తితిదే ప్రక్షాళన... భక్తజన ఆకాంక్ష!

‘అదివో అల్లదివో శ్రీహరివాసము...’ అంటూ అన్నమయ్య మనసారా కీర్తించిన కలియుగ వైకుంఠం- తిరుమల. కొండలలో నెలకొన్న ఆ కోనేటిరాయడి దివ్యధామాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, తుచ్ఛ రాజకీయాలకు కూడలిగా మార్చిన మహాపాతకుడు- జగన్‌.

Published : 15 Jun 2024 00:48 IST

‘అదివో అల్లదివో శ్రీహరివాసము...’ అంటూ అన్నమయ్య మనసారా కీర్తించిన కలియుగ వైకుంఠం- తిరుమల. కొండలలో నెలకొన్న ఆ కోనేటిరాయడి దివ్యధామాన్ని ఫక్తు వ్యాపార కేంద్రంగా, తుచ్ఛ రాజకీయాలకు కూడలిగా మార్చిన మహాపాతకుడు- జగన్‌. పదవిలో ఉన్నన్నాళ్లూ స్వప్రయోజనాలకోసం వెంపర్లాడుతూ యావదాంధ్రను ఛిద్రంచేసిన వైకాపా అధినేత పెడపాలనలో- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ సైతం పూర్తిగా మసకబారింది. జగన్‌ దన్నుతో తితిదేపై పెత్తనం చలాయించిన వివాదాస్పద నేతలు, ఉన్నతాధికారుల మూలంగా భక్తులకు అందాల్సిన పలు సేవల్లో నాణ్యత దిగనాసిల్లిపోయింది. శ్రీవేంకటేశ్వరుడి జలప్రసాదంలో, వెంగమాంబ అన్నదాన సత్రంలో అందిస్తున్న ఆహారంలో శుచీ శుభ్రతలు లేవని, ఆరోగ్య ప్రమాణాలను అసలేమాత్రం పాటించడం లేదని కొద్దినెలల క్రితం కేంద్ర హోంశాఖ నిపుణుల బృందమే తేల్చిచెప్పింది. వ్యాపార, ఆర్థిక, రాజకీయ అవసరాలను తీర్చుకునేందుకు తిరుమలను వాడుకున్న వైకాపా పెద్దలు- క్షమార్హం కాని ఘోరాపరాధాలు ఎన్నింటికో పాల్పడ్డారు. శ్రీనివాసుడి పట్ల తరగని భక్తిప్రపత్తులతో ఆబాలగోపాలం సమర్పించిన కానుకల సొమ్మును జగన్‌ వంధిమాగధులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టారు. దేవుడి డబ్బును ఇష్టమొచ్చినట్లు వెచ్చించడానికి వీల్లేదంటూ ఆర్నెల్ల క్రితం ఏపీ హైకోర్టే ఆదేశాలివ్వాల్సి వచ్చేంతగా తితిదేలో తిష్ఠవేసిన పెత్తందారులు చెలరేగిపోయారు. వైకాపా ఏలుబడిలో అపవిత్రమైన తిరుమలకు మళ్ళీ పూర్వవైభవం కల్పించేలా తితిదేను సంపూర్ణంగా సంస్కరిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఆ మేరకు తిరువేంకటాచలంలో చీడపురుగులను ఏరిపారేసే ప్రక్షాళనా యజ్ఞం సత్వరం ప్రారంభం కావాలి!

అబద్ధాల నిచ్చెన మీద అధికార పీఠానికి ఎగబాకిన భ్రష్టచరిత్ర జగన్‌ది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పింక్‌ డైమండ్‌ను మాయం చేశారని, వకుళమాత పోటులో తవ్వకాలు జరిపి నగలను కొట్టేశారంటూ 2019 ఎన్నికలకు ముందు వైకాపాసురులు విస్తృతంగా దుష్ప్రచారం చేశారు. ఇక పదవుల్లోకి వచ్చాకేమో తిరుమల పవిత్రధామాన్ని కాసులవేటకు వేదికగా మార్చుకున్నారు. మందీమార్బలాన్ని వెంటేసుకుని ఎప్పుడంటే అప్పుడు దర్శనానికి వెళ్తూ, సామాన్య భక్తులకేమో నరకం చవిచూపించారు. ‘ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా గోవిందా’ అనే భక్తకోటి శరణుఘోషతో మార్మోగాల్సిన పుణ్యక్షేత్రంలో ధూర్త రాజకీయ విమర్శలు, చిల్లర వ్యాఖ్యలకు దిగారు. తితిదేకు పెద్దదిక్కు వంటి కీలక పోస్టులో గతంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమించేవారు. ఆ సంప్రదాయాన్ని కాలదన్నిన జగన్‌ సర్కారు- తమకు కావాల్సిన అధికారిని దిల్లీ నుంచి డెప్యుటేషన్‌ మీద తీసుకొచ్చి మరీ తితిదేపై సర్వాధికారాలు కట్టబెట్టింది. వెంకన్న స్వామికి కాదు, వైకాపాకు సేవకుడిగా పనిచేసిన ఆయన- తన యజమాని చీకటి వ్యవహారాలెన్నింటినో చక్కబెట్టారు. తితిదే పాలకమండలిలో నేరచరితులకు పెద్దపీట వేసిన జగన్‌- శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచారు. నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా వార్షిక బడ్జెట్‌ కలిగిన తితిదేలో జగన్‌ పార్టీ ప్రబుద్ధులు చేయని అక్రమాలు లేవు. చక్కగా ఉన్న కట్టడాలను కూలగొట్టి, పునర్నిర్మాణాలకు టెండర్లు పిలిచి కమిషన్లు కొల్లగొట్టడం వారికి పరిపాటైంది. గడచిన అయిదేళ్లలో స్వామివారి లడ్డూ ధరల నుంచి కొండ మీది గదుల అద్దె వరకు అన్నింటినీ విపరీతంగా పెంచిపారేసి సామాన్య భక్తులను నిలువుదోపిడీ చేశారు. జగన్‌ జమానాలో ఊరూరికీ పాకిన గంజాయి మహమ్మారి ఆఖరికి తిరుమలకూ చేరింది. నిరుడు నెల రోజుల వ్యవధిలో అటువంటి ఉదంతాలు రెండు వెలుగుచూశాయి. ‘చక్రమా హరిచక్రమా వక్రమైన దనుజుల వక్కలించవో’ (వక్రబుద్ధులు కలిగిన రాక్షసులను వక్కలుచెయ్యి ఓ సుదర్శన చక్రమా!) అని కోరుకున్నాడు అన్నమాచార్యుడు. అసంఖ్యాక భక్తజనమూ ఇప్పుడదే ఆశిస్తోంది... శ్రీనివాసుడి సన్నిధిలో పాపిష్టి పనులకు తెగబడిన వారందరూ తగిన దండనకు అర్హులని గళమెత్తుతోంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు