దేశ భవితతో చెలగాటం

పోటీ పరీక్షలు ఏవైనా సరే- పకడ్బందీగా జరగాలి. వాటి నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా, అది ఆశావహులైన అభ్యర్థులకే కాదు- యావద్దేశ ప్రయోజనాలకూ చేటుచేస్తుంది.

Published : 14 Jun 2024 05:49 IST

పోటీ పరీక్షలు ఏవైనా సరే- పకడ్బందీగా జరగాలి. వాటి నిర్వహణలో ఏ చిన్న తప్పు దొర్లినా, అది ఆశావహులైన అభ్యర్థులకే కాదు- యావద్దేశ ప్రయోజనాలకూ చేటుచేస్తుంది. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష(నీట్‌-యూజీ)లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ కొద్దిరోజులుగా ఆందోళనలు రేగుతున్నాయి. ఏడు హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గత నెల అయిదో తేదీన దేశవిదేశాల్లోని 4,750 కేంద్రాల్లో జరిగిన ‘నీట్‌’కు సుమారు 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్ష ఫలితాలు జూన్‌ 14న- అంటే నేడు వెలువడవచ్చునని అందరూ భావించారు. ఆశ్చర్యకరంగా అంతకు పది రోజుల ముందే అవి వెలుగుచూశాయి. దేశమంతా లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోలాహలంలో మునిగిపోయిన జూన్‌ నాలుగో తేదీన జాతీయ పరీక్షా మండలి(ఎన్‌టీఏ) వెలువరించిన ‘నీట్‌’ ఫలితాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అందుకు ప్రధాన కారణం- 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు పొందడం! 2020లో ఒకరు, 2021లో ఇద్దరు, 2022లో ముగ్గురు, 2023లో ఇద్దరు మాత్రమే సాధించగలిగిన ఆ ఘనతను ఈ సంవత్సరం ఒకేసారి అంతమంది ఎలా చేజిక్కించుకోగలిగారన్నది బేతాళప్రశ్నగా మారింది. అంతలోనే 1563 మందికి ప్రత్యేకంగా 70-80 గ్రేస్‌మార్కులు కలిపిన సంగతి బట్టబయలైంది. దానిపై విమర్శల వర్షం కురవడంతో ఆయా విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్‌మార్కులను తొలగిస్తామని కేంద్రం తాజాగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మొన్న మంగళవారం విచారణలో భాగంగా న్యాయపాలిక వ్యాఖ్యానించినట్లు- ‘నీట్‌’ పవిత్రతకు విఘాతం కలిగింది. పగలూ రాత్రీ కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అది తీరని మనోవేదనకు గురిచేస్తోంది! 

దేశీయంగా వైద్యవృత్తిలోకి రావాలనుకునేవారు మొదట ‘నీట్‌’లో ఉత్తీర్ణులు కావాలి. ప్రతిభా సామర్థ్యాలతో నిమిత్తం లేకుండా అడ్డదారుల్లో వైద్య విద్యాకోర్సుల్లోకి ప్రవేశించేవారి మూలంగా దేశానికి వాటిల్లే నష్టం అపారం. అందువల్ల డాక్టర్లను తీర్చిదిద్దే ప్రతిష్ఠాత్మక కోర్సుల్లో ప్రతిభకే పట్టంకట్టాలని సుప్రీంకోర్టు గతంలో అనేకసార్లు హితబోధ చేసింది. ‘పరీక్షల్లో అక్రమాలు విద్యారంగ ప్రమాణాలతోపాటు దేశాభివృద్ధినీ దెబ్బతీస్తాయి... యావత్‌ జాతికీ హానికారకమైనవి అవి’ అనీ సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. అయినప్పటికీ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడకపోవడమే భారతావని ప్రారబ్ధం! కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) 2015లో నిర్వహించిన అఖిల భారత వైద్యప్రవేశపరీక్ష... ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయ్యింది. 6.30 లక్షల మంది విద్యార్థులకు అప్పట్లో అది పిడుగుపాటైంది. ‘నీట్‌’ నిర్వహణ బాధ్యతలు ఎన్‌టీఏకి దఖలుపడిన దరిమిలా ఆ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 1.09 లక్షల ఎంబీబీఎస్‌ సీట్లే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సీటుకు 24 మంది పోటీపడాల్సిన వాతావరణంలో విద్యార్థులపై ఉండే ఒత్తిడిని ఊహించలేం. వారికి ఇబ్బందులు ఎదురుకాకుండా ‘నీట్‌’ను పక్కాగా నిర్వహించాల్సిన ఎన్‌టీఏ ఏమంటోంది? ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో తప్పులు, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా 1563 మందికి గ్రేస్‌మార్కులు ప్రసాదించామని సెలవిస్తోంది. ఆ వాదనపై తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు ఎన్‌టీఏ నుంచి జవాబులు ఇంకా రావాల్సి ఉంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే ఏకపక్ష విధానాలు ఏ విధంగానూ సమర్థనీయం కావు. ప్రజారోగ్యానికి ప్రాణప్రదమైన వైద్య విద్యాకోర్సుల్లోకి ఏ ఒక్క అనర్హుడూ అడుగుపెట్టకూడదని ‘సుప్రీం’ గతంలో నిర్దేశించింది. ‘నీట్‌’ నిర్వహణకు అదే ప్రమాణం కావాలి. ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల్లో నిజానిజాలతోపాటు ఎన్‌టీఏ నిర్ణయాల్లో సహేతుకతను లోతైన విచారణ ద్వారా కేంద్రం సత్వరం నిగ్గుతేల్చాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.