ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తుల వెనక అక్రమాలెన్నో ఉన్నాయన్న అభియోగాలకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ధారించి దాదాపు పదమూడేళ్లవుతోంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని స్పష్టంచేసిన హైకోర్టు- జగన్‌ కంపెనీల్లోకి వెల్లువెత్తిన పెట్టుబడుల ఆనుపానులను నిగ్గుతేల్చాలని సీబీఐకి అప్పట్లో ఆదేశాలిచ్చింది.

Published : 05 Jul 2024 01:21 IST

వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆస్తుల వెనక అక్రమాలెన్నో ఉన్నాయన్న అభియోగాలకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ ఉమ్మడి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిర్ధారించి దాదాపు పదమూడేళ్లవుతోంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని స్పష్టంచేసిన హైకోర్టు- జగన్‌ కంపెనీల్లోకి వెల్లువెత్తిన పెట్టుబడుల ఆనుపానులను నిగ్గుతేల్చాలని సీబీఐకి అప్పట్లో ఆదేశాలిచ్చింది. లోతైన కుట్రలు, ప్రజాధన స్వాహాపర్వాలతో ముడివడిన ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని, దేశ ఆర్థిక వ్యవస్థకు అవి అత్యంత ప్రమాదకరమైనవని జగన్‌కు సంబంధించిన వ్యాజ్యంలోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించి పదకొండేళ్లు దాటిపోయింది. ఆర్థిక నేరగాళ్లను కఠినంగా శిక్షించకపోతే మొత్తం సమాజం అన్యాయమైపోతుందని న్యాయపాలిక గతంలో హెచ్చరించినప్పటికీ  వైకాపా అధినేత అక్రమాస్తుల కేసుల్లో విచారణలు నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగానే పడిఉన్నాయి. తండ్రి చేతుల్లోని అధికారాన్ని తన అక్రమార్జనకు పనిముట్టుగా మార్చుకున్న జగన్‌- క్విడ్‌ ప్రొ కొ(నీకది నాకిది) పన్నాగాలతో రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది దర్యాప్తు సంస్థల వాదన. దానికి సంబంధించి సీబీఐ పదకొండు, ఈడీ తొమ్మిది అభియోగపత్రాలు దాఖలుచేసి సంవత్సరాలు గడచిపోతున్నాయి. నిందితుల కాలహరణ వ్యూహాలతో ఆయా కేసుల్లో విచారణలు ఇప్పటికి మూడువేల సార్లకు పైగా వాయిదాలుపడ్డాయి. తీవ్రస్థాయి నేరాభియోగాలను ఎదుర్కొంటూనే 2019లో ఏపీ సీఎం అయిన జగన్‌- ఆపై అయిదేళ్ల పాటు యమదర్జాగా అధికార భోగాలను అనుభవించారు. ఆయన అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణకు తెలంగాణ హైకోర్టు తాజాగా ఆదేశించింది. జగన్‌పై నమోదైన ఆర్థిక నేరాల కేసులు ఇకనైనా వేగంగా ఒక కొలిక్కి రాకపోతే- నేరన్యాయ వ్యవస్థపై ప్రజావిశ్వాసం పూర్తిగా అడుగంటిపోతుంది!

నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు చిన్నపాటి సర్కారీ కొలువు దొరకడమూ దుర్లభమే. అటువంటిది, యావజ్జీవ కారాగార శిక్ష విధించదగిన కేసుల్లో నిందితుడైన జగన్‌ ప్రభుత్వాధినేతగా రాచకార్యాలు వెలగబెట్టడం- ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు! ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి జమానాలో జడ్చర్లలో 250 ఎకరాల్లో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటుకు అనుమతులొచ్చాయి. ఆ సెజ్‌లో తమకు 75 ఎకరాల చొప్పున కావాలని అరబిందో, హెటిరో సంస్థలు సర్కారును అభ్యర్థించాయి. ఆ వెంటనే వాటికి భూకేటాయింపులు జరిగిపోయాయి. అందుకు ప్రతిఫలంగా జగన్‌ కంపెనీలకు కోట్లాది రూపాయలు ముట్టినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. గరిష్ఠంగా యావజ్జీవ జైలుశిక్ష పడే అవకాశం ఉన్న ఈ కేసులో జగన్‌మోహన్‌ రెడ్డి ఏ1 అయితే, విజయసాయిరెడ్డి ఏ2. వైకాపా అధినేత మీది మరికొన్ని కేసుల్లోనూ విచారణలు పూర్తయ్యి, నేరాభియోగాలు రుజువైతే- జీవితకాల కారాగారవాసం తప్పదు. అంతటి తీవ్రమైన నేరారోపణలను నెత్తినమోస్తున్న జగన్, ఆయన సహ నిందితులు- చట్టాల్లోని లోపాలు, న్యాయప్రక్రియలోని సంక్లిష్టతలను ఆసరాగా చేసుకుని స్వేచ్ఛాజీవితాలు గడుపుతున్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో 134కు పైగా డిశ్చార్జి పిటిషన్లు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా మూలుగుతున్నాయి. సీబీఐ కోర్టులో న్యాయమూర్తుల బదిలీలతో విచారణలు ఎప్పటికప్పుడు మొదటికొస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి అప్పటి ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,474 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజాప్రతినిధులు నిందితులైన కేసుల్లో దర్యాప్తు, విచారణలు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా నిబంధనలను సంస్కరించాలి. నేరగాళ్లుగా తేలిన నేతలను రాజకీయాల్లోంచి శాశ్వతంగా వెలేయాలి. ఆ దిశగా శాసన, న్యాయవ్యవస్థలు  చొరవ తీసుకోవాలి. అప్పుడే నేరగ్రస్త రాజకీయాల కబంధ హస్తాల్లో చిక్కి విలవిల్లాడుతున్న భారత ప్రజాస్వామ్యం ఊపిరి పీల్చుకోగలుగుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.