మానవాళికి మహాశత్రువు

నూట పదిహేడేళ్ల క్రితం ప్రపంచమిలా ఉండేది కాదు. ఎందుకంటే, అప్పటికి ఇంకా ప్లాస్టిక్‌ పుట్టలేదు. ప్లాస్టిక్‌ ఆవిర్భావం దరిమిలా ప్రపంచ ముఖచిత్రమే మారిపోయింది. కాఫీ కప్పునుంచి కంప్యూటర్ల దాకా అది సర్వత్రా ఉనికిని చాటుకుంటూ మానవాళి వర్తమానాన్ని, భవిష్యత్తును సాంతం మార్చేసింది.

Published : 24 Jun 2024 00:54 IST

నూట పదిహేడేళ్ల క్రితం ప్రపంచమిలా ఉండేది కాదు. ఎందుకంటే, అప్పటికి ఇంకా ప్లాస్టిక్‌ పుట్టలేదు. ప్లాస్టిక్‌ ఆవిర్భావం దరిమిలా ప్రపంచ ముఖచిత్రమే మారిపోయింది. కాఫీ కప్పునుంచి కంప్యూటర్ల దాకా అది సర్వత్రా ఉనికిని చాటుకుంటూ మానవాళి వర్తమానాన్ని, భవిష్యత్తును సాంతం మార్చేసింది. సముద్రాల నుంచి మహోన్నత పర్వతశ్రేణుల వరకు అంతటా ప్లాస్టిక్‌ భూతం జడలు విరబోసుకుంటోంది. గాలిలో నీటిలో భూమ్మీద పెద్దయెత్తున పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు జీవకోటికి పెను సవాళ్లు రువ్వుతున్నాయి. విశ్వవ్యాప్తంగా తయారవుతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్లో సగానికి పైగా ఒకసారి వాడి పారేసేవే. దేశదేశాల్లో నిమిషానికి 10 లక్షలకు పైగా ప్లాస్టిక్‌ సీసాలు అమ్ముడవుతున్నాయంటే, ఎంత వేగంగా వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయో వేరే చెప్పాలా? మరింత దిగ్భ్రాంతపరచే యథార్థం ఏమిటంటే- మనుషులిప్పుడు తమకు తెలియకుండానే సూక్ష్మ ప్లాస్టిక్‌ను తినేస్తున్నారు, తాగేస్తున్నారు. ప్లాస్టిక్‌ ముక్కల్ని మింగేస్తున్న జలచరాల్ని భుజించేవారి శరీరంలోకి అవి నేరుగా చేరిపోతున్నాయి. ఒక లీటరు నీటి సీసాలో సగటున 2.4 లక్షల సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులుంటాయని ఇటీవలి పరిశోధన వెల్లడించింది. అలా మానవ శరీరంలోకి చొరబడుతున్న సూక్ష్మ ప్లాస్టిక్‌ మానవ వృషణాల్లోకీ చేరి వీర్యకణాల సంఖ్య తగ్గుదలకు కారణమవుతున్నట్లు అధ్యయనాలు ధ్రువీకరిస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు శరీర కణజాలాన్ని, డీఎన్‌ఏను దెబ్బతీస్తాయని, వాటివల్ల క్యాన్సర్ల ముప్పు పెచ్చరిల్లుతుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ రక్తనాళాలను, గుండెను సైతం సూక్ష్మ ప్లాస్టిక్‌ చావుదెబ్బ తీస్తోంది. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా ఎందరో బహిరంగ ప్రదేశాల్లో పారేస్తున్న ప్లాస్టిక్‌ సంచులు అసంఖ్యాక మూగజీవాల్ని నరకయాతనల పాలు చేస్తున్నాయి. చనిపోతున్న ఆవులు, గేదెల పొట్టలో 30, 40 కిలోల దాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఒక్క 2024 సంవత్సరంలోనే విశ్వవ్యాప్తంగా 22 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు పోగుపడతాయని ఎర్త్‌ యాక్షన్‌ సంస్థ మదింపు వేసింది. ప్లాస్టిక్‌ కాలుష్యంలో 60శాతానికి పుణ్యం కట్టుకుంటున్న 12 దేశాల్లో భారత్‌ ఒకటి. జీవావరణానికి మరణశాసనం లిఖిస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని నియంత్రించాల్సిన నైతిక బాధ్యతను ఇండియాతో పాటు తక్కిన దేశాలూ సమర్థంగా నిభాయించాలి!

