మాదక మాఫియాపై ఉక్కుపాదం

మత్తుకోరల మహా విషభుజంగం చిమ్ముతున్న గరళ ప్రభావంతో దేశంలో భిన్న వర్గాల జీవితాలు నిలువెల్లా కమిలిపోతున్నాయి. యథేచ్ఛగా రెచ్చిపోతున్న మాదకాసురుల దుశ్చేష్టలు ప్రధానంగా యువత భవితకు ఉరితాళ్లు పేనుతున్నాయి.

Published : 06 Jul 2024 01:05 IST

త్తుకోరల మహా విషభుజంగం చిమ్ముతున్న గరళ ప్రభావంతో దేశంలో భిన్న వర్గాల జీవితాలు నిలువెల్లా కమిలిపోతున్నాయి. యథేచ్ఛగా రెచ్చిపోతున్న మాదకాసురుల దుశ్చేష్టలు ప్రధానంగా యువత భవితకు ఉరితాళ్లు పేనుతున్నాయి. గంజాయి సాగు కేంద్రంగా ఉత్తరాంధ్ర, కొకైన్‌ రాజధానిగా ముంబయి, వివిధ ప్రాంతాలకు డ్రగ్స్‌ సరఫరా కేంద్రస్థలిగా హైదరాబాద్‌ భ్రష్టుపట్టిన వాతావరణం ఆలోచనాపరుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. డ్రగ్స్‌ కేసులలో ప్రముఖ వ్యక్తులున్నా ఉపేక్షించవద్దని ఆమధ్య యంత్రాంగానికి పిలుపిచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి- రాష్ట్ర యాంటీనార్కోటిక్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌)ను పరిపుష్టీకరిస్తామంటున్నారు. మాదకద్రవ్యాల కబంధ హస్తాల్లోంచి నవతరాన్ని కాపాడుకోవడమే లక్ష్యమని నినదిస్తూ ఆయన తాజాగా వినూత్న ప్రతిపాదనతో ముందుకొచ్చారు. చిత్రం విడుదల సమయంలో టికెట్ల ధరల పెంపుదలకోసం, షూటింగుల అనుమతుల నిమిత్తం వచ్చే సినీ పరిశ్రమవారు సామాజిక బాధ్యతగా నిర్వర్తించాల్సిన పనేమిటో రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. డ్రగ్స్‌ నియంత్రణ, సైబర్‌ నేరాల కట్టడిపై రెండు నిమిషాలలోపు వీడియోలు తయారుచేసి పంపాలన్న నిబంధన ఉభయతారక యోచన. ఆ వీడియోలను థియేటర్లలో ప్రదర్శించి జనచైతన్యం పెంపొందించాలన్న ఆలోచన ప్రశంసనీయం. సాధారణ ప్రజానీకంపైన సినిమా నటులు, క్రీడాకారుల వంటివారి ప్రభావ తీవ్రత దృష్ట్యా- డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారం విజయవంతమవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. మరోవైపు- ఏడు ప్రాంతీయ మాదకద్రవ్య నియంత్రణ విభాగాలను, నాలుగు నార్కోటిక్‌ పోలీస్‌ స్టేషన్లను తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతామంటోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్‌ కేంద్రాలుగా ఆ ప్రత్యేక ఠాణాలు పనిచేస్తాయంటున్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు నుంచి అభియోగపత్రాల దాఖలు వరకు ఆయా ఠాణాల అధికారులే పర్యవేక్షించే ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలను కేంద్రం, తక్కిన రాష్ట్రాలు చురుగ్గా పరిశీలించాలి. గంజాయి ఉత్పాతాన్ని మూడు నెలల్లో అరికడతామంటున్న ఏపీలోనూ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలూ మత్తు దందాసురుల వెన్నులో వణుకు పుట్టించే కృషిలో పోటీపడితే- తెలుగుగడ్డమీద మాదకరక్కసిపై గెలుపు సంపూర్ణమవుతుంది.

ఏపీలో అన్నిస్థాయుల విద్యాసంస్థల్లోకీ గంజాయి వ్యాపించడానికి, ఊరూవాడా డ్రగ్స్‌ లభ్యత పెంపొందడానికి పుణ్యం కట్టుకున్న జగన్‌ సర్కారు భూస్థాపితమయ్యాక, మొట్టమొదటి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం కీలకనిర్ణయం ప్రకటించింది. హోంమంత్రి అనిత సారథ్యంలో అయిదుగురు సభ్యుల మంత్రివర్గ ఉపసంఘాన్ని కొలువుతీర్చింది. రాష్ట్రంలో గంజాయి సాగు, స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపి, డ్రగ్స్‌ మాయవలలో యువత చిక్కుకోకుండా నివారించడమే క్యాబినెట్‌ సబ్‌కమిటీ అవతరణ లక్ష్యం. ఉపసంఘం సారథి అనిత విశాఖ జైలును సందర్శించి అక్కడి రెండువేలమంది ఖైదీలలో 12వందల మందివరకు గంజాయి కేసులు నమోదైనవారేనంటూ వెల్లడించిన యథార్థం నిశ్చేష్టపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంక్షోభ తీవ్రతను పరికించే కావచ్చు- గంజాయి అక్రమ రవాణాను, విస్తృత వినియోగాన్ని కర్కశంగా అణిచిపారేస్తామని నూతన డీజీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరిస్తున్నారు. ఏపీ, తెలంగాణల స్ఫూర్తితో గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌ తరహాలో రాష్ట్రాలవారీగా యాంటీ నార్కోటిక్‌ బ్యూరోల ఏర్పాటు, వాటిమధ్య మాదకమాఫియా కదలికలపై నిరంతర సమాచార స్రవంతి నేడు అత్యంత అవసరం. సమాజంపట్ల వినాశకర దుష్ప్రభావం కనబరుస్తున్న మాదక నేరగాళ్లందరినీ రెండేళ్లలో జైళ్లలోకి నెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా 2022 డిసెంబరులోనే ప్రతిన పూనారు. జాతి నెత్తిన కత్తిలా వేలాడుతున్న మాదక మహాముప్పును తప్పించే విధ్యుక్తధర్మ నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకోన్ముఖంగా పురోగమించాలి. 140కోట్లకు పైబడిన సువిశాల జనాభాకు నెలవైన దేశం మనది. యువత, బడిపిల్లలతోపాటు కోట్లాది పౌరుల వర్తమానాన్ని భవిష్యత్తును మాదక సంక్షోభం కొండచిలువలా చుట్టేస్తోంది. ఈ దశలోనూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నిఘా పర్యవేక్షక విభాగాలు ఉపేక్ష వహిస్తే దేశం ఏమైపోతుంది? ఆస్తుల స్వాధీనం, కఠినాతి కఠిన శిక్షల అమలుతో మాదకశక్తులపై జాతీయస్థాయి ఐక్య కార్యాచరణ ఒక్కటే ఈ ప్రాణాంతక మహోత్పాతానికి సరైన విరుగుడు! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.