పోలవరానికి సైంధవుడు జగన్‌

కష్టపడి ఒకడు ఇల్లు కడితే- కల్లు తాగి మరొకడు దాన్ని కాలబెట్టాడట! గడచిన అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వాకాలూ అలాగే అఘోరించాయి.

Updated : 19 Jun 2024 06:32 IST

ష్టపడి ఒకడు ఇల్లు కడితే- కల్లు తాగి మరొకడు దాన్ని కాలబెట్టాడట! గడచిన అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి నిర్వాకాలూ అలాగే అఘోరించాయి. ఏపీ భవితకు ప్రాణవాయువు వంటి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా వేగంగా సాగుతున్న కీలక తరుణంలో జగన్‌ సీఎం అయ్యారు. ‘పోలవరాన్ని నేనే పూర్తి చేసి తీరతా’నని శాసనసభ సాక్షిగా ఆయన సొరకాయ కోతలు కోశారు. ప్రాజెక్టు పనులను కొలిక్కితెచ్చి పొలాలకు నీళ్లిచ్చేస్తామంటూ పలు గడువులనూ వల్లెవేశారు. ఆ మాటలన్నింటినీ గోదాట్లో కలిపేసిన జగన్‌- పోలవరం పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అంతుబట్టనంతగా మొత్తం ప్రాజెక్టునే నాశనం చేశారు. పోలవరం పూర్తయితే- కొత్తగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు పారి బంగారు పంటలు పండేవి. 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడి, రైతన్నల కడగండ్లు తీరేవి. గోదావరి జలాలను కృష్ణాకు మళ్ళించి, ఆపై రాయలసీమ నీటి కరవును తీర్చేందుకు అవకాశం దక్కడమే కాదు- ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ జలకళను సంతరించుకునేవి. 960 మెగవాట్ల జలవిద్యుత్తును, విశాఖపట్నంతో పాటు 540 గ్రామాలకు తాగునీటినీ అందించగలిగే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం. 2019 మే నాటికి ప్రధాన డ్యాం 64శాతానికి పైగా  నిర్మితమైంది. ఎడమ కాల్వ పని 71.6శాతం దాకా సాగితే- కుడికాల్వ నిర్మాణం 91.9 శాతం మేర సంపూర్ణమైంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మిగిలిన పనులను వడివడిగా చేయించాల్సిన జగన్‌- రివర్స్‌ టెండరింగ్‌ పన్నాగాలతో ఏపీ నోట్లో బూడిదకొట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించినట్లు- రాష్ట్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన పోలవరానికి ఉరితాళ్లు పేనిన జగన్‌ది... క్షమించరాని నేరం. ఆయన చేతుల్లో దారుణ వంచనకు గురైన రైతాంగానిది తీరని శోకం. జగన్‌ విధ్వంసక పాలన- ఆంధప్రదేశ్‌ గుండెలపై పచ్చి నెత్తుటి గాయం!

పోలవరానికి వైకాపా ప్రభుత్వమే ఆటంకమైందని ప్రధాని మోదీ  ఇటీవల తూర్పారపట్టారు. జగన్‌ అవినీతివల్లే పోలవరం పడకేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దుమ్మెత్తిపోశారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జగన్‌ సర్కారు ఒంటెత్తు పోకడలను కేంద్రం గతంలోనే సూటిగా తప్పుపట్టింది.   టెండర్ల రద్దు వల్ల పోలవరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మొదట్లోనే హెచ్చరించింది. దాన్ని ఖాతరు చేయని జగన్‌- జరుగుతున్న పనులను నిలిపేయించి, ఆ తరవాత అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఎగువ కాఫర్‌ డ్యాంలోని ఖాళీలను సకాలంలో పూడ్చకుండా- డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడానికి కారకులయ్యారు. దిగువ కాఫర్‌ డ్యాం పనుల్లో వల్లమాలిన జాప్యం చేసిన జగన్‌ ప్రభుత్వంవల్లే ప్రధాన ఆనకట్ట వరకు వరద చొచ్చుకొచ్చింది. వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో గైడ్‌బండ్‌ కుంగిపోయింది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన కీలక నిర్మాణం దెబ్బతింటే- అదో చిన్నసమస్య అంటూ కొట్టిపారేసిన బాధ్యతారాహిత్యం జగన్‌ది. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రగతిని వారానికోసారి సమీక్షించేవారు. అధికార యంత్రాంగానికి సరైన మార్గనిర్దేశం చేస్తూ, ప్రాజెక్టు పనులను ఆయన పరుగులుపెట్టించారు. ‘రివర్స్‌’ సీఎం జగన్‌ జమానాలో అదంతా తలకిందులైంది. నోటిదురుసుతనం తప్ప మరేమీ తెలియని తెలివిమాలిన వ్యక్తులను జలవనరుల శాఖ మంత్రులుగా నియమించిన వైకాపా అధినేత- ప్రజాప్రయోజనాల పట్ల లెక్కలేనితనంతో పోలవరాన్ని పరిహాసాల పాల్జేశారు. పునరావాస కల్పనపైనా శీతకన్ను వేసి నిర్వాసితుల ప్రాణాలతో చెలగాటమాడారు. జగన్‌ భ్రష్టవిధానాల కారణంగా పోలవరం నిర్మాణ వ్యయం ఎగబాకింది. స్పిల్‌వే మినహా ప్రాజెక్టులోని మిగిలిన కట్టడాల భద్రత సైతం పెనుప్రమాదంలో చిక్కుకుంది. రాష్ట్రానికి జీవనాడి వంటి ప్రాజెక్టు పనులను మళ్ళీ పట్టాలకెక్కించే అగ్నిపరీక్షలో చంద్రబాబు నెగ్గుకురావాలని ఏపీ ప్రజానీకం ఆశిస్తోంది... నిండు మనసుతో ఆశీర్వదిస్తోంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.