చెలరేగుతున్న సైబర్ చోరులు
ఒక పక్క డిజిటల్ విప్లవం, మరోవైపు సైబర్ ఉగ్రవాదం... నవీన సాంకేతిక ప్రపంచానికి రెండు భిన్న పార్శ్వాలివి. డిజిటలీకరణ వైపు దేశదేశాల పురోభివృద్ధికి సైబర్‌దాడులు ప్రతిబంధకాలవుతున్నాయన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల విశ్లేషణ అక్షర సత్యమని అనుదినం నిరూపిస్తూ చోరముఠాలు చెలరేగిపోతున్నాయి. ర్యాన్సమ్‌వేర్లను అడ్డుపెట్టుకుని ఎన్నో సంస్థల కీలక సమాచారాన్ని తస్కరించి ఆపై వాటిని బెదిరించి వందల కోట్ల రూపాయల మొత్తాల్ని దర్జాగా దండుకుంటున్నాయి...
Published : 21 Nov 2023 00:59 IST
ఒక పక్క డిజిటల్ విప్లవం, మరోవైపు సైబర్ ఉగ్రవాదం... నవీన సాంకేతిక ప్రపంచానికి రెండు భిన్న పార్శ్వాలివి. డిజిటలీకరణ వైపు దేశదేశాల పురోభివృద్ధికి సైబర్‌దాడులు ప్రతిబంధకాలవుతున్నాయన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల విశ్లేషణ అక్షర సత్యమని అనుదినం నిరూపిస్తూ చోరముఠాలు చెలరేగిపోతున్నాయి. ర్యాన్సమ్‌వేర్లను అడ్డుపెట్టుకుని ఎన్నో సంస్థల కీలక సమాచారాన్ని తస్కరించి ఆపై వాటిని బెదిరించి వందల కోట్ల రూపాయల మొత్తాల్ని దర్జాగా దండుకుంటున్నాయి. క్యాలిఫోర్నియాలోని ఒక సాఫ్ట్‌వేర్ సంస్థ, జర్మనీలోని ప్రభుత్వ టెలికాం వ్యవస్థ, ఫిన్లాండుకు చెందిన ఒక విద్యా సంస్థ... తాజాగా బాధితుల జాబితాలోకి చేరాయి. అటువంటి ర్యాన్సమ్‌వేర్ దాడులకు సంబంధించి ఆసియా పసిఫిక్, జపాన్ ప్రాంతంలో ఆస్ట్రేలియా తరవాత ఇండియాలోనే ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నట్లు ఎనిమిది నెలల క్రితం ‘పాలో ఆల్టో నెట్‌వర్క్స్’ నివేదిక మదింపు వేసింది. ఆరోగ్య, రక్షణ, విద్యా రంగాలపై అంతర్జాతీయంగా వారానికి సగటున 983 సైబర్ దాడులు నమోదవుతున్నాయన్న ‘సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్’ నివేదిక- వాటి సంఖ్య ఇండియాలో 1787గా లెక్క కట్టింది. సైబర్ ఉల్లంఘనల్లో ప్రపంచ సరాసరికి రెండింతలు భారత్‌లో చోటుచేసుకుంటున్నాయంటూ జాతీయ సైబర్ భద్రతా సమన్వయకర్త ఎం.యు.నాయర్ వెల్లడించిన తాజా గణాంకాలూ అంతర్జాల నేరగాళ్లు ఇక్కడ ఎంతగా చెలరేగిపోతున్నారో కళ్లకు కడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల మాటున నెట్టింట విరుచుకుపడుతున్న సైబరాసురులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకతను అవి ఎలుగెత్తుతున్నాయి.
విశ్వవ్యాప్తంగా ర్యాన్సమ్‌వేర్ దాడులకు సంబంధించి మూడు నెలల క్రితం ‘సోనిక్ వాల్’ నివేదిక తులనాత్మక విశ్లేషణను పొందుపరచింది. ప్రధాన ఆర్థిక శక్తులైన అమెరికా, యూకేలలో ర్యాన్సమ్ దాడులు తగ్గుముఖం పట్టగా- ఇండియా, జర్మనీలలో పెద్దయెత్తున జోరందుకోవడానికి కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వాలు తక్షణం దృష్టి పెట్టాలి. సంవత్సర కాలంలో దేశీయంగా ప్రతి పది మంది వినియోగదారుల్లో ఏడుగురు మోసగాళ్ల పాలబడ్డట్లు మైక్రోసాఫ్ట్ సర్వే నిరుడు ధ్రువీకరించింది. ‘క్లౌడ్ ఫ్లేర్’ ఇటీవలి అధ్యయనం ప్రకారం- గత సంవత్సరం 83శాతం భారతీయ సంస్థలు సైబర్ దాడులకు గురయ్యాయి. మరింత ఆందోళనకర అంశమేమిటంటే- దేశవ్యాప్తంగా ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లపై ప్రతి రోజూ పది లక్షల దాకా సైబర్ ఉల్లంఘనలు నమోదవుతున్నాయి. ఝార్ఖండ్‌లోని జామ్‌తాడా, రాజస్థాన్‌లోని భరత్‌పుర్, యూపీలోని మధుర వంటివి సైబర్ నేరగాళ్ల అడ్డాలుగా వెలుగొందుతున్నాయి. చాపకింద నీరులా సైబర్ ముష్కర మూకల కార్యకలాపాలు విస్తరిస్తుండగా- వాటిని వెలికి లాగి జైలు ఊచలు లెక్కపెట్టించడంలో పోలీసు దళాలు చాలావరకు విఫలమవుతున్నాయి. సైబర్ భద్రత సూచీలో సౌదీ అరేబియా, ఎస్తోనియా వంటివీ మనకన్నా మెరుగ్గా రాణిస్తున్నాయి. 5జీతో నెట్‌వర్క్ ఆధారిత సేవల్లో పెరిగే వేగంవల్ల సైబర్ నేరాలు మరింత పోటెత్తుతాయన్న ఆందోళన నేపథ్యంలో- సమాచార భద్రతా మండలి (డీఎస్‌సీ) సూచనలు శిరోధార్యం. 2025 నాటికి దేశంలో పది లక్షల సైబర్ నిపుణుల అవసరం ఉంటుందన్నది సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అంచనా. దాంతోపాటు జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యదళం, రాష్ట్రాల మధ్య నిరంతర సమాచార మార్పిడి చురుగ్గా పట్టాలకు ఎక్కాలి. సైబరాసురులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కఠిన శిక్షలు విధించి అమలుపరిస్తేనే నేరాల ఉరవడి తగ్గుతుంది. సైబర్ బందిపోట్ల పీచమణిస్తేనే ‘డిజిటల్ ఇండియా’ పునాదులు బలపడతాయి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ
దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /
సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.