రాథమ్య ప్రాతిపదికన సత్వరం పట్టాలకు ఎక్కాలి. ప్రయాణ భద్రత, సేవల వాసి ఇనుమడిస్తేనే- భారతీయ రైల్వేల ముఖచిత్రం తేటపడుతుంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
Dhulipalla Narendra: రాజకీయ లబ్ధి కోసమే జగన్ నీటి చిచ్చు పెట్టారు: ధూళిపాళ్ల నరేంద్ర
-
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి
-
Chess: ఒకే ఇంటి నుంచి ఇద్దరు గ్రాండ్ మాస్టర్లు.. ప్రజ్ఞానంద-వైశాలి అరుదైన ఘనత
-
Mike Tyson: ‘ఆ పంచ్ దెబ్బలకు రూ.3 కోట్లు ఇవ్వండి’.. మైక్ టైసన్‌ను డిమాండ్ చేసిన బాధితుడు
-
Rohit - Hardik: రోహిత్-హార్దిక్ విషయంలో సెలక్టర్లకు కఠిన సవాల్ తప్పదు: నెహ్రా
-
Honda Recall: హోండా మోటార్ సైకిళ్ల రీకాల్.. కారణం ఇదే!