నడిచే గ్రంథాలయం

‘రుచికరమైన ఆహారాన్ని ఒక్కడూ కూర్చొని తినరాదు’ అంది వేదం. ఇది ఆహారానికి మాత్రమే వర్తించే విషయం కాదు, ఇష్టమైనవాటికి అన్నింటికీ చెందినది. ఆనందాన్ని అయినవారందరితో పంచుకోవడం ద్వారా దాన్ని పెంచుకోవడం సజ్జనుల జీవనవైఖరి. ‘యశమునందు అనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్‌ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్‌’ అన్నాడు భర్తృహరి.

Published : 07 Jul 2024 00:47 IST

‘రుచికరమైన ఆహారాన్ని ఒక్కడూ కూర్చొని తినరాదు’ అంది వేదం. ఇది ఆహారానికి మాత్రమే వర్తించే విషయం కాదు, ఇష్టమైనవాటికి అన్నింటికీ చెందినది. ఆనందాన్ని అయినవారందరితో పంచుకోవడం ద్వారా దాన్ని పెంచుకోవడం సజ్జనుల జీవనవైఖరి. ‘యశమునందు అనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్‌ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్‌’ అన్నాడు భర్తృహరి. సమాజానికి హితకరమైన ఆలోచనలు, ఆచరణ కారణంగా యశస్సు లభిస్తుంది. అనునిత్యం విద్యార్థిగా ఉంటూ కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటే వివేకం వృద్ధి చెందుతుంది. యశస్సును, వివేకాన్ని పెంచుకుంటూ ఉంటేనే- జీవితం ధన్యం అవుతుంది. అలాంటివారినే సజీవులుగా పరిగణించాలంది- యోగవాసిష్ఠం. ‘సద్గోష్ఠీ ప్రియత్వంబు మైత్రీ సాధు సాంగత్యముల్‌... సజ్జనులతో నిరంతర సాంగత్యం, వారితో విద్యా సంబంధిత సంభాషణల వ్యాపకం- వివేకవంతుల లక్షణాల్లో ముఖ్యమైనది’ అంది మార్కండేయ పురాణం. మనిషిని వివేకవంతుణ్ని చేసే మరోగొప్ప వ్యాపకం- సాహిత్య అధ్యయనం. సాహిత్యం మనిషిని సహృదయుణ్ని చేస్తుంది. మనిషి ఊహలకు రెక్కలు తొడుగుతుంది. నలుపు తెలుపు జీవితానికి రంగులు అద్దుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనిషిని రసజ్ఞుణ్ని చేస్తుంది. కళాశాలల్లోని చదువులు, డిగ్రీలు చేయలేని పని అది. ‘చదువది ఎంతకల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న- ఆ చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్‌’ అని భాస్కర శతకంలో మారన కవి హెచ్చరించింది- దాని గురించే. లోకంలో రసజ్ఞులు, భావుకులు అరుదుగా ఉంటారు. ‘నిజమునకు భావుకుండన సృజనన్‌ పదివేలమందిని ఒక్కడు జనించును’ అని తేల్చారు విశ్వనాథ. ఆ రెండింటికి పుష్టిని చేకూర్చేది- సాహిత్య అధ్యయనం. దాని తీపిని మరిగినవారు- వేదం చెప్పినట్లు ఒక్కరే ఆనందించడంకాక... మరో పదిమందితో పంచుకొనే ప్రయత్నం చేస్తారు.

దానివల్ల సాగర మథనంలో అమృతం ఆవిర్భవించినట్లు- సాహిత్య మథనంలోంచి మాధుర్యం పెల్లుబికి మనిషికి జీవించే క్షణాలను మిగులుస్తుంది. పోచికోలు కబుర్లను సద్గోష్ఠులుగా మారుస్తుంది. ‘లే జవరాలు చెక్కుమీటిన వస వల్చు బాలకుడు డెందమునం కలగంగ నేర్చునే?’ అని పరిహాసం చేసిన శ్రీనాథుడికి సరైన సమాధానం చెప్పాలంటే- మనం సాహిత్యాధ్యయనం విషయంలో బాలకుడిగా మిగిలిపోకుండా ప్రౌఢులం కావాలి. ప్రాచీనం కావచ్చు, ఆధునికం కావచ్చు... గ్రంథపఠనం అనేది మనిషి అభిరుచిని బట్టి మారుతూ వచ్చినా- మారే లోగానే మనిషిని లోబరచుకొని, వ్యసనంగా ఎదిగిపోతుంది. పైగా జీవితకాల సుగుణంగా పర్యవసిస్తుంది. ‘ఎయ్యది హృద్యము? అపూర్వం బెయ్యది?’ అని అడిగి సరిపెట్టుకోలేదు భారతం వినేముందు మునులు, ‘ఎద్దాని వినిన ఎరుక సమగ్రమగును?’ అని ప్రశ్నించారు. ఆ ఎరుకనే సాహిత్యాధ్యయనం వల్ల కలిగే పరమప్రయోజనంగా తేల్చారు మన పెద్దలు. దానిపేరే వివేకం. తిరుపతి-మదనపల్లె మధ్య తిరిగే ఓ బస్సుకు డ్రైవర్‌- జి.ఆర్‌.కుమార్‌ ఆ తరహా విద్యావంతుడు, వివేకవంతుడు. సాహిత్యం రుచి మరిగినవాడు. అందుకే తన బస్సులోని ప్రయాణికులు చరవాణులకు అంకితమైపోయి సమయాన్ని వృథా చేయడం చూసి బాధ పడ్డాడు. వారికి పుస్తక పఠనాన్ని అలవాటు చేయడమే సెల్‌ఫోన్‌ వ్యసనానికి విరుగుడుగా భావించాడు. మంచి మంచి పుస్తకాలతో చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటు చేసి- బస్సును ‘మొబైల్‌ లైబ్రరీ’గా మార్చేశాడు. ఆ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తోందని అధికారులు సైతం అభినందిస్తున్నారట. ఈ వ్యసనం త్వరలో సర్వత్రా వ్యాపించుగాక!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.