మానవాళి నిత్యజీవితంలో ప్లాస్టిక్‌ ఇప్పుడు- విడదీయలేని అంతర్భాగం. అంతకు మించి, వదిలించుకోలేకపోతున్న ప్రబల శత్రువు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టడమెలాగన్న అంశంపై ఇటీవలి 175 దేశాల కెనడా సదస్సూ చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేకపోయింది. ఏకగ్రీవ తీర్మానాలు కుదిరి, ఉమ్మడి కార్యాచరణ పట్టాలకు ఎక్కేదాకా తీరిగ్గా నిరీక్షించగల వెసులుబాటు, అవకాశం ప్రపంచ దేశాలకు లేవిప్పుడు. పాలిథీన్‌ ఉత్పత్తులు క్షీణించి రూపుమాసిపోవడానికి వెయ్యేళ్ల కాలం పడుతుంది. ఆలోగా వాటిల్లే దుష్పరిణామాలు లెక్కలేనన్ని. ప్లాస్టిక్‌ వ్యర్థాలు వాననీటిని భూమిలోకి ఇంకకుండా అడ్డుకుని పరిసర ప్రాంత జలాశయాల్ని కలుషితం చేసేసి వరదలు పోటెత్తడానికి కారణమవుతున్నాయి. అటువంటి వ్యర్థాల్ని వదిలించుకోవడం, రాబడి అవకాశాన్ని సృష్టించుకోవడమెలాగో ఉత్తరాఖండ్, జోషీమఠ్‌ మునిసిపాలిటీ సోదాహరణంగా చాటుతోంది. యాత్రికులు వాడి పారేసిన ఖాళీ బాటిళ్లను సేకరించి అక్కడి సిబ్బంది వాటిని ఇటుకలుగా మార్చి విక్రయిస్తున్నారు. సుమారు మూడు టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా కోటీ 20లక్షల రూపాయల ఆదాయం కళ్లజూడటం, స్ఫూర్తిమంతమైన ఉదాహరణ. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించి చెన్నై, నొయిడా, కొచ్చి, ముంబయి, కోల్‌కతా వంటిచోట్ల రహదారులు నిర్మిస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి డీజిల్‌ తయారీ యత్నాలూ వెలుగుచూస్తున్నాయి. ఇటలీ, యూకే, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ ప్రభృత దేశాలూ వ్యర్థాలతో లబ్ధి చేకూరే మార్గాన్వేషణలో చురుగ్గా ముందడుగు వేస్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు గుట్టలుగా పోగుపడి అనర్థాలు దాపురించకుండా నివారించే కృషిలో రాష్ట్రాల మధ్య పోటీని పెంపొందించే జాతీయ స్థాయి కార్యాచరణకు కేంద్రం పూనిక వహించాలి. ప్రాణాంతక ప్లాస్టిక్‌ ఉత్పత్తి, వినియోగాల నియంత్రణకు సంబంధించి విధివిధానాలన్నింటినీ ప్రభుత్వం చురుగ్గా ప్రక్షాళించాలి. రేపటితరంలో బాధ్యతాయుత వర్తన మొగ్గతొడిగేలా ప్రాథమిక స్థాయినుంచీ పాఠ్యప్రణాళికల్ని సంస్కరించాలి. పౌరసమాజం కీలక భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్‌ రక్కసి కోరలనుంచి దేశం బయటపడగలిగేది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.